Sammakka Sarakka Jatara : నాలుగు రోజులు.. 4 ఘట్టాలు.. మహాజాతర చరిత్ర ఇలా..
ఉత్సాహం ఉరకలేసి ఉత్సవంగా మారే సందర్భం రానే వచ్చింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీల ఉత్సవమైన మేడారం సమ్మక్క–సారలమ్మల మహాజాతర ఫిబ్రవరి 16వ తేదీ (బుధవారం) ప్రారంభమైంది. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జాతర సాగుతుంది.
రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు..
ఈ మహాజాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా వచ్చే భక్తులతో మేడారం కుంభమేళాను తలపిస్తుంది. నాలుగు రోజులు కుంభమేళా.. ఇలా ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలంలోని ఓ గిరిజన గ్రామం మేడారం. మేడారం జాతరను రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారు. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మను, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును పూజారులు తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. దీంతో తొలిరోజు ఘట్టం పూర్తవుతుంది.
అత్యంత కీలకమైన ఘట్టం ఇదే..
ఫిబ్రవరి 17వ తేదీన (గురువారం) సమ్మక్కను చిలకలగుట్ట మీద నుంచి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఇదే అత్యంత కీలకమైన ఘట్టం కాగా, కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క ఆగమనం చూసి తరించి అందరూ పులకించిపోతారు. సమ్మక్కను పూజారులు తీసుకొచ్చే వేడుకలో లక్షలాది మంది భక్తులు పాల్గొని జయజయధ్వానాలు పలుకుతూ హారతులు ఇస్తారు. పోలీసులు, జిల్లా అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతారు. ఫిబ్రవరి 18న సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపన్న గద్దెలపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 19వ తేదీన దేవతల వనప్రవేశం ఉంటుంది.
1968 నుంచి..
1968 నుంచి ప్రభుత్వం ఈ జాతర ఏర్పాట్లు చేస్తోంది. 1996లో రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. మొదట సమ్మక్క, సారలమ్మ జాతరలు వేర్వేరు గ్రామాల్లో జరిగేవి. సారలమ్మను సైతం కన్నెపల్లి నుంచి మేడారంలోని సమ్మక్క గద్దెల వద్దకు చేర్చడం 1960 నుంచి మొదలైంది. అప్పటినుంచి మేడారం జాతర సమ్మక్క–సారలమ్మ జాతరగా మారింది. ప్రభుత్వ పరంగా 1944లోనే మేడారం జాతరపై తహసీల్దారుతో కమిటీ ఏర్పాటైనట్లు రికార్డులు చెబుతుండగా, 1967లో దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది.
పగిడిద్దరాజు..
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో వెలిసిన పగిడిద్దరాజు మేడారం బయలుదేరతారు. ఆలయంలో మొక్కులు సమర్పించిన వడ్డెలు (పూజారులు) పగిడిద్దరాజు పడిగెను పట్టుకుని గ్రామం గుండా తరలివెళ్తారు. పగిడిద్దరాజు గ్రామం దాటే వరకు మహిళలు నీళ్లు పోస్తూ ‘వరుడై వెళ్లి మరుబెల్లికి రావయ్యా’అంటూ మొక్కులు చెల్లిస్తారు. రాత్రి కర్లపెల్లి, లక్ష్మీపురంలోని పెనక సాంబయ్య ఇంట్లో సేదదీరుతారు. వారిచ్చిన విందును ఆరగించి తెల్లవారుజామున నాలుగు గంటలకు తిరిగి మేడారానికి పయణమవుతారు. ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మేడారం చేరుకుంటామని ప్రధాన పూజారులు పెనక బుచ్చిరాములు, సురేందర్, రాజేష్, పురుష్తోతం తెలిపారు.
నాలుగు రోజులు 4 ఘట్టాలు ఇలా..
ఫిబ్రవరి 16న సారలమ్మ ఆగమనం..
కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర ఊపందుకుంటుంది. సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు సుమారు 3 కి.మీ. దూరంలో ఉండే ఈ గ్రామంలోని ఆలయంలో ప్రతిష్ఠించిన సారలమ్మను ఫిబ్రవరి 16న బుధవారం సాయంత్రం జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే కొండాయి నుంచి గోవిందరాజును.. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.
ఫిబ్రవరి 17న సమ్మక్క ఆగమనం..
జాతరలో ముఖ్యమైన దినం రెండోరోజు. ఫిబ్రవరి 17న గురువారం సాయంత్రం సమ్మక్క గద్దెపైకి వస్తుంది. సాయంత్రం 6గం. సమయంలో చిలకలగుట్టపై కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్క రూపాన్ని చేతపట్టుకుని ప్రధాన పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం భక్తిపారవశ్యంతో ఊగిపోతుంది.
