GST Rates: 2022లో కన్నా 2023లో జీఎస్‌టీ శాతం అధికం.. ఇదే కారణం..

2022 సంవత్సరంలో డిసెంబర్‌ నెలలో జీఎస్‌టీ రేట్లు లక్షల కోట్లల్లో పెరిగాయి. ఆ ఆర్థిక పరిస్థితి గురించి వివరణ మీకోసం..

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు డిసెంబర్‌లో రూ.1.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 ఇదే నెలతో పోలిస్తే ఈ విలువ 10 శాతం అధికం. ఏప్రిల్‌–డిసెంబర్‌ 2023 మధ్య జీఎస్‌టీ వసూళ్లు 12 శాతం పెరిగి రూ.14.97 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో వసూళ్లు సగటున 12 శాతం వృద్ధితో రూ.1.66 లక్షల కోట్లుగా ఉన్నాయి.  

ఆర్థిక సంవత్సరంలో తీరిది... 

ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్లో చరిత్రాత్మక స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మే, జూన్‌ నెలల్లో  వరుసగా రూ.1.57 లక్షల కోట్లు, రూ.1.61 లక్షల కోట్లు సమకూరాయి. జూలై వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు. ఆగస్టు వసూళ్లు రూ. 1.59 లక్షల కోట్లుకాగా, సెప్టెంబర్‌లో రూ. 1.63 లక్షల కోట్ల జీఎస్‌టీ రాబడి నమోదయ్యింది. ఇక అక్టోబర్‌ విషయానికి వస్తే. వసూళ్లు భారీగా రూ.1.72 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.  2017 జూలైలో ప్రారంభం తర్వాత ఇవి రెండవ భారీ స్థాయి వసూళ్లు (2023 ఏప్రిల్‌ తర్వాత).  నవంబర్‌లో వసూళ్లు రూ.1.67 లక్షల కోట్లు.  ఎకానమీ క్రియాశీలత, పన్నుల ఎగవేతలను అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు, వసూళ్ల వ్యవస్థలో సామర్థ్యం పెంపు, పండుగల డిమాండ్‌ జీఎస్‌టీ భారీ వసూళ్లకు కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రానున్న నెలల్లో సైతం ఇదే ధోరణి కొనసాగుతుందన్న విశ్వాసాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.   

  • మొత్తం ఆదాయం రూ.1,64,882 
  • ఇందులో సీజీఎస్‌టీ రూ.30,443 
  • ఎస్‌జీఎస్‌టీ  రూ.37,935 
  • ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ రూ. 84,255 
  • సెస్‌ రూ.12,249 

#Tags