గొప్ప ఇంజనీర్‌గా పేరు తెచ్చుకుంటా-సీప్ 1వ ర్యాంకర్ గన్ని సూర్యతేజ

పాలిటెక్నిక్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అసలు ఊహించలేదు. టాప్‌టెన్‌లో నిలుస్తాననుకున్నా. భవిష్యత్తులో ఐఐటీ ముంబైలో బీటెక్ చదివి గొప్ప ఇంజనీర్‌గా పేరు తెచ్చుకోవాలనేదే నా లక్ష్యం. ఇంట్లో అడుగడుగునా ప్రోత్సహిస్తున్నందువల్లే చదువుపై ఇష్టం పెరిగింది. సీప్‌లో రాణించడం కోసం ప్రత్యేకంగా ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. కేవలం స్కూల్లో ఇచ్చిన మెటీరియల్‌తోపాటు అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యం ఇచ్చి చదవడం వల్లే అత్యధిక మార్కులు తెచ్చుకోగలిగానంటున్నారు సీప్ (పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష) ఫలితాల్లో స్టేట్ 1వ ర్యాంకర్‌గా నిలిచిన గన్ని సూర్యతేజ. ఆయనతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ...

ఫస్ట్ ర్యాంకు ఊహించారా?
సీప్ పరీక్ష బాగా రాశాను. టాప్10లో ర్యాంకు వస్తుందనుకున్నా. కానీ ఫలితాలు విడుదలయ్యాక స్టేట్ ఫస్ట్‌ర్యాంకు రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంట్లో తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. నా జీవితంలో ఫస్ట్ సక్సెస్ ఇది. చాలా ఆనందంగా ఉంది.

విద్యా,కుటుంబ నేపథ్యం?
మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. నాన్నది వ్యవసాయం. అమ్మ గృహిణి. 1 నుంచి 10వరకు కాకినాడలోనే చదువుకున్నా.

సీప్ రాయడానికి కారణం? ప్రిపరేషన్ ఎలా సాగింది?
చిన్నప్పటినుంచీ పాలిటెక్నిక్ అంటే ఇష్టం. అందుకే సీప్ రాయాలనుకున్నా. పదోతరగతి ఆరంభం నుంచే ప్రిపరేషన్ ప్రారంభించా.ప్రత్యేకంగా ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు.స్కూల్లో అధ్యాపకులు ప్రత్యేక మెటీరియల్‌ను ఫాలో అయ్యా. ప్రీవియస్ పేపర్లను రిఫర్ చేశాను. పరీక్ష విధానం, ప్రశ్నలలోతు స్థాయి తెలుసుకునేందుకు ఇవి చాలా ఉపయోగపడ్డాయి. అదేవిధంగా సీప్‌లో సక్సెస్ అవడానికి ఏయే సబ్జెక్టులు ఎలా చదవాలనే దానిపై స్కూలు ఉపాధ్యాయులు సహకారం అందించారు. దీంతో అన్ని సబ్జెక్టులను సమానంగా భావించి రోజుకు 3గంటల చొప్పున చదివాను.

మొత్తం మార్కులు?
118 వచ్చాయి. నా హాల్‌టిక్కెట్ నెంబర్ (2511075). మ్యాథ్స్ 60, ఫిజిక్స్ 28, కెమిస్ట్రీ 30 చొప్పున మార్కులు సాధించాను.

జీవిత లక్ష్యం:
పాలిటెక్నిక్‌లో చేరాలా? ఇంటర్ ఎంపీసీలో చేరాలా? అనేది ఇంకా నిర్ణయించుకోలేదు. పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాక నిర్ణయం తీసుకుంటా. పాలిటెక్నిక్ వృత్తివిద్యా కోర్సు. పైగా ఈ కోర్సుతో ఇంజనీరింగ్‌లో చేరే అవకాశం ఉంది కాబట్టి పాలిటెక్నిక్‌వైపే మొగ్గుచూపాలనుకుంటున్నా. ఎప్పటికైనా ఐఐటీ ముంబైలో సీటు సాధించి మెకానికల్, లేదా ఈఈఈ బ్రాంచ్‌లో బీటెక్ చేయాలన్నదే నా లక్ష్యం.

సీప్ రాయాలనుకునే అభ్యర్థులకు సలహా?
పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం పెద్దకష్టంకాదు. పదోతరగతి సబ్జెక్టులపై పట్టుసాధించి.. విశ్లేషణాత్మకంగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు. పదోతరగతి, సీప్ ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ చదవాలి. పరీక్ష హాల్లో ఊహించని ప్రశ్నలు ఎదురైతే కంగారుపడనక్కర్లేదు. ఇలాచేస్తే వచ్చినవి ఆన్సర్ చేయలేం. చాలామంది విద్యార్థులు ఎదుర్కొనే సమస్యే ఇది. ఒత్తిడి జయిస్తే విజయం సులువే.








#Tags