Union Budget 2022: నిర్మలా సీతారామన్ చేతి సంచీలో ఏం ఉండబోతోంది..? ఏం ఉంటే బాగుంటుంది..?

ఆశలు రాలి ధూళి పడుతున్న కాలంలో ఉన్నాం మనం. తగ్గితే బాగుండనుకుంటున్న కోవిడ్‌ తగ్గినట్లే తగ్గి తిరిగి ‘వేవ్‌’లెత్తుతోంది! ఆ వేవ్‌ల ప్రభావంతో ఆర్థికంగా అన్ని రంగాలూ కుదేలవుతున్నాయి.
nirmala sitharaman union budget

నిత్యావసర సరకుల ధరలు పెరిగి, వినిమయ శక్తి తగ్గి.. పేద కుటుంబాలు మరింతగా పేదరికంలో కూరుకుపోతున్నాయి. పని చేసే వయసులో ఉన్నవారికి పని దొరకడమే కష్టమైపోతోంది. పట్టభద్రులైన పట్టణ ఉద్యోగార్థుల ఆశాదీపం కొడిగడుతోంది. ఇటువంటి సంక్షోభ తరుణంలో నిరుద్యోగుల కోసం, నిరుపేద కుటుంబాల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ సంచీలో ఏం ఉండబోతోంది? ఏం ఉంటే బాగుంటుంది?

మరొకసారి బడ్జెట్‌ సమీపిస్తున్న తరుణంలో స్పష్టమైన నిస్పృహ, నిరాసక్తత గోచరిస్తున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతా రామన్‌ గత ఏడాది చేసిన బడ్జెట్‌ ప్రసంగం ‘చావో రేవో’ అనిపించేంతగా ఉంది. అప్పటి తీవ్ర ఆర్థిక పరిస్థితికి నేడున్నది కొద్దిగానైనా భిన్నమైనదేమీ కాదు. బడ్జెట్‌కు ముందర స్టాక్‌ మార్కెట్‌లో సాధారణంగా కనిపించే ఉత్తేజం కూడా ఈ ఏడాది కనుమరుగైంది. పెట్టు బడుల ఉపసంహరణ, జి.ఎస్‌.టి.లో 2. లక్ష్యసాధన, భారీ అంచనాల ప్రకటనలతో నిమిత్తం లేకుండా ఆర్థిక విధానం అనేది నిరంతరం నడుస్తూ ఉండే యంత్రం. బడ్జెట్‌ సమర్పణ ఎందుకు, ఎవరి కోసం అనే దానికి స్థూల ప్రాధాన్యం ఉంటుంది.

సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సి.ఎం.ఐ.ఇ.) దగ్గరున్న వివరాలను బట్టి దేశంలో నిరుద్యోగం 2021 డిసెంబరు నాటికి 7.9 శాతంగా నాలుగు నెలల గరిష్ఠస్థాయికి చేరి ఉంది. 2022 జనవరిలో ఇప్పటికే అది 8 శాతాన్ని దాటేసింది. పట్ణణ  నిరుద్యోగం డిసెంబరు ముందు నాటి 8.2 శాతాన్ని మించి డిసెంబరుకు 9. 3 శాతానికి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 6.4 శాతం నుంచి 7.3 శాతానికి పెరిగింది. ఈ నెలవారీ శాతాలను స్థిరమైనవిగా స్వీకరించలేకపోయినా, ఉద్యోగ సంక్షోభం అన్నది ఆందోళనకరమైన స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో రెండు కీలకాంశాలను ప్రత్యేకమైనవిగా ప్రస్తావించాలి.

మొదటిది, పట్ణణాల్లోని యువ విద్యావంతులపై నిరుద్యోగం చూపుతున్న తీవ్ర ప్రభావం. సి.ఎం.ఐ.ఇ. సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహేశ్‌ వ్యాస్‌ ఈ సంగతిని మరింత విపులంగా చెబుతారు. ‘‘20–24 ఏళ్ల మధ్య యువతలో 37 శాతం నిరుద్యోగం ఉండగా, వారిలో పట్టభద్రులైన వారి నిరుద్యోగ రేటు అత్యధికంగా 60 శాతం దాటి ఉంది. 2019లో వారిలోని సగటు నిరుద్యోగం 63.4 శాతం. అంతకు ముందరి మూడేళ్లలో ఏ ఏడాదితో పోల్చి చూసినా ఇది అత్యధికం. వయసులతో నిమిత్తం లేకుండా మొత్తంగా ఉన్న 7.5 శాతం నిరుద్యో గిత భారత్‌ ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్లను ఏ విధంగానూ ప్రతి బింబించదు. 20–29 ఏళ్ల మధ్య పట్టభద్రులు మరింత ఎక్కువగా 42.8 శాతం నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు. భారత్‌కు ఇది మరిం తగా నిజమైన సవాలు’’ అంటారు వ్యాస్‌. దీనినే ఇంకోలా చెప్పా లంటే, పని చేయవలసిన వయసులో ఉన్నవారిలో ఎక్కువవుతున్న నిరుద్యోగం ‘బ్రహ్మాస్త్రం’ వంటి భారతదేశ యువశక్తిని కబళిస్తోందని!  

