సమస్యల సుడిగుండంలో ఉన్నత విద్యారంగం

మనం నాగరికులమైతే ఉన్నత విద్య మన ప్రధాన కర్తవ్యం కావాలి - డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉన్నత విద్యను పొందిన దేశాలు అభివృద్ధి చెందగలవు- ప్రపంచ బ్యాంకు దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారం, మానవతా విలువలతో కూడిన శాస్త్ర ప్రగతే-డాక్టర్‌ స్వామినాథన్‌

ఉన్నత విద్య ప్రాముఖ్యత ఏంటో చెప్పే ఫై వ్యాఖ్యానాలు భారతదేశ ఉన్నత విద్యారంగానికి మార్గదర్శకాలని చెప్పాలి. భారతదేశంలో మానవ వనరులు అపారంగా ఉన్నాయి. భారతదేశంలో మానవ వనరుల విప్లవాన్ని చూసి ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. ఇటువంటి ప్రత్యేక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే విశ్వ విద్యాలయాల విద్యను ఎక్కువ మంది యువతీయువకులకు అందించగలగాలి. పరిమాణం రీత్యా భారత ఉన్నత విద్యారంగం విస్తరిస్తోంది. కానీ ప్రమాణాల రీత్యా చూస్తే ఆందోళనకర అంశాలు గోచరిస్తున్నాయి.

ఉన్నత విద్య – భారతదేశం (Higher Education in India)
భారతదేశంలో లో యూనివర్సిటీ తరహాలో 1857లో మూడు విశ్వ విద్యాలయాలను ప్రారంభించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో రెండు డజన్ల విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగం కలిపి 500 కాలేజీలు ఉండేవి. ప్రస్తుతం డీమ్డ్ యూనివర్సిటీలతో సహా మొత్తం 600 పైగా విశ్వ విద్యాలయాలు, 30 వేలకు పైగా కాలేజీలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీల్లో 1కోటి 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో ఉన్నత విద్య చదువుతున్న వారి సంఖ్య తక్కువే. దేశంలో 17నుంచి 24 సంవత్సరాల లోపు యువతలో కేవలం తొమ్మిదిశాతమే కళాశాలల్లో చేరుతున్నారు. ప్రపంచ సగటులో ఇది కనీసం సగం కూడా కాదు. అమెరికా, జపాన్‌, జర్మనీ, బ్రిటన్‌ లాంటి దేశాల్లో విశ్వవిద్యాలయాల సంఖ్య జనాభాతో పోలిస్తే చాలా ఎక్కువ. అమెరికాలో 31.4 కోట్ల మంది జనాభా ఉంటే 2400 విశ్వవిద్యాలయాలున్నాయి. జపాన్ లో 12.65 కోట్ల జనాభాకు 684 విశ్వవిద్యాలయాలు, జర్మనీలో 8.17 కోట్ల జనాభాకు 320 విశ్వవిద్యాలయాలు, బ్రిటన్ లో 6 కోట్ల జనాభాకు 104 విశ్వవిద్యాలయాలున్నాయి. మనదేశంలో పరిస్థితి అందుకు పూర్తిగా విరుద్ధం. 123 కోట్ల జనాభాకు డీమ్డ్‌ యూనివర్సిటీలతో కలిపి 670 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఉన్నాయి. ఉన్నత విద్య అభివృద్ధి చెందాలంటే కళాశాలలు, విశ్వవిద్యాలయాలు పెంచాలని, వాటిలో ప్రస్తుతం తొమ్మిదిశాతంగా ఉన్న విద్యార్థుల నమోదు రేటును 15శాతానికి చేర్చాలని నేషనల్‌ నాలెడ్జి కమిషన్‌ (జాతీయ విజ్ఞాన సంఘం) ప్రభుత్వానికి గతంలోనే సిఫార్సు చేసింది. అది అమలుకు నోచుకోలేదు.

ఉన్నత విద్యాసంస్థలు – ప్రమాణాలు (Higher Education and Standards)
బ్రిటన్ కు చెందిన క్యూ ఎస్ సంస్థ ప్రపంచంలోని అత్యుత్తమ 500 విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగ్ కేటాయించింది. మొదటి రెండు స్థానాల్లో అమెరికాలోని మసాచు సెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ యూనివర్సిటీలు నిలిచాయి. ప్రపంచంలోని 200 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో మన దేశ విద్యాసంస్థలకు స్థానం దక్కలేదు. కొన్ని దశాబ్దాలుగా ఇదే పరిస్థితి. దేశ వ్యాప్తంగా 90 శాతం కళాశాలలు, 70 శాతం విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయి.

