Most Dangerous Tourist Place: ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం ఏదో తెలుసా..?

కొన్ని రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.

ఈ నేపధ్యంలో పలువురు పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్లాన్‌ చేసుకుంటున్నారు. అందమైన పర్యాటక ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రకృతిని చూడాలని చాలా మంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పర్యాటక ప్రాంతం కూడా ఉంది. అయితే అది ఎక్కడ ఉంది? ఎందుకు ఆ ప్రాంతం ప్రమాదకరంగా ఉందో తెలుసుకుందాం.. 

అంటార్కిటికా ఖండం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతంగా పేరొందింది. దక్షిణ ధ్రువం వద్ద ఉన్న ఈ ఖండంలో బలమైన మంచు గాలులు వీస్తాయి. అంటార్కిటికాలో దాదాపు రెండు కిలోమీటర్ల మందపాటి మంచు పలక విస్తరించి ఉంది. రక్తాన్ని గడ్డకట్టే చలి వాతావరణం ఉన్నప్పటికీ, ఈ ఖండంలో సందర్శించదగిన అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచంలో ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి ఉండే ఏకైక ప్రదేశం అంటార్కిటికా. ఇక్కడ శీతాకాలం, వేసవికాలం అనే రెండు సీజన్లు మాత్రమే ఉంటాయి. 

అంటార్కిటికా ఖండంలో వేసవి కాలంలో ఆరు నెలల పాటు పగటి వెలుతురు ఉంటుంది. అయితే చలికాలంలో ఆరు నెలల పాటు ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తుంది. అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం పేరు విన్సన్ రేంజ్. దాదాపు 4,892 మీటర్ల ఎత్తు ఉన్న ఈ శిఖరాన్ని విన్సన్ మాసిఫ్ అని కూడా పిలుస్తారు. పద్మశ్రీ డాక్టర్‌ అరుణిమ సిన్హా ఈ పర్వత శిఖరంపై భారత జెండాను ఎగురవేశారు. ఈ శిఖరం పర్వతారోహకులను అమితంగా ఆకర్షిస్తుంది.

అంటార్కిటికాలో సౌత్ షెట్లాండ్ ద్వీపం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. సౌత్ షెట్లాండ్ దీవుల్లోని పరిశోధనా కేంద్రాలకు వివిధ దేశాల నుంచి పరిశోధకులు వస్తుంటారు. ఈ ఖండంలో డ్రేక్ పాసేజ్, ఫాక్లాండ్ దీవులు, దక్షిణ జార్జియా వంటి అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రయాణించడాన్ని పర్యాటకులు సాహసంగా పరిగణిస్తారు. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించడానికి వేసవి కాలం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. 

 

#Tags