Basara IIT : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల‌ డిమాండ్లు ఇవే..?

నిర్మల్‌/బాసర: ‘మాకు పురుగులతో కూడిన అన్నం పెట్టినా తింటాం.. కానీ.. చదువు చెప్పేందుకు అధ్యాపకులు లేకపోతే ఎలా? ఓ వైపు విద్యార్థుల సంఖ్యను పెంచిన ప్రభుత్వం.. అదే లెక్కన అధ్యాపకుల సంఖ్యను ఎందుకు పెంచడం లేదు? మా వర్సిటీకి రెగ్యులర్‌ వీసీ.. అది కూడా క్యాంపస్‌లోనే ఉండాల్సిన అవసరం లేదా? ప్రఖ్యాత క్యాంపస్‌లతో వర్సిటీని ఎప్పుడు అనుసంధానిస్తారు? ఇలాంటివి.. ఎన్నో సమస్యలున్నాయ్‌.
Basara IIIT Students

వీటిపై మంత్రులు, ఇన్‌చార్జి వీసీ, కలెక్టర్లతో సహా అధికార, ప్రతిపక్ష నేతలందరినీ కలిశాం. ఇప్పటివరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. తొమ్మిది వేల మంది వరకు ఉండే వర్సిటీ ఎవరికీ పట్టడం లేదు. అందుకే ఆందోళన చేపట్టాతున్నామ‌ని నిర్మల్‌ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు వెల్లడించారు.  

పదో తరగతి తర్వాత...ఇంటిగ్రేటెడ్ బీటెక్

తొమ్మిది వేలమంది ఉండే వర్సిటీలో..


మంగళవారం ఉదయం నుంచి విద్యార్థులంతా ఒక్కసారిగా నిరసనకు దిగారు. క్యాంపస్‌లోని పరిపాలన భవనం ఎదుట ఎండలో బైఠాయించి, రోజంతా ఆందోళన కొనసాగించారు. అలాగే బుధ‌వారం కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. తొమ్మిది వేలమంది ఉండే వర్సిటీలో వేలమంది విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ప్రాంగణమంతా వారి నినాదాలతో మార్మోగుతుంది. అయితే విద్యార్థులను బయటకు రాకుండా.. వారి గోడును బయట ఉన్న తల్లి దండ్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, మీడియాకు వినిపించనివ్వకుండా పోలీసులు  మోహరించారు. అలాగే ఆ ప్రాంతంలో ఇంటర్‌నెట్‌  నిలిపివేశారు. దీంతో ఆర్జీయూకేటీలో ఏం జరుగుతోందో తెలియకుండా పోయింది. ఎట్టకేలకు కొంతమంది విద్యార్థులు ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్, సీఎంవోకు తమ గోడును, డిమాండ్లను తెలియజేశారు. అయినా ప్రభుత్వం ఇంతవరకు దీనిపై స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

సగం పూట మాత్రమే..


గత కొన్నేళ్లుగా వర్సిటీలోకి మీడియాను అనుమతించడం లేదు. దీంతో వర్సిటీలో సమస్యలు, విద్యార్థుల పరిస్థితి, అవినీతి అక్రమాలూ.. ఏవీ బయటకు తెలియడం లేదు. వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా రాహుల్‌ బొజ్జా ఉన్నా.. ఇన్నేళ్లలో కేవలం ఒక్కసారి అది కూడా సగం పూట మాత్రమే వర్సిటీకి వచ్చి వెళ్లారని విద్యార్థులు తెలిపారు. 

విద్యార్థుల డిమాండ్లు ఇవే.. 


☛ తెలంగాణ ముఖ్య‌మంత్రి  కేసీఆర్‌ వర్సిటీని సందర్శించాలి. 
☛ రెగ్యులర్‌ వీసీని నియమించాలి. ఆయన క్యాం పస్‌లోనే ఉండాలి. 
☛ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్యను పెంచాలి. 
☛ ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ ఆధారిత విద్యను అందించాలి.
☛ ఇతర వర్సిటీలు, సంస్థలతో వర్సిటీని అనుసంధానం చేయాలి.
☛ తరగతి, హాస్టల్‌ గదులకు మరమ్మతులు చేయాలి. 
☛ ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్, మంచాలు, బెడ్లు అందించాలి. 
☛ మెస్‌ల మెయింటెనెన్స్‌ మెరుగ్గా ఉండేలా చూడాలి. 
☛ పీడీ, పీఈటీలను నియమించి క్రీడలనూ ప్రోత్సహించాలి.

#Tags