కొరవడుతున్న నైపుణ్య లేమి: ( Problems Skills)
భారతీయ విశ్వవిద్యాలయాల్లో రూపుదిద్దుకొంటున్న పట్టభద్రులు పరిశ్రమల అవసరాలకు తగినవిధంగా ఉండటం లేదు. దేశ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో మన విశ్వవిద్యాలయాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. సామాజిక శాస్త్రాలు చదువుతున్న ప్రతి పది మందిలో ఒకరు, ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో నలుగురు మాత్రమే ఉద్యోగార్హత కలిగి ఉంటున్నట్లు పలు అధ్యయనాలు నిర్ధారిస్తున్నాయి. దేశంలో ఏటా సుమారు 30 లక్షల మంది పట్టాలు తీసుకుంటున్నారు. వారిలో ఇరవై శాతానికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. నాసిరకం చదువు వల్ల నైపుణ్యాలు కొరవడుతున్నాయి. సమస్యా పరిష్కార శక్తి, సాంకేతిక ప్రజ్ఞా సామర్థ్యాలు, భావ వ్యక్తీకరణ నైపుణ్యం లేని పట్టభద్రులను ఏ సంస్థా నియమించుకోవట్లేదు. ఉపాధి వేటలో అసంఖ్యాక ఉద్యోగార్థులు నెగ్గలేకపోతున్నారు. దీనివల్ల అపార మానవ వనరులు దుర్వినియోగమవుతున్నాయి. పెచ్చరిల్లుతున్న నిరుద్యోగిత సామాజిక అశాంతికి కారణమవుతోంది.

ఉన్నత విద్య – పరిశోధనలు (Higher Education - Research)
ప్రతి 10 లక్షల మంది జనాభాలో అమెరికాలో 4600 మంది జపాన్ లో 5 వేలు, చైనాలో 700 మంది పరిశోధకులు ఉంటే భారత్ లో కేవలం 119 మందే ఉన్నారు. 2011 -12 లో దేశంలో 2.60 కోట్ల మంది ఉన్నత విద్య పూర్తి చేశారు. వారిలో కేవలం లక్ష మంది పీహెచ్ డీ చేయడానికి ముందుకొచ్చారు. పరిశోధనల్లో దేశం వెనుకబడిందని చెప్పటానికి నిదర్శనం ఈ గణాంకాలే. విదేశాల్లో విద్య లక్ష్యం మనకు భిన్నంగా ఉంటుంది.

ఒక దేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యతను సంపాదించాలంటే అందుకు పరిశోధన – అభివృద్ధి కీలకం. అనుకరణ, ఇతరుల ఉత్పత్తుల అమ్మకం, సాంకేతిక విజ్ఞానం కొంతకాలం పనిచేస్తాయి గానీ అన్నివేళలా ఉపయోగపడవు. ఇతరుల ఆవిష్కరణలను అనుకరించే శక్తిని కలిగి ఉండటం మాత్రమే గాక దానిని మరింత మెరుగుపరచవలసి ఉంది. సాపేక్షంగా చూస్తే సాంకేతిక విజ్ఞానం స్థిరంగా ఉన్న ప్రపంచంలో అనుకరణ అనేది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాని ప్రతి పద్దెనిమిది నెలలకోసారి కంప్యూటర్ చిప్ శక్తి రెట్టింపు అవుతున్న కాలంలో దానివల్ల ఉపయోగం ఉండదు. మన దేశం అభివృద్ధి చెందాలంటే శాస్త్ర సామర్థ్యం, సాంకేతిక విజ్ఞాన ఆవిష్కరణలు తప్పనిసరి.

కేవలం ఉద్యోగం కోసమే విద్య అనేది భారతీయుల్లోని ధోరణి. విదేశీయుల్లో మాత్రం అలా ఉండదు. విద్య పరిశోధనకు బాట వేయడంతో పాటు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని భావిస్తారు. విదేశాల్లో పరిశోధన కేవలం పరిశోధనా పత్రాలకే పరిమితం కాదు. ప్రతి పరిశోధక విద్యార్థి తాను చేసిన పరిశోధనకు పేటెంట్ సంపాదించి వాణిజ్యపరంగా మార్కెట్లోకి తెచ్చేలా కృషి చేస్తున్నారు. మన దేశంలో ప్రతీ ఏటా ఒక్కో వర్సిటీ పరిశోధనా పత్రాలను వందల్లో చూపుతున్నా ప్రముఖ మ్యాగజీన్లలో ప్రచురితమవుతున్నది తక్కువే. పేటెంట్లు ఏడాదికి ఒక్కటి దక్కించుకోవడమే అరుదుగా ఉంది.

