Digital: డిజిటల్‌ తెరపై తెలుగు వెలుగులు

Digital Telugu


‘డిజిటల్‌ హ్యుమానిటీస్‌’ రంగానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం పెరిగింది. ఆ దిశగా చాలా పరిశోధనలూ ఫలితాలూ అందుబాటులోకి వచ్చాయి. భారతీయ భాషలు వీటిని అందుకోవడంలో కాస్త వెనుకబడే ఉన్నాయి. డిజిటల్‌ రంగంపై కరోనా విశేష ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో తెలుగు భాగస్వామ్యాన్ని అంతర్జాలంలో మరింత పెంచాల్సివుంది. కరోనా కల్పించిన అనివార్యత వల్ల సమాచారం కోసం, మొదట్లో మృదు ప్రతుల్ని కంప్యూ టర్, ఫోన్‌ స్క్రీన్ల మీద చదవడం కొంత ఇబ్బంది కలిగిం చినా, తర్వాత అలవాటైపోయింది. ఇప్పుడు ‘ఫలానా బుక్‌ సాఫ్ట్‌ కాపీ ఏ వెబ్‌సైట్‌లో దొరుకుతుంది’ అనే అలవాటు లోకి వచ్చేశాం. అందుకే డిజిటల్‌ వేదికపై సాహిత్యం, కళలువంటి మానవీయశాస్త్రాలతోపాటు వాణిజ్య, వైద్య, సైన్స్, రాజకీయ మొదలైన సకల శాస్త్రాల సమాచారాన్ని పరిశోధకుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరికీ అందుబాటులో ఉంచాలి. 

భారతదేశంలాంటి అభివృద్ధి చెందుతోన్న సమాజాల్లో సమాచార లభ్యత ప్రధాన సమస్య. దీన్ని అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల తక్షణావసరం. సమాచారంపై కొందరి గుత్తాధిపత్యాన్ని తొలగించేలా రచయితలు, ప్రభుత్వాలు, ముద్రణాసంస్థలు పరస్పరావగాహనతో ముందు కెళ్ళాలి. తెలుగు ప్రభుత్వాలు దీన్ని లాభసాటి కార్యక్రమంగానో, సమాజోద్ధరణగానో చూడకుండా ఇవాళ్టి పోటీ ప్రపంచంలో అనివార్యంగా దాటవలసిన మైలురాయిగా పరిగణించాలి. ప్రభుత్వరంగ సంస్థలే పూనుకొని ఆయా రచయితలతో, ముద్రణాసంస్థలతో చర్చలు జరిపి, వారికి కావలసిన గుర్తింపు, గౌరవం, ఆర్థిక వెసులుబాట్లకు సంబంధించిన ‘ఒప్పందాన్ని’ కుదుర్చుకోవాలి. దీనికోసం అవసరమయ్యే కొత్త చట్టాలను తేవాల్సిన, సర్దుబాటు చర్యలను చేపట్టాల్సిన పెద్దన్న పాత్రను ప్రభుత్వాలు పోషించక తప్పదు.  

ప్రజలకు తక్షణం వినియోగపడటానికి కావలసిన సమాచారం మొదట కనీసం పీడీఎఫ్‌ రూపంలోనైనా ఉంచాలి. యూనికోడ్‌లో ఉంచగలిగితే మరింత ప్రయోజనకరం. ఈ రూపంలో ఉంచడానికి కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రాజ్యమేలుతున్న పేజ్‌మేకర్‌ సాఫ్ట్‌వేర్‌ స్థానంలో యునికోడ్‌ ఫాంట్స్‌ వాడేలా రచయితలను, ముద్రణారంగాన్ని ప్రోత్సహించాలి. పేజ్‌మేకర్‌లో ఉండే అనేకరకాల వెసులుబాట్లను యునికోడ్‌లో కూడా జోడించడానికి ఐఐటీ, ఐఐఐటీ, వికీపీడియా, తెలుగు ఫాంట్స్‌ లాంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో పని చేయాల్సి ఉంటుంది. దాంతోబాటు ఇంగ్లిష్‌కు ఉన్నట్టు తెలుగుకు కూడా ఓసీఆర్‌ (ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగ్నిషన్‌)ను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తెస్తే మరో అద్భుతం చేసినవాళ్ళవు తారు. ఈ టెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు పీడీఎఫ్‌ రూపంలో కోట్లాది పుటల్లో ఉన్న సమాచారాన్ని ఒక్క మీట నొక్కుతో ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌లోకి మార్చుకునే వెసులు బాటు ఉంటుంది. 

తమ సంస్థల్లో ముద్రితమవుతోన్న ప్రతి పుస్తకానికి సంబంధించిన వివరాల్ని విధిగా ఆ సంస్థలచేత ఆధునిక పద్ధతుల్లో ‘సమాచార నిధి’(డేటా బేస్‌) తయారు చేయించాలి. తెలుగు పుస్తకాల సమాచారం ఒక దగ్గరకు తీసుకురావాలి. ఆ పుస్తక సంబంధిత పీడీఎఫ్, ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌ కాపీని అంతర్జాలంలో పెట్టడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటుచేయాలి. అంతర్జాలంలో పుస్తకాల్ని చదవడం ద్వారా వచ్చే ఆదాయం రచయితకు అందేలా చూడాలి. ప్రతి ముద్రిత ప్రతికి సంబంధించిన కొన్ని పుస్తకాల్ని ప్రభుత్వ ప్రాతినిధ్య సంస్థలకు పంపేలా చూడాలి.

చదవండి: Exams Preparation: మన పరీక్షలు ఎంత ‘నీట్‌’?    

ఇప్పటికే యంత్రానువాదం (మిషన్‌ ట్రాన్స్‌లేషన్‌) అందుబాటులోకి వచ్చింది. దీన్ని మరింత అభివృద్ధి చేసి మెరుగ్గా అందించాలి. ముఖ్యంగా యూజర్‌ ఫ్రీ అప్లికేషన్స్‌ రావడం ఈనాటి సాంకేతిక రంగంలో పెనువిప్లవం. జ్ఞానాన్ని డిజిటల్‌ మాధ్యమంలో ఉంచే ప్రక్రియ నిరంతరం చేయగలిగితే ప్రజల్లో విషయ సంబంధిత అవగాహన పెరుగుతుంది. తెలుగులో రాస్తోన్న సకల శాస్త్రాల సమా చారం అందుబాటులో ఉండటం వల్ల పరిశోధనలు వేగ వంతమవుతాయి. తెలుగు పరిశోధనల్లో ముఖ్యంగా భాషా పరిశోధనల్లో కొత్తశకం ప్రారంభమౌతుంది. తెలుగు భాషలో ఏ అక్షరం ఎవరు రాశారు? ఏ అక్షరాలను ఎవరు, ఎక్కడి నుంచి, ఎంతశాతంలో వాడుకొన్నారు మొదలైన విషయాలు ఇట్టే తెలిసిపోతాయి. తద్వారా పరిశోధనల్లో కచ్చితత్వం, నిర్దిష్టత, నిర్దుష్టత సాధ్యమై సారవంతమైన ఫలితాలు వస్తాయి.

– డా. ఎస్‌. చంద్రయ్య, టి. సతీశ్‌
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం

#Tags