NEET UG Paper Leak: నీట్‌ పిటిషన్లపై సమగ్ర తీర్పు వెల్లడించిన కోర్టు.. సుప్రీం చేసిన సూచనలు..

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ‌స్టు 2న‌ తుది తీర్పు వెలువరించింది.

సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. నీట్‌ పేపర్‌ లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. పేపర్ లీకేజీ హజారీబాగ్, పాట్నాలకు మాత్రమే పరిమితమైందని స్పష్టం చేసింది.

అయితే పరీక్ష వ్య‌వ‌స్థ‌లో ఉన్న లోపాల‌ను నివారించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజ్సెన్సీతోపాటు కేంద్రానికి సుప్రీం సూచించింది.

పేపర్ లీకేజ్ ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని, కమిటీ నివేదిక అమలుపై రెండు వారాల్లో సుప్రీంకోర్టుకు కేంద్ర విద్యాశాఖ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

పేపర్ లీకేజీ ఆరోపణలు, పరీక్షలో ఇతర అవకతవకలపై తీవ్ర వివాదం ఉన్నప్పటికీ, నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)-యుజి మెడికల్ ప్రవేశ పరీక్షను రద్దు చేయకపోవడానికి  గల కారణాలను సుప్రీంకోర్టు శుక్రవారం తన తీర్పులో వివరించింది. 

సుప్రీం చేసిన సూచనలు..

  • ఎవల్యూషన్ కమిటీ ఏర్పాటు చేయాలి
  • స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాలి 
  • పరీక్షా కేంద్రాల కేటాయింపు ప్రక్రియను సమీక్షించాలి 
  • గుర్తింపు, తనిఖీ ప్రక్రియలను మరింత మెరుగుపరచాలి 
  • అన్ని పరీక్ష కేంద్రాలలో సీసీటీవీ లను ఏర్పాటు చేయాలి 
  • పేపర్ టాంపరింగ్ జరగకుండా భద్రతను పెంచాలి 
  • ఫిర్యాదుల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి 
  • సైబర్ సెక్యూరిటీ రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు అంతర్జాతీయ సహకారం తీసుకోవాలి. 

నీట్ లీక్ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మే 5న జరిగిన ఈ పరీక్షను రద్దుచేసి.. మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టును పలువురు ఆశ్రయించగా.. అందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమే కానీ.. దీని ప్రభావం స్వల్పమేనని అభిప్రాయపడింది. నీట్‌ రీ ఎగ్జామ్‌ అవసరం లేదని పేర్కొంది. ఈ పిటిషన్లపై నేడు సర్వోన్నతన్యాయస్థానం సమగ్ర తీర్పు వెలువరించింది.

మరోవైపు నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై విచారణ చేస్తో న్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో నలుగురు అభ్యర్ధులు, ఓ జూనియర్ ఇంజనీర్, ఇద్దరు కుట్రదారులు సహా 13 మందిని నిందితులుగా చేర్చింది.

#Tags