Engineering Seats: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ సీట్ల దందా.. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే సీటు..

ర్యాంకులతో సంబంధం లేదు.. మెరిట్‌ మాటే లేదు.. రూల్స్‌ గీల్స్‌ జాన్తా నై..లక్షల్లో వసూళ్లు.. ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికే సీటు..ముందే విక్రయాలు.. పేరుకు అడ్మిషన్లు అంటూ ప్రకటనలు..సీట్ల కోసం వెళ్లే మెరిట్‌ విద్యార్థులకు గేట్లు బంద్‌..సీట్లు లేవని వాచ్‌మన్‌లతోనే చెప్పిస్తూ వెళ్లగొడుతున్న తీరు..

రాష్ట్రంలోని చాలా ప్రైవేటు, కార్పొరేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఉన్నత విద్యా మండలి ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి గత నెల 31న అనుమతించింది. పలు కాలేజీలు ప్రవేశ ప్రకటనలు ఇచ్చి, దరఖాస్తులు ఆహ్వానించాయి. కానీ, దీంతో ఆయా కాలేజీలకు వెళ్లిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురవుతోంది. 

‘ఇంకెక్కడి సీట్లు... ఎప్పుడో అయిపోయాయి’ అంటూ సెక్యూరిటీ సిబ్బందితో గెంటివేయిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. దీనిపై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. అధికారులు, నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నాయి. ఈఏపీసెట్‌ పరీక్ష ఫలితాలు రావడంతో సీట్ల వ్యాపారం జోరందుకుందని పేర్కొంటున్నాయి. 

ఏటా ఇదే దందా..  
యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అడ్మిషన్ల ప్రకటన వెలువడ్డాకే సీట్లు భర్తీ చేయాలి. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి. తొలుత జేఈఈ మెయిన్స్‌ ర్యాంకర్లకు, తర్వాత ఈఏపీసెట్‌ ర్యాంకర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంకా సీట్లు ఉంటే.. ఇంటర్‌లో మెరిట్‌ మార్కులను పరిగణనలోకి తీసుకుని సీట్లు ఇవ్వాలి. యాజమాన్య కోటాలోని 30శాతం సీట్లలో 15శాతం సీట్లను ఇలా భర్తీ చేయాలి. ‘అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ)’ నిర్ధారించిన మేరకు మాత్రమే ఫీజు వసూలు చేయాలి. 

Telangana Civil Judges Exam: తెలంగాణ సివిల్‌ జడ్జీల ప్రధాన పరీక్ష రాసేందుకు ఆ 11 మందికి అనుమతి

మరో 15 శాతం సీట్లను ప్రవాస భారతీయులు సిఫార్సు చేసిన విద్యార్థులకు (ఎన్నారై కోటా) కింద కేటాయించాలి. ఈ కేటగిరీలో ఏడాదికి 5 వేల డాలర్ల ఫీజు (సుమారు రూ.4.2 లక్షలు) వసూలు చేసుకోవచ్చు. కానీ కాలేజీలు ఈ నిబంధనలేవీ పట్టించుకోవడం లేదు. బ్రాంచీని బట్టి ఐదారు లక్షల నుంచి 20 లక్షల దాకా డబ్బులు తీసుకుని సీట్లను వేలం పాటలో అమ్మేసుకుంటున్నాయి. ఆ విద్యార్థులు మాత్రమే తమ కాలేజీకి దరఖాస్తు చేసుకున్నారని, వారి మెరిట్‌ మేరకే సీట్లు ఇచ్చామని చూపుతున్నాయి.  

మంచి ర్యాంకులు, మార్కులు వచ్చిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వకుండా చూసుకుంటున్నాయి. ఏటా ఈ దందా ఇలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నీట్‌ మాదిరిగా.. ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేపడితే బాగుంటుందని ఉన్నత విద్యా మండలి గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కానీ కాలేజీ యాజమాన్యాలు తమ పలుకుబడితో దీనిని అడ్డుకున్నాయి. 

రూ. 1,500 కోట్ల ‘వ్యాపారం’ 
రాష్ట్రంలోని 175 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 156 ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా 1,12,069 సీట్లు ఉండగా.. అందులో ప్రైవేటు కాలేజీల్లోని సీట్లు 1.06 లక్షలు. ఈ సీట్లలో 30శాతం యాజమాన్య కోటా కింద కాలేజీలే భర్తీ చేసుకుంటాయి. ఇందులో సుమారు 20వేల సీట్లు కంప్యూటర్స్, అనుబంధ బ్రాంచీలవే. వాటికి డిమాండ్‌ చాలా ఎక్కువ. ఈ సీట్లను కాలేజీని బట్టి కనిష్టంగా రూ. 8 లక్షల నుంచి గరిష్టంగా రూ. 20లక్షల వరకూ అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. 

