Success Story: బ్యాంకు అధికారి నుంచి .... ఐఏఎస్‌ దాకా... శుభమ్‌చౌదరి సక్సెస్‌ స్టోరీ ఇలా..

కొంతమంది తాము కలలు కన్న ఉద్యోగం సాధిస్తేనే సంతృప్తి చెందుతారు. అంతవరకు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఎంత జీతం వస్తున్నా అసంతృప్తిగానే జీవిస్తుంటారు.

తమ లక్ష్యం ఇది కాదేమో అనుకుంటూ తమ గమ్యం చేరుకునే మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి కోవలోకే వస్తారు శుభమ్‌చౌదరి. తొలి ప్రయత్నంలో విఫలమైనప్పటికీ రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణలో కొనసాగుతూ... మూడో ప్రయత్నంలో జాతీయ స్థాయిలో 11వ ర్యాంకుతో ఐఏఎస్‌ సాధించారు. ఆమె సక్సెస్‌ స్టోరీ ఇదీ...
ప్రిలిమ్స్‌ ఇలా..
చరిత్ర, భూగోళశాస్త్రం, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం సబ్జెక్టుల్లో విజార్డ్‌ సిరీస్, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదివా. కరెంట్‌ అఫైర్స్‌ కోసం ది హిందూతోపాటు ఎకనామిక్‌ టైమ్స్‌ లో ఎడిటోరియల్‌ పేజీలు, ఫ్రంట్‌లైన్‌, విజార్డ్‌ మేగజైన్‌లు ఉపయోగపడ్డాయి. మ్యాథ్స్, ఇంగ్లిష్‌లపై పట్టుండడంతో సీశాట్‌ కోసం ప్రత్యేకంగా సిద్ధం కాలేదు. పాత ప్రశ్నపత్రాలు, మార్కెట్‌లో దొరికే టెస్ట్‌ సిరీస్‌ సాధన చేశా. ప్రిలిమినరీ పరీక్షకు నెల రోజుల ముందు విడుదలయ్యే విజార్డ్‌ సిరీస్‌ కరెంట్‌ అపైర్స్‌ పుస్తకం చాలా ఉపయోగపడింది.  
మెయిన్స్‌....
ప్రిలిమ్స్‌లో చదివిన పుస్తకాలనే మెయిన్స్‌ సన్నద్ధతలోనూ కొనసాగించా. భిన్న పుస్తకాలు చదవడం కంటే చదివిన వాటినే మళ్లీమళ్లీ చదవడం ఎంతో ఉత్తమం. పీజీలో ఎకనామిక్స్‌ కావడంతో ఆప్షనల్‌ సబ్జెక్టుగా దాన్నే తీసుకున్నా. అందులో పూర్తి పట్టుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడాన్ని సాధన చేశా. ఆనర్స్‌ స్థాయి పాఠ్య పుస్తకాలు (డిగ్రీ కంటే కొంచెం ఎక్కువ, పీజీ కంటే కాస్త తక్కువ) ఆప్షనల్‌ సబ్జెక్టు ప్రిపరేషన్‌కి సరిపోతాయి. ఎకనామిక్‌ సర్వే, ఎకనామిక్‌ టైమ్స్‌లను అధ్యయనం చేశా.
ఇంటర్వ్యూలో 198 మార్కులు సాధించా
ఐపీఎస్‌ శిక్షణలో భాగంగా నేషనల్‌ పోలీస్‌ అకాడెమీ (ఎన్‌పీఏ)లో ఉండడంతో ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా సిద్ధం కావడానికి సమయం సరిపోలేదు. కనీసం వార్తా పత్రికలు చదివేంత తీరిక కూడా ఉండేది కాదు. మొబైల్‌లోనే కరెంట్‌ అఫైర్స్‌ ఫాలో అయ్యేదాన్ని. ఎ.పి.సింగ్‌ బోర్డు నన్ను ఇంటర్వ్యూ చేసింది. ప్రొఫెసర్‌ అమర్త్యసేన్‌, ప్రొఫెసర్‌ జగదీశ్‌ భగవతి అభిప్రాయ బేధాల గురించి వివరంగా అడిగారు. నా వృత్తికి  సంబంధించిన ప్రశ్నలూ అడిగారు. పోలీసింగ్, టీచింగ్‌ రెండింటి గురించీ అడిగి తెలుసుకున్నారు. నా హాబీలపైనా ప్రశ్నలేశారు. పోలాండ్‌ చరిత్ర గురించీ ప్రశ్నించారు (11,12 తరగతులు అక్కడ చదువుకోవడంతో). విదేశీ విశ్వవిద్యాలయాలు భారత్‌లో అడుగు పెట్టడం, సామాన్య మానవుడికి పోలీస్‌ వ్యవస్థపై విశ్వాసం లేకపోవడం..తదితర అంశాలూ చర్చకొచ్చాయి. మొత్తం 275 మార్కులకు 198 సాధించా.
కోచింగ్‌ తో లాభమే ...తప్పనిసరైతే కాదు...
కోచింగ్‌తో లాభమే. ఎందుకంటే సరైన శిక్షణ దొరికితే వివిధ స్థాయిల్లో ఎదురయ్యే సమస్యలను, వాటికి పరిష్కారాలను ముందుగానే తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఏ పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలో వివరిస్తారు. సివిల్స్‌కు ఎంపిక కావాలంటే శిక్షణ తప్పనిసరి మాత్రం కాదు. మంచి పుస్తకాలు (ఎన్‌సీఈఆర్‌టీ), మంచి పేపర్లు రెండు, ఒకట్రెండు మేగజైన్‌లు చదివితే జీఎస్‌ పూర్తవుతుంది. వీటితోపాటు ఆప్షనల్‌ సబ్జెక్టునూ చదువుకోవాలి. ఇంటర్నెట్‌ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు. మనకు ఉపయోగపడే కంటెంట్‌ తెలుసుకోవడం కోసమే సోషల్‌మీడియాను వాడుకోవాలి.
విద్యాభ్యాసమిలా...
పదో తరగతి వరకు దిల్లీలోని డీపీఎస్‌ వసంత్‌ కుంజ్‌ పాఠశాలలో చదువుకున్నా. 11,12 తరగతులను ఇంటర్నేషనల్‌ బకులరేట్‌ (ఐబీ) సిలబస్‌తో పోలాండ్‌లోని అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ వర్షావ్‌లో చదివా. మా నాన్న డెప్యుటేషన్‌పై అక్కడకు వెళ్లడంతో రెండేళ్ల పాటు విదేశాల్లో చదవాల్సి వచ్చింది. తర్వాత సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజ్‌లో బీఏ (ఆనర్స్‌) ఎకనామిక్స్‌ చదివాను. దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి ఎంఏ ఎకనామిక్స్‌ పూర్తిచేశా. ఎంఏలో ఉన్నప్పుడే సిటీ బ్యాంక్‌లో ప్లేస్‌మెంట్‌ వచ్చింది. అందులో ఏడాదిపాటు పనిచేశా. తర్వాత నేను చదివిన దిల్లీ విశ్వవిద్యాలయంలోనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరా. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌ కోసం సన్నద్ధమవడం ప్రారంభించా. మొదటి ప్రయత్నంలో విఫలమయ్యా. రెండో సారి ఐపీఎస్‌కు ఎంపికై.. 2013 డిసెంబర్‌లో నేషనల్‌ పోలీస్‌ అకాడెమీలో చేరాను. మూడో ప్రయత్నంలో ఐఏఎస్‌ సాధించా.

#Tags