TS ICET 2024: నిమిషం ఆలస్యమైతే నో ఎంట్రీ.. ప్రశ్నపత్రం మాత్రం ఇలా..

కేయూ క్యాంపస్‌: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం 2024–2025లో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు గానూ నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌.. జూన్ 5, 6తేదీల‌ల్లో మూడు సెషన్‌లలో ఆన్‌లైన్‌లో జరగనుంది.

పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలని టీఎస్‌ ఐసెట్‌ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంటు విభాగం ఆచార్యులు ఎస్‌.నర్సింహాచారి తెలిపారు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోని అనుమతించబోరని స్పష్టం చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 86,156మంది అభ్యర్థులు ఈ ప్రవేశ పరీక్ష రాయనున్నారు. ఇందులో హైదరాబాద్‌లోనే నాలుగు టెస్టు జోన్‌లలో అత్యధికంగా 60,064 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. తెలంగాణలో 111, ఏపీలో 5 మొత్తంగా 116 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

చదవండి: ICET - ANALYTICAL ABILITY | MATHEMATICAL ABILITY | COMMUNICATION ABILITY COMPUTER TERMINOLOGY | PREVIOUS PAPERS | MODEL PAPERS

133 మంది అబ్జర్వర్లను నియమించారు. జూన్ 5న‌ ఉదయం మొదటి సెషన్‌ను 10 నుంచి 12–30 గంటల వరకు, అదే రోజు మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌ను, జూన్ 6న‌ ఒక్క సెషన్‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష ఇంగ్లిష్‌ ప్లస్‌ తెలుగు, ఇంగ్లిష్‌ ప్లస్‌ ఉర్దూ మీడియంలో ఉంటుంది. 

సెట్‌ను ఎంపిక చేయనున్న ఉన్నత విద్యామండలి చైర్మన్‌

రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి జూన్ 5న‌ ఉదయం 8 కాకతీయ యూనివర్సిటీ ఐసెట్‌ కార్యాలయానికి రానున్నారు. ప్రశ్నపత్రం సెట్‌ను డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తారు.   సెట్‌ ఏ, బీలుగా ఉంటుంది. సెట్‌ ఎంపిక తరువాత పరీక్ష కేంద్రాలకు అన్‌లైన్‌లో పంపనున్నారు. అలా ప్రతి సెషన్‌కు ప్రశ్నపత్రం సెట్‌ను ఎంపిక చేస్తామని ఐసెట్‌ కన్వీనర్‌ నర్సింహాచారి తెలిపారు.

#Tags