నిధుల కొరత: (Higher Education - Financial Problems)
అనేక దేశాల్లో ఉన్నత విద్యారంగానికి అవసరమైన నిధులు అక్కడి ప్రభుత్వాలే అందజేస్తున్నాయి. మనదేశ బడ్జెట్లో ఉన్నత విద్య కేటాయింపులు 0.66 శాతానికే పరిమితం. ఒక్కొక్క విద్యార్థికి ఉన్నత విద్యపై వివిధ దేశాలు ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నదీ గమనిస్తే- భారతదేశంలో సుమారు 400 డాలర్లు ఖర్చు చేస్తుంది. ఇంగ్లాండ్‌ 8,502 డాలర్లు, జపాన్‌ 4,830 డాలర్లు, చైనా 2,728, రష్యా 1,024, బ్రెజిల్‌ 3,986 డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. అమెరికా, ఇంగ్లాండ్‌ తదితర దేశాల్లో విద్యా సంస్థలకు కొన్నేళ్ళ పాటు సరిపోయే దాతృత్వ (ఎండోమెంట్‌) నిధులు ఉంటాయి. పౌర సమాజాన్ని విద్యాసంస్థలతో మమేకం చేయడం ద్వారా ఆ విధులను ఏ ఆటంకం, కొరత లేకుండా నిర్వహిస్తారు. ఇదే పద్ధతిని భారతదేశం పౌర సమాజంతో మమేకం చేస్తే వనరుల కొరతను కొంత అధిగమించవచ్చు. పథకాలు, ప్రణాళికలే కాదు. అవసరమైన మేర నిధులు కేటాయించినప్పుడే ఉన్నత విద్యారంగం అన్ని విధాలుగా బలోపేతమవుతుంది. సమర్థ మానవ వనరులకు కాణాచి అవుతుంది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఆరుశాతం విద్యారంగానికి వ్యయంచేస్తానన్న కేంద్రప్రభుత్వం- అందులో సగమే ఖర్చు చేయగలుగుతోంది. ఉన్నత విద్యకు మాత్రం అరశాతమైనా ఖర్చు చేయలేకపోతోంది.

అధ్యాపకుల కొరత: (Higher Education – Faculty)
రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయా నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఐఐఎం లాంటి సంస్థల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థల్లో అధ్యాపకుల కోసం చాలా మటుకు విదేశాలవైపు చూడాల్సి రావడం దురదృష్టకరం. విదేశీ వర్సిటీలు ఒకప్పుడు మన ఐఐటీల నుంచి ప్రతిభావంతులైన పలువురిని ఆచార్యులుగా తీసుకున్నాయి. 1985లో పారిశ్రామిక విధానాల్లో మార్పుల వల్ల చాలా మంది విదేశాల నుంచి భారత్ వచ్చినా ఇక్కడ ఉండలేకపోయారు. వాళ్లను ఉపయోగించుకునే పరిశ్రమలు కూడా కనిపించకపోవడంతో మళ్లీ విదేశాలకు వెళ్లిపోయారు.

మేధో వలస: ( Brain Drain)
ప్రమాణాలతో కూడిన విద్య కోసం ఏటా మనదేశం నుంచి లక్షన్నర మంది అధిక వ్యవప్రయాసల కోర్చి విదేశాలకు వెళ్తున్నారు. దీనివల్ల మనదేశం పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతుంది. ప్రతిభావంతులూ దేశ సేవకు దూరమవుతున్నారు. ఐఐటీలు, ఐఐఎంలలో ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళుతున్నవారిలో సగంమందైనా తిరిగి భారతదేశం రావడం లేదని, వారిపై పెట్టిన ఖర్చు ప్రభుత్వానికి నష్టం అనే భావన ప్రభుత్వ పెద్దల్లో ఉంది. దీనిపై కొన్ని ఆంక్షలు విధించి స్వదేశంలో ఇటు ప్రభుత్వానికి, అటు ప్రజలకు కొంత సేవ చేసేలా మార్గదర్శకాలు రూపొందించడమే సమంజసం. ప్రపంచీకరణ తరవాత మేధో వలసలను నియంత్రించడం న్యాయసమ్మతం కాదనే భావన మేధావుల్లో ప్రబలంగా ఉంది. ఉన్నత విద్యను మార్కెట్‌ శక్తులకు బదిలీ చేయకుండా, తగినన్ని నిధులు, పటిష్ఠమైన మానవవనరుల అభివృద్ధి, పర్యవేక్షణ, క్రమశిక్షణతో ఆ విద్యా సంస్థలను ప్రభుత్వం నడపాలి. లేకపోతే ప్రపంచీకరణ సవాళ్లను దీటుగా ఎదుర్కోవడం కష్టమే.

