కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ - 2014..లో భారత్ ర్యాంకు 85
న్యూఢిల్లీ: అవినీతిని అంతం చేసేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు ప్రపంచ అవినీతి సూచీ నివేదికలో తేలింది. అవినీతిని నిర్మూలించే విషయంలో భారత్ కొంత ప్రగతి సాధించినట్లు వెల్లడైంది.
అవినీతి సూచీలో భారత్ స్థానం తగ్గడమే ఇందుకు నిదర్శనం. భూటాన్ మినహా ఇతర దక్షిణాసియా దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ నివేదికను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా(టీఐఐ) బుధవారం విడుదల చే సింది. అవినీతిపై 175 దేశాల్లో అధ్యయనం చేయగా భారత్ 85వ స్థానంలో నిలిచింది. గతేడాది భారత్ స్థానం 94 కావడం గమనార్హం. పొరుగు దేశం శ్రీలం క కూడా 85వ స్థానంలో నిలిచింది. భారత్ స్కోర్ 2013లో 36 కాగా 2014లో 38. అత్యల్ప అవినీతి దేశంగా డెన్మార్క్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. డెన్మార్క్ స్కోర్ 92. ఉత్తరకొరియా, సోమాలియా దేశాలు సంయుక్తంగా చిట్టచివరి స్థానంలో నిలిచాయి.
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్), వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్స్(డబ్ల్యూజేపీ), వరల్డ్ బ్యాంకు, బెర్టిల్స్‌మన్ ఫౌండేషన్ నివేదికలతోపాటు పరిపాలన, వ్యాపార విశ్లేషణ నివేదికల ఆధారంగా అవినీతి సూచీ నివేదికను రూపొందించారు.
- ఆర్థిక వృద్ధితో దేశంలో అవినీతి తగ్గుతుందనే వాదనలో పస లేదని తేలిపోయింది. చైనాలో అత్యధిక ఆర్థిక వృద్ధి కొనసాగుతున్నప్పటికీ... అవినీతిలో ఆ దేశం ర్యాంకు పెరిగింది.
- కేంద్రంలో పూర్తి మెజారిటీతో కూడిన కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం, అవినీతిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండడం, దేశంలో సంస్కరణలు అమలవుతుండడం వంటి కారణాలతో అవినీతి తగ్గుముఖం పడుతున్నట్లు ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ రీసర్చ్ కో-ఆర్డినేటర్ సంతోష్ శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
#Tags