AICTE Guidelines for Engg Colleges: ఇంజనీరింగ్‌ కాలేజీలకు ఏఐసీటీఈ మార్గదర్శకాలు జారీ.. మార్గదర్శకాలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ, రాష్ట్ర ఇంజనీరింగ్‌ సీట్ల కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగిసింది. తెలంగాణలో స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టారు.

చాలా చోట్ల బోధనకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) దేశంలోని అన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలకు కీలకమైన సూచన చేసింది. సీట్లు పొందిన విద్యార్థులకు స్వాగతం పలికే (ఇండక్షన్‌) కార్యక్రమం నుంచే ప్రత్యేక కౌన్సెలింగ్‌ చేపట్టాలని, మానసికంగా సన్నద్ధం చేయించాలని సూచించింది.

నెల రోజులపాటు ప్రతీ బ్రాంచీలో ఆందోళనకు గురయ్యే విద్యార్థులను గుర్తించాలని, దీనికి గల కారణాలను అన్వేషించాలని చెప్పింది. అవసరమైతే వారి తల్లిదండ్రులనూ పిలిపించి, విద్యార్థి మానసిక స్థితిని తెలుసుకోవాలంది. ప్రతీ కాలేజీలోనూ ప్రత్యేక కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, మానసిక నిపుణుల తోడ్పాటు తీసుకోవాలని సలహా ఇచ్చింది. ఏఐసీటీఈ మార్గదర్శకాలను విధిగా అమలు చేసేందుకు యూనివర్సిటీలు, ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తున్నాయి. 

చదవండి: Engineering Seats: ఇంజనీరింగ్‌ సీట్ల పెంపునకు హైకోర్టు ఓకే.. కొత్తగా ఇన్ని వేల సీట్లు అందుబాటులోకి

ఫస్టియర్‌లో 50 శాతం మంది.. 

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో పరిస్థితిపై గత ఏడాది ఏఐసీటీఈ అధ్యయనం చేసింది. గడచిన ఐదేళ్లుగా ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థుల్లో 50 శాతం మొదటి సంవత్సరంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ద్వితీయ సంవత్సరంలో ఇది 30 శాతంగా, మూడో ఏడాది 20 శాతంగా ఉంటోంది.

తొలి ఏడాదిలో 4 శాతం మంది తీవ్ర నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్తున్నారు. మూడో ఏడాదిలో కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవడంతో ఇంతే తీవ్రస్థాయిలోకి వెళ్తున్నారు. దీనికి ప్రధాన కారణం సిలబస్‌పై అవగాహన లేకపోవడం. ఇంటర్మీడియెట్‌ వరకూ విద్యార్థులు బట్టీ విధానంలో చదువుతున్నారు.

మార్కులే లక్ష్యంగా బోధన సాగు తోంది. సబ్జెక్టును లోతుగా అధ్యయనం చేసే విధానం ఉండటం లేదు. ఈ క్రమంలో బోధన అర్థం కాని పరిస్థితి ఉంటోందన్నది ఏఐసీటీఈ పరిశీలన. దీన్ని ముందుగా దూరం చేయాలని మండలి సూచించింది. 

చదవండి: IITH: సీఎం చేతులమీదుగా ఐఐహెచ్‌టీ ప్రారంభం.. ఏటా ఇంత‌ మంది విద్యార్థులుకు డిప్లొమా కోర్సు

ఏఐ డామినేషన్‌.. 

కంప్యూటర్‌ కోర్సులను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) డామినేట్‌ చేస్తోంది. రాష్ట్రంలో 86,943 ఇంజనీరింగ్‌ సీట్లు ఉంటే, కంప్యూటర్‌ కోర్సుకు సంబంధించినవే 61,587 ఉన్నాయి. కంప్యూటర్‌ కోడింగ్‌ కేవలం ఇంజనీరింగ్‌లోనే ఎదురవుతుంది. దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారని మండలి పరిశీలనలో తేలింది.

ఏఐ, ఎంఎల్‌ వంటి కోర్సులు బోధించే ఫ్యాకల్టీలో నిపుణులు లేకపోవడమూ సమస్యకు కారణమవుతోంది. మెకానికల్, సివిల్‌ బ్రాంచీల్లో అకడమిక్‌గా విద్యార్థులకు ఇబ్బంది ఎదురవడం లేదు. కానీ ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడంపై అన్ని కాలేజీలు దృష్టి పెట్టాలని సాంకేతిక విద్యామండలి సూచించింది. 

#Tags