DSC 2024: డీఎస్సీ’ మరింత ఆలస్యం?.. ఎవరి వాదన వారిదే..

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామకాలపై షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) ఉపవర్గీకరణ తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా జరిపే నియామకాల్లోనూ వర్గీకరణను అమలు చేస్తామని.. అవసరమైతే ఆర్డినెన్స్‌ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం తెలిసిందే. 

అయితే సుప్రీంకోర్టు తీర్పునకు ముందే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చినందున ఇప్పుడు నిబంధనల మార్పు ఎలా సాధ్యమని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వమే దీనిపై స్పష్టత ఇవ్వాలని అంటున్నారు. నోటిఫికేషన్‌ ఇచ్చాక ఇప్పుడు మార్పులు చేస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో టీచర్ల నియామకానికి బ్రేక్‌ పడుతుందా? అనే సందేహాలు నిరుద్యోగులను వెంటాడుతున్నాయి. 

చదవండి: TS DSC Results 2024 Release Date : టీఎస్ డీఎస్సీ-2024 ఫలితాల విడుద‌ల తేదీ ఇదే..? అలాగే 'కీ' కూడా..

ఫలితాలు వెలువడేనా? 

రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్‌ పోస్టుల భర్తీకి జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకూ డీఎస్సీ నిర్వహించారు. మొత్తం 2,79,957 మంది పరీక్షకు దరఖాస్తు చేశారు. సోమవారంతో ముగిసిన ఈ పరీక్ష ‘కీ’ని రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. సెపె్టంబర్‌ మూడో వారానికి ఫలితాలు వెల్లడించి అక్టోబర్‌లో నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. 

ఈ తరుణంలోనే ఎస్సీ వర్గీకరణ తీర్పు, సీఎం ప్రకటన వెలువడటం డీఎస్సీ భవితవ్యంపై సందేహాలకు తావిస్తోంది. ఫలితాల వెల్లడిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఉప వర్గీకరణ డేటా సేకరణ, అమలు, దాని ప్రకారం డీఎస్సీలో పోస్టుల విభజన చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితిలో అధికారులున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని విద్యాశాఖకు లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు. 

చదవండి: TET, DSC Free training : TET, DSC కి ఉచిత శిక్షణ ఎక్కడంటే..

ఎవరి వాదన వారిదే.. 

ఇప్పుడు జరిపే నియామకాల్లో వర్గీకరణ చేపట్టాలన్నది మాదిగ వర్గీయుల వాదన. అసెంబ్లీలో సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు కోరుతున్నారు. అవసరమైతే నిబంధనలు మార్చాలంటున్నారు. ఇదే వాదనతో అధికారులు, ప్రభుత్వ నేతలను కలిసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు మాల సామాజికవర్గం భిన్న స్వరం వినిపిస్తోంది. 

తీర్పు రాకముందే ఇచ్చిన డీఎస్సీని వర్గీకరణ పేరుతో ఆపడం సరికాదని అభిప్రాయపడుతోంది. అలా చేస్తే న్యాయపోరాటంతోపాటు వీధి పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తోంది. ఇంకోవైపు పరీక్ష రాసిన విద్యార్థుల్లోనూ ఆందోళన నెలకొంది. రూ. లక్షలు వెచ్చించి కోచింగ్‌ తీసుకున్నామని ఆవేదన చెందుతున్నారు.  

డీఎస్సీ ఆపితే ఆందోళన చేస్తాం 
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం తీర్పునకు ముందే ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అలాంటప్పుడు ఇప్పుడెలా నియామకాలు ఆపుతారు? సీఎం ఒక కులాన్ని భుజానికెత్తుకోవడం మంచిదికాదు. ఇది మా మనోభావాలు దెబ్బతీసే అంశం. డీఎస్సీ నియామక ప్రక్రియ ఆపితే ఆందోళనలు చేస్తాం. ఇప్పటికే కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నాం. 
– జి. చెన్నయ్య, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు 

అమలు చేయాల్సిందే 
ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణను అమలు చేస్తామని సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. డీఎస్సీ నియామకాల్లోనూ ఇది అమలు కావాల్సిందే. అవసరమైతే నిబంధనలు సవరించాలి. గతంలో కానిస్టేబుల్, ఎస్సై నియామకాల్లోనూ కటాఫ్‌ రిజర్వేషన్ల విధానంలో సవరణలు తెచ్చారు. ఇప్పుడు దీన్ని అనుసరించడంలో తప్పేం లేదు. దీని అమలు కోసం మేం ఎంత దూరమైనా వెళ్తాం. 
– గోవింద్‌ నరేష్‌ మాదిగ, ఎంఆర్‌పీఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు 

ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి 
ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణ నేపథ్యంలో డీఎస్సీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఈ విషయంలో లక్షల మంది విద్యార్థుల మానసిక ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలి. టీచర్ల బదిలీలు, పదోన్నతుల తర్వాత మరిన్ని టీచర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుత డీఎస్సీపైనే సందేహాలుంటే కొత్త ఉద్యోగాల పరిస్థితి ఏంటనే ఆందోళన నిరుద్యోగుల్లో ఉంది. 
– రావుల రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

#Tags