Human Evolution: మానవ పరిణామంలో కొత్త కోణం.. తొలి అడుగులు చెట్ల మీదే!

భూమిపై మానవ వికాసం జరిగిన తీరు మనకిప్పటికీ పెద్ద మిస్టరీనే. అందులో అత్యంత కీలకమైన ‘ముందడుగు’ నడక. వెన్నును నిటారు చేసి రెండు కాళ్లపై సాగడం మానవ పరిణామ క్రమంలో నిజానికి చాలా పెద్ద మలుపు.

ఇతర చతుష్పాద జంతువులన్నింటి నుంచీ ఇదే మనిషిని పూర్తిగా వేరు చేసి అత్యంత ప్రత్యేకంగా నిలిపింది. ఇంత కీలకమైన నడకను మన పూర్వ మానవుడు ఎప్పుడు నేర్చాడన్నది మనకే గాక పరిశోధకులకు కూడా అత్యంత ఆసక్తికరమైన టాపికే. దీనిపై దశాబ్దాలుగా ఎన్నెన్నో పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి. అడవులు, తత్ఫలితంగా చెట్లు బాగా తగ్గి మైదాన ప్రాంతం పెరుగుతూ పోవడం వల్లే మనిషి రెండు కాళ్లపై నడక నేర్చుకోవాల్సి వచ్చిందని అవన్నీ దాదాపుగా ముక్త కంఠంతో చెప్పే మాట. కానీ అది పూర్తిగా తప్పంటోంది తాజా పరిశోధన ఒకటి. మన పూర్వీకులు చెట్లపై నివసించే రోజుల్లోనే రెండు కాళ్లపై నడవడం నేర్చారట. అదీ నిటారుగా! ఆ తర్వాతే పూర్తిస్థాయిలో నేలపైకి దిగారని వాదిస్తోంది! తెలివితేటల్లోనూ ఇతరత్రా కూడా జంతుజాలమంతటిలో మనిషికి అత్యంత సమీప జీవి అయిన చింపాంజీలపై 15 నెలల పాటు లోతుగా పలు కోణాల్లో పరిశోధనలు చేసి మరీ ఈ మేరకు తేల్చామంటోంది.

Weekly Current Affairs (International) క్విజ్ (18-24 నవంబర్ 2022) 
ఏం చేశారు? 
తూర్పు ఆఫ్రికాలో టాంజానియాలోని ఇసా లోయలో కొద్దిపాటి చెట్లు, కాస్తంత దట్టమైన అడవి, విస్తారమైన మైదాన ప్రాంతం మధ్య జీవిస్తున్న 13 అడవి చింపాంజీలను పరిశోధనకు ఎన్నుకున్నారు. మన పూర్వీకులు నడిచేందుకు దారి తీసిందని భావిస్తున్న చెట్ల లేమి, అపారమైన బయలు ప్రదేశం కారణంగా అవి కూడా అలాంటి ప్రయత్నాలేమైనా చేస్తాయేమో గమనించడం అధ్యయనం ఉద్దేశం. ‘‘ఇందుకోసం చింపాంజీల ప్రవర్తనను అతి దగ్గరగా పరీక్షించి ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ వచ్చాం. వాటి తాలూకు ఏకంగా 13 వేల రకాలుగా హావభావాలను లోతుగా గమనించాం’’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న డాక్టర్‌ అలెక్స్‌ పీల్‌ వివరించారు.

కానీ అవి అచ్చం అ త్యంత దట్టమైన అడవుల్లోని చింపాంజీల మాదిరిగానే అత్యధిక సమయం తమకందుబాటులో ఉన్న కొద్దిపాటి చెట్లపైనే గడుపుతూ వచ్చాయి నడిచే ప్రయత్నమే చేయలేదని చెప్పుకొచ్చారు. ‘‘కనుక దాదాపు 50 లక్షల ఏళ్ల క్రితం అటవీ సంపద తరిగిపోయి మైదాన ప్రాంతం ఎక్కువైన క్రమంలోనే ఆదిమ మానవుడు చెట్ల నుంచి నేలపైకి దిగి నిటారు నడక నేర్చాడన్న భావన తప్పు. దాన్నతను కచ్చితంగా చెట్లపైనే నేర్చుంటాడు. తర్వాత కూడా ఆహార వృక్షాల అన్వేషణలో చాలాకాలం పాటు చెట్లపై నిటారుగానే నడిచుండాలి. ఆ రకంగా మానవ వికాసానికి చెట్లే ఊతమిచ్చాయని భావించవచ్చు’’ అని ఆయన వివరించారు. ఈ అధ్యయనం జర్నల్‌ సైన్స్‌ అడ్వాన్సెస్‌లో పబ్లిషైంది.  

Most Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు
కొసమెరుపు

ఇంతా చేస్తే, తోకలేని కోతుల(ఏప్‌)న్నింట్లోనూ మన పూర్వీకులు మాత్రమే రెండు కాళ్ల నడకను ఎలా, ఎందుకు నేర్చారన్నది మాత్రం ఇప్పటికీ మిస్టరీయేనని అధ్యయనకర్తలు అంగీకరించారు! విస్తారమైన మైదాన ప్రాంతం అందుబాటులో ఉన్నా చింపాంజీలు చెట్లపైనే ఎందుకు అత్యధిక సమయం గడిపిందీ తేలితే బహుశా ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏమైనా క్లూ దొరకవచ్చంటున్నారు. అందుకే తమ తర్వాతి అధ్యయనం దీని మీదేనని ప్రకటించారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (11-17 నవంబర్ 2022)

#Tags