Grandmaster Praneeth: భారత చెస్‌ 82వ జీఎంగా తెలంగాణ కుర్రాడు

అంతర్జాతీయ చెస్‌ టోర్నీలలో తన నిలకడమైన ప్రదర్శనను కొనసాగిస్తూ తెలంగాణ టీనేజ్‌ ప్లేయర్‌ వుప్పాల ప్రణీత్‌ భారత 82వ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం)గా అవతరించాడు.

అజర్‌బైజాన్‌లో జరిగిన బకూ ఓపెన్‌ టోర్నీలో 15 ఏళ్ల ప్రణీత్‌ గ్రాండ్‌మాస్టర్‌ హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అధిగమించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ప్రణీత్‌ ఆరు పాయింట్లు స్కోరు చేసి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. ఎనిమిదో రౌండ్‌లో టాప్‌ సీడ్, అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ హాన్స్‌ మోక్‌ నీమన్‌పై ప్రణీత్‌ గెలుపొందడంతో అతని లైవ్‌ ఎలో రేటింగ్‌ 2500.5గా నమోదైంది. చివరి రౌండ్‌లో ఈ టోర్నీ విజేత, భారత గ్రాండ్‌మాస్టర్‌ లియోన్‌ ల్యూక్‌ మెండోంకా (గోవా) చేతిలో ఓడిపోయినా అతని ఎలో రేటింగ్‌పై ప్రభావం చూపకపోవడంతో ప్రణీత్‌కు జీఎం హోదా ఖాయమైంది. 
► ఈ టోర్నీలో ప్రణీత్‌ నలుగురు గ్రాండ్‌మాస్టర్లు వహాప్‌ సనాల్‌ (తుర్కియే), వుగార్‌ అసాదిల్‌ (అజర్‌బైజాన్‌), లెవాన్‌ పాంత్సులయ (జార్జియా), నీమన్‌ (అమెరికా)లపై నెగ్గడంతోపాటు ఇస్కందరోవ్‌ (అజర్‌బైజాన్‌), నిజాత్‌ అబసోవ్‌ (అజర్‌బైజాన్‌)లతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (09-15 ఏప్రిల్ 2023)
► చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌ హోదా రావాలంటే మూడు జీఎం నార్మ్‌లు సాధించడంతోపాటు ఎలో రేటింగ్‌ పాయింట్లు 2500 దాటాలి. ప్రణీత్‌ ఇప్పటికే మూడు జీఎం నార్మ్‌లు సంపాదించినా అతని ఎలో రేటింగ్‌ 2500 దాటలేకపోవడంతో జీఎం హోదా కోసం నిరీక్షించాల్సి వచ్చింది. అయితే బకూ ఓపెన్‌లో ప్రణీత్‌ అద్భుత ప్రదర్శన కనబరిచి తన 2500 ఎలో రేటింగ్‌ను అధిగమించడంతో అతనికి జీఎం హోదా ఖరారైంది. 
► ప్రణీత్‌ తొలి జీఎం నార్మ్‌ను 2022 మార్చిలో ఫస్ట్‌ సాటర్‌డే టోర్నీలో, రెండో జీఎం నార్మ్‌ను 2022 జూలైలో బీల్‌ ఓపెన్‌ టోర్నీలో, మూడో జీఎం నార్మ్‌ను 2023 ఏప్రిల్‌లో సన్‌వే ఫార్మెన్‌టెరా ఓపెన్‌ టోర్నీలో సాధించాడు. 


► 2021 వరకు ప్రముఖ కోచ్‌ ఎన్‌వీఎస్‌ రామరాజు వద్ద శిక్షణ పొందిన ప్రణీత్‌ ప్రస్తుతం ఇజ్రాయెల్‌ గ్రాండ్‌మాస్టర్‌ విక్టర్‌ మిఖాలెవ్‌స్కీ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. పదేళ్లుగా చెస్‌ ఆడుతున్న ప్రణీత్‌ శ్రమకు తగ్గ ఫలితం రావడంపట్ల అతని తల్లిదండ్రులు శ్రీనివాసాచారి, ధనలక్ష్మి ‘సాక్షి’తో ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకైతే ప్రణీత్‌ను సొంత ఖర్చులతోనే టోర్నీలకు పంపించామని, ఇకనైనా అతనికి స్పాన్సర్లు వస్తే సంతోషిస్తామని తెలిపారు. 

► భారత చెస్‌లో తెలంగాణ నుంచి గ్రాండ్‌మాస్టర్‌ హోదా పొందిన ఐదో ప్లేయర్‌గా ప్రణీత్‌ నిలిచాడు. గతంలో ఇరిగేశి అర్జున్‌ (2018), హర్ష భరతకోటి (2019), రాజా రిత్విక్‌  (2021), రాహుల్‌ శ్రీవాత్సవ్‌ (2022)ఈ ఘనత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇప్పటికే పెంటేల హరికృష్ణ (2001), హంపి (2002), హారిక (2011), లలిత్‌ బాబు (2012), కార్తీక్‌ వెంకటరామన్‌ (2018) గ్రాండ్‌మాస్టర్‌ హోదా పొందారు.   

Arjun Erigaisi: టెపి సెగెమన్‌ ఓపెన్ టోర్నీలో అర్జున్‌కు ఆరో స్థానం

#Tags