ఇప్పటికే దాదాపు 15వేల సీట్లను కాలేజీలు అమ్మేసుకున్నాయని సమాచారం. అంటే సుమారు రూ.1,500 కోట్ల మేరకు దందా జరిగినట్టు తెలిసింది. ఇంత భారీగా సాగుతున్న అక్రమ వ్యవహారంలో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు, ‘సహకారం’ అందిస్తున్న ప్రజాప్రతినిధులకు వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా.. ఈ సీట్ల అమ్మకం వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతోందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. 

Doctor Posts: గాంధీ, ఉస్మానియాల్లో 235 డాక్టర్‌ పోస్టుల భర్తీ.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉద్యోగాలు

వెళ్లిన వాళ్లను వెళ్లినట్టే వెనక్కి పంపుతూ.. 
– హైదరాబాద్‌లోని ఓ రాజకీయ ప్రముఖుడి కాలేజీకి ఒక జేఈఈ ర్యాంకర్‌ దరఖాస్తుతో వెళ్లాడు. కానీ సీట్లు ఎప్పుడో భర్తీ అయిపోయాయని చెప్తూ.. గేట్‌ వద్ద నుంచే వాచ్‌మెన్‌ వెనక్కి పంపేశాడు. చేసేదేమీ లేక ఫిర్యాదు చేసేందుకు ఆ విద్యార్థి ఉన్నత విద్యా మండలికి వచ్చాడు. 
– రంగారెడ్డి జిల్లాలోని ఓ టాప్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో సీటు కోసం ఓ విద్యార్థి వెళ్లాడు. అతడికి ఈఏపీసెట్‌లో 20వేల ర్యాంకు వచ్చింది. అయితే సీట్లు పెరిగితే అడ్మిషన్‌ ఇచ్చే విషయం చూద్దామని యాజమాన్యం చెప్పి పంపిందని.. సీఎస్‌ఈ కోసమైతే రూ.12 లక్షలు సిద్ధం చేసుకోవాలని సూచించిందని ఆ విద్యార్థి వెల్లడించాడు. 
– కౌన్సెలింగ్‌ సందర్భంగా ఓ విద్యారి్థకి రాష్ట్రంలో టాప్‌ టెన్‌లో ఉండే ఓ కాలేజీలో మెకానిక్‌ బ్రాంచీలో సీటు వచ్చింది. అయితే సీఎస్‌ఈ సీటు ఇవ్వాలని ఆ విద్యార్థి కాలేజీని కోరగా.. కొత్త సీట్లు వచ్చాక ఇస్తామని, ఇప్పుడే రూ.18 లక్షలు కట్టేస్తే ఖరారు చేస్తామని తేల్చి చెప్పింది. 

నిబంధనలు విధిగా పాటించాలి 
యాజమాన్య కోటా సీట్ల భర్తీలో కాలేజీలు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌ దరఖాస్తులను స్వీకరించాలి. ప్రతి కాలేజీ వెబ్‌సైట్‌ అందుబాటులో ఉంచాలి. దీనిపై ఇప్పటికే కాలేజీలకు సర్క్యులర్‌ కూడా ఇచ్చాం. ఎవరికైనా అన్యాయం జరిగితే మండలికి ఫిర్యాదు చేయవచ్చు. 
– ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి 

దోపిడీకి అడ్డుకట్ట వేసేదెప్పుడు? 
యాజమాన్య కోటా సీట్ల దందాను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. యాజమాన్యాలకు కొమ్ముగాయడమే ఈ పరిస్థితికి కారణం. యాజమాన్య కోటా సీట్లను కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయాలి. ఈ దిశగా తక్షణం చర్యలు చేపట్టాలి. 
– చింతకాయల ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి 

ఇంత అన్యాయమా? 
ఇంజనీరింగ్‌ కాలేజీల సీట్ల వ్యాపారాన్ని అడ్డుకోలేక పోవడానికి కారణాలేమిటో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. నోటిఫికేషన్‌ ఇచ్చే నాటికే సీట్లు అమ్మేస్తుంటే అధికారులు ఎందుకు నియంత్రించడం లేదు. ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికైనా యాజమాన్య కోటా సీట్లను ప్రభుత్వమే భర్తీ చేయాలి. 
– టి.నాగరాజు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

ఫిర్యాదు చేశా.. చర్యలు తీసుకుంటారా? 
శ్రీదేవి విమెన్స్‌ కాలేజీలో బి కేటగిరీ సీటు కోసం వెళ్లిన యాస శ్రీకీర్తిరెడ్డి అనే విద్యారి్థని యాజమాన్యం లోపలికి కూడా రానివ్వలేదు. ప్రవేశ ప్రకటన ఇచ్చి ఇలా చేయడం దారుణం. దీనిపై ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేశాం. ఏం చర్య తీసుకుంటుందో చూడాలి. 
– డాక్టర్‌ కురువ విజయకుమార్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు  

#Tags