పరిశ్రమలతో అనుసంధానం: (Connection with Industries)
దేశంలో 24 ఏళ్ల లోపు వయసున్నవారి జనాభా సుమారు 55 కోట్లు. వారిలో అత్యధికుల్ని పటిష్టమైన శక్తులుగా, ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులుగా మలచగలిగితే బంగారు భవిష్యత్తు భారతావనిదే. విద్య, పారిశ్రామిక రంగాల మధ్య బలమైన బంధం ఉండాలంటే నిర్దిష్ట కాలావధిలోగా ఎక్కడెక్కడ ఏ వృత్తుల అవరసం ఉందో శాస్త్రబద్ధంగా గుర్తించాలి. ఆ మేరకు పాఠ్యాంశాల రూపకల్పన, బోధన సిబ్బంది నియామకాలు, శిక్షణ ఏర్పాట్లు చేయాలి. అపార మానవ వనరుల దుర్వినియోగాన్ని నివారించడానికి పరిశ్రమల అవసరాలకు తగినట్లు విద్యారంగంలో బహుముఖ సంస్కరణలను ప్రణాళికా బద్ధంగా చేపట్టాలి. పాఠ్యప్రణాళికల సమగ్ర ప్రక్షాళనకు, కాలదోషం పట్టిన బోధనాంశాల పరిహరణకు ప్రభుత్వమూ చొరవ కనబరచాలి. విద్యా – పారిశ్రామిక రంగాల మధ్య పరస్పరం సహకారం పెంపొందించాలి. పరిశ్రమలు, విద్యాసంస్థల ప్రతినిధులతో కూడిన మధ్యవర్తుల మండలిని ఏర్పాటు చేయాలి.

విదేశాల అనుభవాలు: ( Higher Education – Foreign countries)
జపాన్ వంటి దేశాలు పారిశ్రామికంగా పురోగమించి సత్ఫలితాలు ఒడిసి పట్టడానికి విద్యారంగంలో విశేష అభివృద్ధే కారణమని అమర్త్యసేన్ చెప్పింది అక్షర సత్యం. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపాల్లోనూ పరిశ్రమలు, ప్రభుత్వాలతో విశ్వవిద్యాలయాల భాగస్వామ్యం సాంకేతిక అద్భుతాల సృష్టికి దోహదపడుతుంది. ఆ దేశాల్లో అధునాతన శాస్త్ర పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకొని వినూత్న ఆవిష్కరణలు జరుగుతున్నాయి. కాలానుగుణంగా వినూత్న కోర్సులను రూపొందించుకుంటూ సృజనాత్మక బోధనతో అనేక దేశాలు ఉన్నత విద్యావ్యవస్థలను బలోపేతం చేసుకుంటున్నాయి. చైనా, జపాన్, జర్మనీ, అమెరికా లాంటి దేశాల్లో విద్యాభ్యాసం పూర్తవగానే యువతకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. మన దేశంలో మాత్రం అత్యధిక శాతం తగిన ఉద్యోగ ప్రమాణాలు కొరవడి నిరుద్యోగుల జాబితాను మరింతగా పెంచుతున్నారు. ఇతర దేశాల్లో బోధన, పరిశోధన విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పరిశ్రమలతో, ఇతర కంపెనీలతో విశ్వవిద్యాలయాలను అనుసంధానిస్తున్నారు. సమకాలీన సమస్యలకు, సమాజ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యాసంస్థల్ని తీర్చిదిద్దాలంటే, అమెరికా, తదితర దేశాల్లో అనుసరిస్తున్న మేలైన విధి విధానాలను పరిశీలించి, వాటి అనుభవాలు, విజయాల నుంచి దేశీయంగా మన వైఫల్యాలనుంచి గుణపాఠాలు నేర్చుకొని ముందడుగు వేయాలి.