రెండోది.. ఉద్యోగాలు, ఉపాధి చాలావరకు సేవారంగాలు అంది స్తున్నవే కావడం. మన ఆర్థిక వ్యవస్థలో 54 శాతానికి పైగా వీటి వాటా ఉంది. అయినప్పటికీ  మూడో వేవ్‌ ప్రారంభం అయ్యేనాటికి కూడా ఆ రంగాలింకా మహమ్మారి ముందరి నాటి స్థాయిలోనే వెనుకంజలో ఉన్నాయి. ఈ పరిస్థితి వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచారం, ప్రసార సేవల్లో ప్రతిఫలిస్తూ 2020 ఆర్థిక స్థాయుల కన్నా 8.5 శాతం తక్కువగా ఉండిపోయింది. ఒమిక్రాన్‌ కేసులు ఎక్కువవడం, ప్రాంతీయ ఆంక్షలు, నగరస్థాయి కర్ఫ్యూల కారణంగా సర్వీసు రంగాలలోని ఉద్యోగాలు ఈ జనవరి, ఫిబ్రవరి నెలల్లో కుప్పకూలడం అనివార్యం అవుతోంది. 

కోవిడ్‌ విజృంభించిన తొలి ఏడాది 2020–21లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 11.19 కోట్ల మందికి పని లభించింది. 2019–20లో ఇదే పథకం కింద ఉపాధి పొందిన వారు 7.88 కోట్ల మంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.52 కోట్ల మంది లబ్ధిదారులుగా నమోదై ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ఉద్దేశించిన ఈ భద్రత పథకాన్ని మరింతగా విస్తృత పరచి పట్టణ ప్రాంతాలకు కూడా కల్పించవలసిన సమయం ఆసన్నమైంది. రైల్వే నియామకాల ఎంపిక విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిపిన అభ్యర్థులపై హింసాత్మక దాడులు జరగడం దేశంలో ఉద్యోగ సంక్షోభానికి తాజా నిదర్శనం. ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి మరిన్ని కేటాయింపులు జరగాలి. పట్టణాల్లోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఒక ప్రణాళికను రూపొందించాలి. 

ఆర్థిక వ్యవస్థలో కుటుంబాలు రెండు విధాలైన పాత్రలను సమ్మిళితంగా పోషిస్తాయి. వినియోగంతో డిమాండ్‌ను కల్పిస్తాయి. పొదుపుతో దేశీయ పెట్టుబడులకు దోహదపడతాయి. ఆరోగ్యకరమైన ఈ మేళవింపు ఆదర్శనీయం అయినప్పటికీ మందకొడిగా ఉన్న మార్కెట్‌ పరిస్థితుల్లో  వినియోగానికే ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది. కానీ కుటుంబాల వినియోగ శక్తి క్షీణించి ఆటోమొబైల్‌ అమ్మకాలు, ముఖ్యంగా ద్విచక్రవాహనాల అమ్మకాలు ఒక దశాబ్దపు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.  వాహన రుణాల వడ్డీ రేట్లు 7–10 శాతం మధ్యకు తగ్గినా ఇదే పరిస్థితి. ఇంధనం ధరలు భగ్గుమంటున్నాయి. స్థూల ఉత్పత్తి వ్యయాలు అధికం అవుతున్నాయి. పెరుగుతున్న పండ్లు, కూరగాయల ధరలతో కుటుంబాలు సతమతమవుతున్నాయి. ‘ఈ తరహా ద్రవ్యోల్బణాన్ని మనం కొన్నేళ్లుగా చూడలేదు’ అని హెచ్‌.యు.ఎల్‌. ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ మెహతా అన్నారు.