ఫిబ్రవరి 18న గద్దెలపై తల్లులు..
గద్దెలపై ఆసీనులైన సమ్మక్క–సారలమ్మలు ఫిబ్రవరి 18వ తేదీ (శుక్రవారం) భక్తజనానికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. జాతరలో ఇదే రోజు ఎక్కువ మంది వస్తారు.
ఫిబ్రవరి 19న దేవతల వన ప్రవేశం..
నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. అనంతరం భక్తులు ఇళ్లకు తిరుగు పయనమవుతారు.
మండ మెలిగే ప్రక్రియ ఇలా...
ప్రధాన పూజారి(వడ్డె) నేతృత్వంలోని బృందం ఫిబ్రవరి 16వ తేదీ (బుధవారం) మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు. వన దేవతలకు వస్త్రాలు సమర్పిస్తారు. సారలమ్మ పూజారులు పూజలో పాల్గొంటారు. ముగ్గులు వేసి శక్తిపీఠాన్ని అలంకరిస్తారు. ఆదివాసీ సంప్రదాయ పూజలు రాత్రి సైతం జరుగుతాయి. ఫిబ్రవరి 17వ తేదీన (గురువారం) మేకపోతును బలి ఇచ్చి వన దేవతలకు నైవేధ్యం ఇస్తారు. సారలమ్మ గుడి ఉండే కన్నెపల్లిలో, గోవిందరాజు గుడి ఉండే కొండాయిలో, పగిడిద్దరాజు గుడి ఉండే పూనుగొండ్లలోనూ ఇదే పూజా కార్యక్రమాలు జరుగుతాయి.
బుధవారాల్లోనే..
గిరిజనుల గుడులు నిరాడంబరమైనవి. మేడారంలో సమ్మక్క, కన్నెపల్లిలో సారలమ్మల గుళ్లు కూడా గుడిసెలుగానే ఉండేవి. జాతరకు ముందు ఈ గుడిసెలను కొత్తగా కప్పడం (గుడి మెలిగె) ఆనవాయితీ. ఈ ప్రక్రియతోనే జాతర తొలి పూజా కార్యక్రమాలు మొదలయ్యేవి. ఇప్పుడు గుడెసెలు లేకున్నా జాతరకు రెండు వారాల ముందు ‘గుడి మెలిగె’ను నిర్వహిస్తారు. జాతరకు సరిగ్గా వారం ముందు దేవతలు ఉండే ఆవరణలను శుద్ధి చేసి ముగ్గులు వేసి అలంకరిస్తారు. దీన్ని ‘మండ మలిగె’ అంటారు. గుడి మెలిగె, మండ మెలిగె కార్యక్రమాలు తల్లుల వారంగా భావించే బుధవారాల్లోనే జరుగుతాయి. ‘మండ మెలిగె’ మరుసటి రోజున గొర్రెను దేవతలకు బలి ఇచ్చి పూజారులు (వడ్డె), గ్రామపెద్దలు పండగ నిర్వహిస్తారు. ఇదే రోజున సమ్మక్క వారంగా భావించి భక్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకుంటారు.
ఎలాంటి విగ్రహాలు లేని పూజ..
మేడారం జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. సమ్మక్క-సారలమ్మలకు ఎలాంటి విగ్రహాలు ఉండకపోవడమే ఆ ప్రత్యేకత. ఇక్కడున్న రెండు గద్దెల్లో ఒకదాన్ని సమ్మక్క గద్దెగా, ఇంకో దాన్ని సారలమ్మ గద్దెగా పిలుస్తారు. వీటి మధ్య ఉండే చెట్టు కాండాల (నారేప)నే దేవతామూర్తులుగా కొలుస్తారు. మనిషి ఎత్తు ఉండే కంకమొదళ్లు ఇక్కడ దేవతామూర్తులు. వీరు పసుపు, కుంకుమల స్వరూపాలు. దేవతల గద్దెపై లభించే కుంకుమతో మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. దేవతామూర్తులను తోడ్కొని వచ్చే వడ్డెలు తమ పైనుంచి దాటుకుంటూ వెళితే జన్మ సార్థకమవుతుందని భక్తులు సాష్టంగపడతారు. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునే భక్తులు వనదేవతలకు ఎత్త్తు బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. ఇది దేవతలకు ఇష్టమైనదిగా భక్తులు భావిస్తారు. మేడారం వచ్చే భక్తుల్లో గిరిజనులు, పేదలే ఎక్కువగా ఉంటారనే భావనతో విలువైన కానుకలు, మొక్కులు ఇక్కడ లేవని చెబుతుంటారు. మొక్కులు ఫలించి సంతానం కలిగినవారు జాతర వచ్చినప్పుడు ఎత్తు బంగారం సమర్పిస్తారు. కోర్కెలు తీరితే ఎడ్ల బండ్లు కట్టుకుని జాతరకు వస్తామని అమ్మవారి రూపంలో మొహానికి పసుపు పూసుకుని పెద్దబొట్టు పెట్టుకుని వచ్చి అమ్మలను దర్శించుకుంటారు. కంకబియ్యం (ఒడి బియ్యం), ఎదురు కోళ్లు (దేవతను తీసుకు వచ్చేటప్పుడు ఎదురుగా గాల్లోకి ఎగరవేసిన కోళ్లు), లసిందేవమ్మ మొక్కు (గుర్రం ఆకారపు తొడుగును మొహానికి కట్టుకుని వచ్చి దాన్ని అమ్మవారికి సమర్పించడం) వంటి రకరకాల మొక్కులు ఇక్కడ ఉంటాయి.
