సివిల్స్ మెయిన్స్ ఎకానమీ.. విశ్లేషణాత్మక అధ్యయనమే విజయ మంత్రం

సివిల్స్ మెయిన్స్ జీఎస్-3 పేపర్‌లో ఎకానమీ సిలబస్‌ను అభివృద్ధి ముఖ్యాంశంగా రూపొందించారు. అభ్యర్థులు ఏ అంశానికి సంబంధించైనా స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా సిద్ధమవాలి. కాన్సెప్టులపై స్పష్టత ఏర్పరుచుకునేందుకు ప్రాధాన్యమివ్వాలి. సిలబస్‌లోని అంశాలకు సంబంధమున్న సమకాలీన పరిణామాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి.
భారత ఆర్థిక వ్యవస్థ
11, 12వ పంచవర్ష ప్రణాళికలు; ప్రభుత్వ రంగం- వనరుల సమీకరణకు ఆధారాలు; ఉపాధి రహిత వృద్ధి; ప్రణాళికా సంఘాన్ని రద్దుచేయాలన్న ప్రభుత్వ నిర్ణయం- ప్రత్యామ్నాయ యంత్రాంగం వంటి అంశాలపై ప్రశ్నలు రావొచ్చు. శ్రామిక శక్తి, పనిలో పాలుపంచుకునే రేటు, లోటు బడ్జెట్ విధానం, ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో ఉపాధిస్తంభన అంశాలపై దృష్టిసారించాలి.

సమ్మిళిత వృద్ధి
11, 12వ ప్రణాళికల పత్రాల్లో సమ్మిళిత వృద్ధికి సంబంధించిన అంశాలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. పేదరికం, నిరుద్యోగాన్ని తగ్గించడం; సామాజిక అభివృద్ధి ద్వారా సమ్మిళిత వృద్ధి ఎలా సాధ్యమవుతుందన్న దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. సమ్మిళిత వృద్ధి, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేయాలి. భారత్‌లో విద్య, ఆరోగ్య రంగాల స్థితిగతుల నేపథ్యంలో సమ్మిళిత వృద్ధి సాధన అంశం ఆధారంగా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.

ప్రభుత్వ బడ్జెటింగ్
ప్రభుత్వ బడ్జెట్ రూపకల్పన, అమలుకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై అవగాహన అవసరం. 2014-15 బడ్జెట్‌ను అధ్యయనం చేయాలి. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం, రెవెన్యూ లోటు, మూలధన రాబడి, మూలధన వ్యయం, ప్రణాళిక వ్యయం, ప్రణాళికేతర వ్యయం, ద్రవ్యలోటు వంటి అంశాలపై పట్టు సాధించాలి.

వ్యవసాయ రంగం
దేశంలోని ముఖ్య పంటలు, ఆహార ఉత్పత్తుల రవాణా, నిల్వ, మార్కెటింగ్, ఈ-టెక్నాలజీ, అవరోధాలు తదితరాలకు సంబంధించిన సమకాలీన పరిణామాలను అధ్యయనం చేయాలి. పంటల తీరుతెన్నులు, నీటిపారుదల పద్ధతులు, నీటిపారుదలలో రకాలు, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు వంటివాటిపై అవగాహన అవసరం. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని వనరులు, అభివృద్ధి పాఠ్యాంశాలను చదవడం వల్ల అనేక అంశాలపై స్పష్టత వస్తుంది. భారత వ్యవసాయ నివేదిక, ఆర్థిక సర్వేలు కూడా ఉపకరిస్తాయి.
 
  • వ్యవసాయ ఉత్పత్తులు-మద్దతు ధరలు, రాయితీలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆహారభద్రత అంశాలపై పట్టు సాధించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వాణిజ్య సదుపాయ ఒప్పందం, భారత్‌లో ఆహార భద్రతకు సంబంధించిన తాజా పరిణామాలపై ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. టెక్నాలజీ మిషన్లు (టెక్నాలజీ మిషన్- కాటన్, టెక్నాలజీ మిషన్- హార్టికల్చర్ తదితరాలు) ముఖ్యమైనవి.
  • దేశంలో ఆహార శుద్ధి పరిశ్రమను సన్‌రైజ్ పరిశ్రమగా చెప్పొచ్చు. దీనికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నందువల్ల ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. కానీ, ప్రామాణిక పుస్తకాల్లో ఆహారశుద్ధి పరిశ్రమకు సంబంధించిన సమకాలీన పరిణామాల సమాచారం లభ్యం కావడం లేదు. అందువల్ల కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను ఉపయోగించుకుని,అవగాహన పెంపొందించుకోవచ్చు. బిజినెస్ లైన్‌లో ప్రచురితమైన ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ- ముఖ్య సవాళ్లు ఆర్టికల్ ఉపయోగపడుతుంది.
  • భారత్‌లో అమలవుతున్న భూసంస్కరణలు సాంఘిక, ఆర్థికాభివృద్ధికి ఎంత వరకు దోహదపడ్డాయి? భూ సంస్కరణలు, కౌలు సంస్కరణల అమల్లో వివిధ రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంది? వంటి అంశాలను తెలుసుకోవాలి.

పారిశ్రామిక విధానాలు
సరళీకరణ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న నిర్మాణాత్మక మార్పులు, మూలధన మార్కెట్‌పై ప్రభుత్వ నియంత్రణల తొలగింపు, పారిశ్రామిక లెసైన్సింగ్ విధానం సరళీకరణ, ఆర్థికాభివృద్ధిలో బహుళ జాతి సంస్థల పాత్ర ముఖ్యమైన అంశాలు. భారత పారిశ్రామికాభివృద్ధిపై 1991 పారిశ్రామిక విధానం ప్రభావంపై అవగాహన ఉండటం తప్పనిసరి.

అవస్థాపనా సౌకర్యాలు, పెట్టుబడులు
స్వాతంత్య్రానంతరం అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిని పరిశీలించాలి. దీనికోసం ఆర్థిక సర్వేను అధ్యయనం చేయాలి. శక్తి సంక్షోభం, ఆర్థికాభివృద్ధిపై ప్రభావం, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో అవస్థాపనా సౌకర్యాల ప్రగతి తదితర అంశాలు ప్రధానమైనవి.
  • ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలోని వివిధ పథకాలు, విధివిధానాలైన బీవోవో (బిల్డ్- ఓన్-ఆపరేట్), డీసీఎంఎఫ్ (డిజైన్-కన్‌స్ట్రక్ట్- మేనేజ్-ఫైనాన్స్), బీవోటీ (బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్) తదితరాలపై అవగాహన అవసరం. ప్రణాళిక సంఘం తాలూకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ నివేదిక, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- భారత అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం నివేదిక ఉపయోగపడతాయి.

-డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్.













#Tags