ఇటీవల నోబెల్‌ గ్రహీత డాక్టర్‌ అమర్త్య సేన్‌తో సంభాషణలో నేను ‘ద్రవ్యోల్బణం ఎందుకింత ప్రధానాంశం?’ అనే ప్రశ్న అడిగాను. అందుకాయన బెంగాల్‌ కరవు నాటి పరిస్థితులను ప్రస్తావించారు. ‘‘1940లలో ద్రవ్యోల్బణం అత్యధికంగా ఉంది. పేద ప్రజల ప్రయో జనాలు విస్మరించడంలోని నాటి ధోరణులే ఇప్పుడూ కనిపిస్తున్నాయి. ఇందుకు పరిష్కారాలు ఆలోచించడానికి సమర్థులైన ఆర్థికవేత్తలు ఎప్పుడూ ఉన్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి మరింతగా దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది’’ అని సేన్‌ అన్నారు. రేపు రానున్న బడ్జెట్‌లో ఈ కోణానికి ప్రాధాన్యం లభించాలి. మహమ్మారి వల్ల పరిస్థితిలో ఏమీ మార్పులకు లోనవని ఎగువ మధ్యతరగతిని అటుంచితే, ఖర్చులను బిగబట్టి ఉన్న కుటుంబాలకు కాస్త ఊపిరి సలిపే నిర్ణయాలను తీసుకోవాలి.   

భారత్‌ ఇప్పుడు రెండు విధాలుగా ఉంది. ఒకటి కార్పొరేట్‌ భారతదేశం. అది చాలా స్థిరమైన ఆదాయాలను, వస్తూత్పత్తి సేవలను నివేదిస్తోంది. ఇది సానుకూలాంశం. రెండోది గృహ భారతదేశం. కుటుంబాలు తమ సభ్యులకు ఆహారం అందించడానికి కష్టపడు తున్నాయి. మరోవైపు ఉద్యోగాలు పోతున్నాయి. కంపెనీల బోర్డు సభ్యులుగా అవకాశాలు పొందడంలో మహిళలు మరింత వెనుకబడి పోతున్నారు. ఇవన్నీ ప్రతికూలాంశాలు. దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ అజెండాకు ముందు ‘ఆక్స్‌ఫామ్‌’ నివేదిక విడుదలైంది. ‘అసమానత చంపేస్తుంది’ అనే శీర్షికతో వెలువడిన ఆ నివేదికలో భారత సమాజంలోని ఆర్థిక అంతరాల వివరాలు ఉన్నాయి. 2021లో భారతదేశంలోని 100 మంది సంపన్నుల సామూహిక సంపద రికార్డు స్థాయిలో రూ. 57.3 లక్షల కోట్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది.

అదే సంవత్సరంలో, జనాభాలో 50 శాతం మంది వాటా జాతీయ సంపదలో కేవలం 6 శాతం. మహమ్మారి కాలంలో (2020 మార్చి నుండి 2021 నవంబర్‌ 30 వరకు) భారతీయ బిలియనీర్ల సంపద రూ. 23.14 లక్షల కోట్ల నుండి రూ. 53.16 లక్షల కోట్లకు పెరిగిందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో 2020లో 4.6 కోట్ల కంటే ఎక్కువ మంది భారతీయులు అత్యంత పేదరికంలోకి జారిపోయారని అంచనా వేసింది. ముంబయ్‌కి చెందిన పీపుల్స్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇండియాస్‌ కన్సూ్యమర్‌ ఎకానమీ (ప్రైస్‌) నిర్వహించిన ఇటీవలి సర్వేలో ఇదే విషయం మరిన్ని రుజువులతో నిర్ధారణ అయింది. ‘‘ఆర్థిక సరళీకరణల తర్వాత మునుపెన్నడూ లేని రీతిలో 1995 నుండి నిరంతరం పెరుగుతూ వస్తున్న భారతీయ కుటుంబాలలో 20 శాతం పేదల వార్షిక ఆదాయం కోవిడ్‌∙వల్ల 2015–16 నాటి స్థాయుల నుండి 2020– 21 మహమ్మారి సంవత్సరంలో 53 శాతం పడి పోయింది’’ అని ‘ప్రైస్‌’ పేర్కొంది. 

ఆవనూనె కొనడానికి ప్రజలు కష్టపడుతున్న దేశం ఇదే. 2021లో ఆపిల్‌ కంపెనీకి రికార్డు స్థాయిలో 60 లక్షల ఐఫోన్‌ల అమ్మకాలు జరిపించిన దేశమూ ఇదే. రేపటి ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ఏ భారతదేశాన్ని ఉద్దేశించినదై ఉండాలని అనుకుంటున్నారు? వాస్తవం గానైతే నేడు భారతదేశంలోని అత్యధిక ప్రజలు అనుభవిస్తున్న దుఃస్థితిని, ఆర్థిక బాధలను తప్పక పరిష్కరించేదిగా బడ్జెట్‌ ఉండాలి. 
                                                                             – మిథాలీ ముఖర్జీ  (‘ది వైర్‌’ సౌజన్యంతో)

#Tags