వనం నుంచి వనంలోకి..
సమ్మక్క-సారలమ్మ జాతర నాలుగు రోజులు జరుగుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. అదేరోజు సారలమ్మ గద్దె పైకి రాకమునుపే ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజును అటవీమార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. రెండో రోజు సాయంత్రం వడ్డెలు (పూజారులు) ఈశాన్య దిశగా ఉన్న చిలుకల గుట్ట పైకి వెళ్లి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి మేడారం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వరంగల్ జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం ప్రాంతం మొత్తం శివసత్తుల శివాలుతో, భక్తిపరవశంతో ఊగిపోతుంది. మూడోరోజు గద్దెలపై సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఉంటారు. ఈ రోజు మేడారంలో లెక్కలేనంత మంది భక్తులు మేడారానికి వస్తారు. మొక్కులు సమర్పిస్తారు. నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది.
సమ్మక్క కథ :
సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కోయగిరిజనుల కథనం ఇలా ఉంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని ‘పొలవాస’ను 12వ శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించాడు. వేట కోసం అడవికి వెళ్లినప్పుడు అక్కడ పులుల సంరక్షణలో, దివ్యకాంతులతో ఉన్న బాలికను చూసి గ్రామానికి తీసుకువచ్చి సమ్మక్క అని పేరు పెట్టాడు. ఆ పసిపాప గ్రామంలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని శుభాలే జరిగాయి. యుక్త వయసు వచ్చిన సమ్మక్క మేడారాన్ని పరిపాలించే పగిడిద్దరాజును వివాహమాడింది. పగిడిద్దరాజు మేడరాజుకు మేనల్లుడు. పగిడిద్దరాజు-సమ్మక్కలకు సారలమ్మ, నాగులమ్మ కుమార్తెలు, జంపన్న కుమారుడు. సారలమ్మకు గోవిందరాజులతో పెళ్లి జరిగింది. మేడారం ప్రాంతం గోదావరి నదికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడున్న సారవంతమైన భూములును ఆక్రమించేందుకు కాకతీయరాజు రుద్రదేవుడు మేడారంపై దండెత్తాడు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు కాకతీయుల శక్తికి పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందారు. శత్రువు చేతికి చిక్కి చావడం ఇష్టంలేని జంపన్న అక్కడికి సమీపంలోని సంపెంగవాగులో దూకి చనిపోయాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. భర్త, కుమారుడు, అల్లుడు, కుమార్తెల మరణవార్త విన్న సమ్మక్క ధైర్యం కోల్పోకుండా, యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడింది. ఆమె దాటికి తట్టుకోలేని శత్రువర్గంలో ఒకడు వెనుక నుంచి బల్లెంతో పొడిచాడు. తన రక్తంతో తడిస్తే ఆ ప్రాంతమంతా కరువు కాటకాలతో నిండిపోతుందనే ఉద్దేశంతో తన గాయానికి కట్టు కట్టుకుని శత్రువులను హతమార్చుతూ మేడారం సమీపంలో ఉన్న చిలుకలగుట్ట వైపు సాగుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైంది. గిరిజనులు సమ్మక్క కోసం అరణ్యమంతా గాలించగా నాగవృక్షపు నీడలో ఉన్న పాముపుట్ట దగ్గర పసుపు కుంకుమల భరిణె కనిపించింది. గిరిజనులు ఈ భరిణే సమ్మక్కగా భావించి తమ కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకుంటూ జాతర చేసుకుంటున్నారు. జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేస్తారు.