ఉన్నత విద్యకు అవినీతి చెదలు: (Higher Education - Corruption)
దేశంలో వైద్య కళాశాలల ఆరోగ్య ప్రమాణాలను పర్యవేక్షిస్తూ నాణ్యమైన విద్యా ప్రదానానికి సకల జాగ్రత్తలూ తీసుకోవాల్సిన భారతీయ వైద్యమండలి అవినీతి ఊబిలో కూరుకుపోయి భ్రష్టుపట్టింది. దేశీయంగా సాంకేతిక విద్య అవసరాల్ని మదింపు వేస్తూ ప్రమాణాలు పరిరక్షించాల్సిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అవినీతి కూపంలో చిక్కుకుంది. వైద్య మండలి, సాంకేతికవిద్యా మండలి చేదు అనుభవాలు పునరావృతం కాకుండా పరిపుష్టం చేయాలి. ఉన్నత విద్యావ్యవస్థలలో నియామకాలు పదోన్నతుల్లో లంచాలు, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని తద్వారా చదువుల నాణ్యత దిగజారుతోందని, బోగస్ డిగ్రీలు విచ్చలివిడిగా విజృంభిస్తున్నాయని ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి.

ఉన్నత విద్యపై రాజకీయ క్రీనీడలు: ( Political Influence in Higher Education)
మనం రాజకీయ అజెండాల నుంచి విద్యను తప్పించగలిగితే విద్యార్థులదే కాదు దేశ భవిష్యత్తనూ మార్చవచ్చు. ఉన్నత విద్యకు సంబంధించి అధికార పరిధులు, హెచ్చుతగ్గుల వివాదాలకు ఆస్కారం లేకుండా సుప్రీంకోర్టు గతంలోనే దిశానిర్దేశం చేసింది. విశ్వవిద్యాలయాల స్థాపన రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమైనప్పటికీ బోధన, నాణ్యత, పరీక్షల ప్రమాణాలు, పరిశోధన తదితరాలన్నీ పార్లమెంటు అజమాయిషీలో ఉంటాయని విశదీకరించింది.

చిత్తశుద్ధే కరవు: ( Integrity )
ఉన్నత విద్యలో ప్రమాణాలు పతనమవుతున్నాయని అనేక అధ్యయనాలు, కమిషన్లు, కమిటీలు వెల్లడించాయి. అయినా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు జరగలేదు. ఉన్నత విద్యను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందంటూ జాతీయ విజ్ఞాన సంఘం, యశ్ పాల్ కమిటీ, విద్యావేత్తలు, మేధావులు అనేక సిఫార్సులు, సూచనలు చేసినా సత్వరం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. రెండు దశాబ్దాలుగా దేశ ఆర్థిక రంగంలో సంస్కరణలు అమలవుతున్నాయి. అందుకు అనుగుణంగా ఉన్నత విద్యారంగంలో మార్పులు చేర్పులు తీసుకురావడంలో విఫలమయ్యామని మేధావులు చెబుతున్నారు. విద్యను వ్యాపారాత్మకంగా కాకుండా, మానవ వనరుల అభివృద్ధి సూచికగా చూడాలంటూ యశ్‌పాల్‌ కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు పరచాలి.

ముగింపు: భారీ పెట్టుబడులతో యువతరంలో శక్తి సామర్థ్యాల పెంపుదలకు, మానవ వనరుల అభివృద్ధికి ప్రభుత్వాలు సంసిద్ధమైనప్పుడే వారు దేశానికి తరగని సంపద కాగలుగుతారు. లేకపోతే సామాజికంగా, ఆర్థికంగా వారే గుదిబండలవుతారు. ఉన్నత విద్యారంగం అన్ని రంగాలకు ఆధారమైన రంగం. మారుతున్న పరిస్థితులు, సమాజావసరాలను దృష్టిలో పెట్టుకొని ఉన్నత విద్యారంగంతో అన్ని రంగాలను అనుసంధానం చేయాలి. స్థిరమైన విధానం అనుసరించాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు చేకూరుతాయి. భారతదేశాన్ని నిపుణులు, విద్యావంతులు, సృజనశక్తుల జాతిగా మార్చాలని కంకణం కట్టుకోవాలి. దేశ ప్రజల్ని వ్యూహాత్మక వనరుగా పరిగణిస్తే అభివృద్ధికి నూట ఇరవై కోట్ల అవకాశాలు ఉంటాయి.


























#Tags