Paralympics: పారాలింపిక్స్‌లో 25కు చేరిన భార‌త్ పతకాల సంఖ్య

పారిస్ పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొడుతున్నారు.

సెప్టెంబ‌ర్ 5వ తేదీ నాటికి భార‌త్ ప‌త‌కాల సంఖ్య 25కు చేరింది. పారాలింపిక్స్‌లో జరిగిన ‘క్లబ్‌ త్రో–ఎఫ్‌51’ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన ధరమ్‌వీర్‌ పసిడి పతకం సాధించాడు. ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్‌ ప్రణవ్‌ సూర్మాకు రజతం దక్కింది. ‘క్లబ్‌’ను 34.92 మీటర్ల దూరం విసిరి ధరమ్‌వీర్‌ పసిడి పతకాన్ని గెలుచుకోగా.. 34.59 మీటర్ల దూరంతో ప్రణవ్‌ సూర్మా రజతం సొంతం చేసుకున్నాడు. 

తొలి నాలుగు ప్రయత్నాలు ఫౌల్‌ అయినా ఐదో త్రోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి చివరకు ధరమ్‌వీర్‌ అగ్ర స్థానంలో నిలిచాడు. ఈవెంట్‌లో దిమిత్రిజెవిచ్‌ (సెర్బియా–34.18 మీటర్లు)కు కాంస్యం దక్కింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలవడం పట్ల చాలా గర్వంగా ఉందని, ఈ పతకాన్ని తన గురువు అమిత్‌కు అంకితం ఇస్తున్నట్లు ధరమ్‌వీర్‌ ప్రకటించాడు.  

జూడోలో కపిల్‌కు కాంస్యం.. 
పురుషుల జూడో 60 కేజీల జే1 ఈవెంట్‌లో భారత ప్లేయర్‌ కపిల్‌ పర్మార్‌ కాంస్యం సాధించాడు. కాంస్య పతక మ్యాచ్‌లో కపిల్‌ 10–0తో ఒలీవిరా డి ఎలెల్టన్‌ (బ్రెజిల్‌)పై విజయం సాధించాడు.   

ఆర్చరీలో చేజారిన కాంస్యం.. 
భారత ఆర్చరీ మిక్స్‌డ్‌ జోడీ హర్విందర్‌–పూజ జత్యాన్‌ కాంస్య పతకం నెగ్గడంలో విఫలమైంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో హర్విందర్‌ –పూజ 4–5తో స్లొవేనియాకు చెందిన జివా లావ్‌రింక్‌–ఫ్యాబ్‌సిక్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

Paralympics Record: భారత పారాలింపిక్స్‌ చరిత్రలో అత్యధిక పతకాలు

ప్ర‌స్తుతం భార‌త్ ఖాతాలో 25 మెడ‌ల్స్ ఉండ‌గా.. వీటిలో 5 స్వ‌ర్ణాలు, 9 ర‌జ‌తాలు, 11 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. దీంతో ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త్ 16వ స్థానంలో కొన‌సాగుతోంది.

#Tags