International Space Station: ‘ఐఎస్‌ఎస్‌’ను కూల్చాల్సిన అవసరం ఏంటి.. దీనికి ‘నాసా’ ఏం చెప్పింది?

ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్(ఐఎస్‌ఎస్‌) ఫ్యూచర్ ఏంటి..?

400 కిలో మీటర్ల ఎత్తులో అంతరిక్షంలో తిరుగుతున్న ఐఎస్‌ఎస్‌ను కక్ష్య నుంచి తప్పించి ఎలా కూలుస్తారు. ఐఎస్‌ఎస్‌ను కక్ష్య నుంచి తప్పించేందుకు సిద్ధం చేస్తున్న యూఎస్‌డీఆర్బిట్‌ వెహిహికిల్‌(యూఎస్‌డీవీ)ని ఎలా ఉపయోగిస్తారు..? అసలు ఐఎస్‌ఎస్‌ను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది. అంతా సజావుగా జరిగి 2030లో ఐఎస్‌ఎస్‌ నింగి నుంచి మాయమైన తర్వాత అంతరిక్ష పరిశోధనల మాటేమిటి..? ఈ విషయాలన్నింటిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది.  

అసలు ఐఎస్‌ఎస్‌ ఏంటి.. ఎందుకు..?
అమెరికా, రష్యా, కెనడా, జపాన్‌, యూరప్‌లు 1998 నుంచి 2011 వరకు శ్రమించి ఐఎస్‌ఎస్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాయి. 2000 సంవత్సరం నవంబర్‌ 2వ తేదీనే ఐఎస్‌ఎస్‌ కమిషన్‌ అయింది. అప్పటి నుంచే అది అంతరిక్షంలో వ్యోమగాములకు ఆశ్రయమిస్తూ ఎన్నో పరిశోధనలకు వేదికైంది. ప్రస్తుతం 15 దేశాలు ఐఎస్‌ఎస్‌ను నిర్వహిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భారీ ఖర్చుతో ఐఎస్‌ఎస్‌ను నిర్మించారు. ఆశించినట్లుగానే స్పేస్‌ రీసెర్చ్‌లో 24 ఏళ్లుగా ఐఎస్‌ఎస్ గొప్పగా సేవలందిస్తోంది.

డీ కమిషన్‌ చేయడం ఎందుకు..?
ఐఎస్‌ఎస్‌ నింగిలో పని చేయడం ప్రారంభించి 2030 నాటికి 30 ఏళ్లు పూర్తవుతుంది. అప్పటికి ఐఎస్‌ఎస్‌ చాలా పాతదవుతుంది. అంతరిక్ష వాతావరణ ప్రభావం వల్ల దాని సామర్థ్యం తగ్గిపోతుంది. అందులోని చాలా విడిభాగాలు పనిచేయవు. ఐఎస్‌ఎస్‌లోని పరికరాలన్నీ నెమ్మదిస్తాయి. 

ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములు నివసించే మాడ్యూళ్లు పనికిరాకుండా పోతాయి. అది ప్రస్తుతం తిరుగుతున్న 400 కిలోమీటర్ల ఎత్తులోని ఆర్బిట్‌ నుంచి దానికదే కిందకు దిగడం ప్రారంభమవుతుంది. నిజానికి ఐఎస్‌ఎస్‌ను నిర్దేశిత కక్ష్యలో ఉంచడం మళ్లీ సాధ్యమే అయినప్పటికీ అది చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇందుకే 2030లో ఐఎస్‌ఎస్‌ను డీ కమిషన్‌ చేయాలని నిర్ణయించారు.

IPE Global: జర జాగ్రత్త సుమా.. ప్రచండమైన ఎండలతో అల్లాడుతున్న భూమి!

ఎలా కూలుస్తారు..?
ఐఎస్‌ఎస్‌ను తొలుత కక్ష్యలో నుంచి తప్పించి(డీఆర్బిట్‌) నెమ్మదిగా భూమిపై కూల్చేస్తారు. ఐఎస్‌ఎస్‌ను కక్ష్య నుంచి తప్పించి భూమిపై కూల్చేయడం సాధారణ విషయం కాదు. దీనిని చాలా అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ నైపుణ్యంతో జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను ఈలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్ కంపెనీ తయరు చేస్తున్న యూఎస్‌డీఆర్బిట్‌ వాహనాన్ని నాసా వాడనుంది. 

2030లో ఐఎస్‌ఎస్‌ను డీ కమిషన్‌ చేయనున్నప్పటికీ 18 నెలల ముందే డీ ఆర్బిట్‌ వెహికిల్‌ నింగిలోకి వెళ్లి ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఐఎస్‌ఎస్‌ను కక్ష్య నుంచి తప్పించి జాగ్రత్తగా భూ వాతావరణానికి తీసుకువస్తారు. భూ వాతావరణానికి రాగానే ఐఎస్‌ఎస్‌ మండిపోతుంది. దాని శకలాలను మనుషులెవరూ ఉండని దక్షిణ పసిఫిక్‌ ఐలాండ్‌లలో పడేలా చేస్తారు.  

డీఆర్బిట్‌ వెహిహికల్‌ ఎలా పనిచేస్తుంది..
సాధారణంగా ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను మోసుకెళ్లి దానితో అనుసంధానమయ్యే డ్రాగన్‌ కాప్స్యూల్స్‌తో పోలిస్తే డీఆర్బిట్‌ వెహికిల్‌ యూఎస్‌డీవీకి ఆరు రెట్ల ఎక్కువ శక్తి కలిగిన ప్రొపల్లెంట్‌ ఉంటుంది. డీ ఆర్బిట్‌ వెహికిల్‌ ఐఎస్‌ఎస్‌ డీ కమిషన్‌కు 18 నెలల ముందే వెళ్లి దానితో అనుసంధానమవుతుంది. ఇంకో వారంలో ఐఎఎస్‌ఎస్‌ డీ ఆర్బిట్‌ అవనుందనగా యూఎస్‌డీవీలోని ఇంధనాన్ని మండించి ఐఎస్‌ఎస్‌ను కక్ష్య నుంచి తప్పించి భూమివైపు తీసుకురావడం మొదలుపెడతారు. చివరిగా భూ వాతావరణంలోకి రాగానే ఐఎస్‌ఎస్‌ మండిపోతుంది. దీంతో ఐఎస్‌ఎస్‌ 30 ఏళ్ల ప్రస్థానం ముగిసిపోతుంది.

ఐఎస్‌ఎస్‌ తర్వాత నాసా ప్లానేంటి..? పరిశోధనలు ఎలా..? 
ఐఎస్‌ఎస్‌ చరిత్రగా మారిన తర్వాత సొంతగా కొత్త స్పేస్‌ స్టేషన్లను అభివృద్ధి చేసే ప్లాన్‌ అమెరికాకు లేదు. ప్రైవేట్‌ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న స్పేస్‌ స్టేషన్‌లను అద్దెకు తీసుకుని అంతరిక్ష పరిశోధనలు చేసే అవకాశముంది. ఒకవేళ 2030కల్లా ప్రైవేట్‌ కంపెనీల స్పేస్‌ స్టేషన్‌లు సిద్ధం కాకపోతే డీ ఆర్బిట్‌ వెహికిల్‌ను వాడి ఐఎస్‌ఎస్‌ జీవితకాలాన్ని పొడిగించాలన్న ప్లాన్‌ బీ కూడా నాసాకు ఉంది.

Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్‌.. ఈ సమస్యలే కారణం!!

#Tags