Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్‌.. ఈ సమస్యలే కారణం!!

ప్రపంచంలో అతి పెద్ద ఏరో స్పేస్‌ కంపెనీల్లో ఒకటైన బోయింగ్‌ ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి మానవసహిత రోదసీ యాత్రలో సునీత సునీతా విలియమ్స్‌ భాగస్వామి అయ్యారు.

సహచరుడు బారీ బుచ్‌ విల్మోర్‌తో కలిసి బోయింగ్‌ ‘స్టార్‌లైనర్‌’ వ్యోమ నౌకలో జూన్ 5వ తేదీ అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. అయితే యాత్ర సజావుగా సాగలేదు. ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ మొదలుకుని వ్యోమ నౌకలో పలు లోపాలు తలెత్తాయి. ఉత్కంఠ నడుమే ఎట్టకేలకు జూన్ 6వ తేదీ స్టార్‌లైనర్‌ సురక్షితంగా ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైంది.

నిజానికి ఇది మానవసహిత యాత్రల సన్నద్ధతను పరీక్షించేందుకు బోయింగ్‌ చేసిన క్రూ ఫ్లైట్‌ టెస్ట్‌ (సీఎఫ్‌టీ). షెడ్యూల్‌ ప్రకారం సునీత, విల్మోర్‌ వారం పాటు ఐఎస్‌ఎస్‌లో ఉండి జూన్ 13న‌ బయల్దేరి 14వ తేదీ భూమికి చేరుకోవాలి. కానీ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ తదితరాలకు తోడు వ్యోమ నౌకలో మరిన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు. వీటన్నింటినీ సరిచేసే పనిలో నాసా ప్రస్తుతం తలమునకలుగా ఉంది. వ్యోమగాములను వెనక్కు తీసుకొచ్చే విషయంలో తమకు హడావుడేమీ లేదని నాసా కమర్షియల్‌ క్రూ ప్రోగ్రాం మేనేజర్‌ స్టీవ్‌ స్టిచ్‌ స్పష్టం చేశారు. వారి భద్రతకే తొలి ప్రాధాన్యమని వివరించారు. 

Sunita Williams: విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరుకున్న సునీతా విలియమ్స్

సమస్యలు ఏమిటి?
➣ స్టార్‌లైనర్‌ వ్యోమ నౌకలో ఏకంగా ఐదు చోట్ల హీలియం లీకేజీలు చోటుచేసుకున్నాయి. ఇది పెను సమస్య. దీనివల్ల వ్యోమనౌక లోపలి భాగంలో అవసరమైన మేరకు ఒత్తిడిని మెయిన్‌టెయిన్‌ చేయడం కష్టమవుతుంది. నౌక పనితీరూ బాగా దెబ్బ తింటుంది. 

➣ దీంతోపాటు వ్యోమ నౌకలో కీలకమైన 28 రియాక్షన్‌ కంట్రోల్‌ సిస్టం థ్రస్టర్లలో ఏకంగా ఐదు విఫలమైనట్టు నాసా సైంటిస్టులు గుర్తించారు. అవి ఉన్నట్టుండి పని చేయడం మానేశాయి. సురక్షితంగా తిరిగి రావాలంటే కనీసం 14 థ్రస్టర్లు సజావుగా పని చేయాలి.

➣ ప్రొపెల్లెంట్‌ వాల్వ్‌ కూడా పాక్షికంగా ఫెయిలైంది.

➣ వీటిని పరిశీలిస్తున్న క్రమంలో మరిన్ని సాంకేతిక సమస్యలూ బయటపడ్డాయి. థ్రస్టర్లలో ప్రస్తుతానికి నాలుగింటిని రిపేర్‌ చేశారని, అవి సజావుగా పని చేస్తున్నాయని చెబుతున్నారు.

➣ ఈ సమస్యలను సరి చేసేందుకు బోయింగ్‌ బృందం నాసాతో కలిసి పని చేస్తోంది. నెవెడాలో అచ్చం ఐఎస్‌ఎస్‌ తరహా పరిస్థితులను సృష్టించి స్టార్‌లైనర్‌లో తలెత్తిన సమస్యలను ఎలా పరిష్కరించాలో పరీక్షిస్తున్నారు. ఇది తుది దశలో ఉన్నట్టు సమాచారం.  

NASA Hires SpaceX: ఐఎస్‌ఎస్‌ను కూల్చేయనున్న స్పేస్‌ఎక్స్‌!

ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి..
బోయింగ్‌ స్టార్‌లైనర్‌ గరిష్టంగా 45 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమై ఉండగలదు. అది జూన్‌ 6న అక్కడికి చేరింది. ఆ లెక్కన జూలై 22 దాకా సమయముంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే? సునీత, బుచ్‌ విల్మోర్‌లను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయాలున్నాయి. స్పేస్‌ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్‌ ద్వారా, లేదంటే రష్యా సూయజ్‌ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కు తీసుకురావచ్చు.

ఐఎస్‌ఎస్‌లోనే మకాం
సునీత, విల్మోర్‌ ప్రస్తుతానికి ఐఎస్‌ఎస్‌లోనే సురక్షితంగా ఉన్నారు. సునీత తన అనుభవం దృష్ట్యా పరిశోధనలు, ప్రయోగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అక్కడున్న ఏడుగురుతో కలిసి ఐఎస్‌ఎస్‌ నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల్లో బిజీగా గడుపుతున్నారు.

Carrington Event: పొంచి ఉన్న ‘కారింగ్టన్‌ ఈవెంట్‌’.. మానవాళికి పెను ముప్పు?

#Tags