Archery World Cup Stage 3: ప్రపంచకప్‌ ఆర్చరీ టోర్నీలో జ్యోతి సురేఖ బృందానికి కాంస్యం

ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–3 టోర్నమెంట్‌లో మహిళల, పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో భారత జట్లు కాంస్య పతకాలు సాధించాయి.

జూన్ 14న‌ జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు ‘షూట్‌ ఆఫ్‌’లో మెక్సికో జట్టును ఓడించింది. నిర్ణీత నాలుగు రౌండ్ల తర్వాత రెండు జట్లు 232–232 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూట్‌ ఆఫ్‌’ నిర్వహించారు. ‘షూట్‌ ఆఫ్‌’లోనూ రెండు జట్లు 29–29తో సమంగా నిలిచాయి. అయితే భారత జట్టు కొట్టిన మూడు షాట్‌లలో ఒకటి ‘బుల్స్‌ ఐ’ షాట్‌ ఉండటంతో కాంస్య పతకం ఖరారైంది. 

World Test Championship final: తొలిసారి టెస్టుల్లో ప్రపంచ చాంపియన్‌గా ఆసీస్‌.. 

అంతకుముందు క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో భారత జట్టు 2119 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. నాకౌట్‌ దశలో తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన భారత్‌ క్వార్టర్‌ ఫైనల్లో 230–223తో ఎల్‌ సాల్వడార్‌ జట్టును ఓడించింది. అమెరికాతో జరిగిన సెమీఫైనల్లో స్కోరు 232–232తో స్కోరు సమమయ్యాక ‘షూట్‌ ఆఫ్‌’లో భారత జట్టు 28–29తో ఓడిపోయింది. క్వాలిఫయింగ్‌ వ్యక్తిగత రౌండ్‌లో 16 ఏళ్ల అదితి 711 పాయింట్లు స్కోరు చేసి టాపర్‌గా నిలిచింది. ఈ క్రమంలో అండర్‌–18 విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.  

మరో కాంస్యం.. 
మరోవైపు అభిషేక్‌ వర్మ, ఓజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలే, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్‌ జట్టుకు కూడా కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్‌లో భారత్‌ 236–228తో కొలంబియా జట్టుపై గెలిచింది. అంతకుముందు భారత్‌ తొలి రౌండ్‌లో 237–228తో చిలీపై, క్వార్టర్‌ ఫైనల్లో 237–223తో స్లొవేనియాపై గెలిచింది. అయితే మెక్సికోతో జరిగిన సెమీఫైనల్లో 237–237తో స్కోర్లు సమమయ్యాక.. ‘షూట్‌ ఆఫ్‌’లో భారత్‌ 27–29తో ఓడిపోయింది.

World Cup 2023 Schedule: వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే.. అహ్మదాబాద్‌లో భారత్, పాక్‌ పోరు..

#Tags