Lok Sabha Election 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు.. బీజేపీ, కాంగ్రెస్‌కు చెరో ఎనిమిది స్థానాలు..

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించాయి.

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని ఎంఐఎం నిలుపుకొంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్‌ ఒక్క స్థానాన్ని కూడా సాధించలేదు. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున మొత్తం 9 మంది సిట్టింగ్‌ ఎంపీలు పోటీచేయగా.. వారిలో ఐదుగురు ఓటమి పాలయ్యారు. ఈసారి 8 మంది తొలిసారి ఎంపీగా గెలిచి రాష్ట్రం నుంచి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. 

దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ పట్టు.. 
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో తన పట్టును నిలుపుకోగా.. ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో ఉన్న మొత్తం 5 లోక్‌సభ సీట్లనూ కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ మూడింటిని గెలుచుకుని ఆ ప్రాంతాల్లో ఆధిపత్యం చాటింది. 

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత, సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించడంతో పాత నగరంపై ఆ పార్టీ పట్టు నిలుపుకొంది. 

AP Election Results: ఏపీలో భారీ విజ‌యం సాధించిన ఎన్డీఏ కూటమి.. ఈ పార్టీలు గెలిచిన ఎంపీ స్థానాలు ఇవే..

ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్‌ జిల్లాల్లో రెండేసి చొప్పున మొత్తం ఆరు లోక్‌సభ సీట్లు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ చెరో మూడు సీట్లను దక్కించుకున్నాయి. అదీ ప్రతి జిల్లాలో చెరో సీటు సాధించడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని రెండు సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. 

గత, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లివే.. 
పార్టీ    2014    2019    2024 
కాంగ్రెస్‌    2    3    8 
బీజేపీ    1    4    8 
ఎంఐఎం    1    1    1 
బీఆర్‌ఎస్‌    11    9    0 

నల్లగొండ: కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 

భువనగిరి: కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. 

నాగర్‌ కర్నూల్‌: కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి 94,414 ఓట్ల మెజారిటీతో సమీప బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ ప్రసాద్‌పై గెలుపొందారు. 

పెద్దపల్లి: కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31,364 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌పై విజయం సాధించారు. 

వరంగల్‌: కాంగ్రెస్‌ అభ్యర్ధి, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య గెలిచారు. 

మహబూబాబాద్‌: కాంగ్రెస్‌ అభ్యర్థి పి.బలరాంనాయక్‌ 3,49,165 ఓట్ల మెజారిటీతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ మాలోతు కవితపై విజయం సాధించారు.  

ఖమ్మం: కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయం సాధించారు.  

జహీరాబాద్‌: కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ 46,174 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధి/సిట్టింగ్‌ ఎంపీ బీబీ పాటిల్‌పై విజయం సాధించారు.  

Odisha Election Results: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ

నిజామాబాద్‌: బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

కరీంనగర్‌: బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ 5,85,116 ఓట్లతో విజయం సాధించారు. 

మహబూబ్‌నగర్‌: గతంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన బీజేపీ అభ్యర్థి డీకే అరుణ లోక్‌సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. 

మల్కాజిగిరి: బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిపై 3,91,475 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.  

చేవెళ్ల: బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఘన విజయం సాధించారు.  

మెదక్‌: బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 39,139 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌పై గెలిచారు.  

ఆదిలాబాద్‌: కమలం పార్టీ అభ్యర్థి గొడం నగేశ్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90,652 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 

హైదరాబాద్‌: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించారు. ఆయన సమీప బీజేపీ అభ్యర్థి కె.మాధవీలతపై 3,38,087 ఓట్ల మెజారిటీ సాధించారు. 

సికింద్రాబాద్‌: బీజేపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌పై 49,944 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఇటీవ‌ల జ‌రిగిన‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40.10 శాతం ఓట్లు రాగా, భాజపాకు 35.08 శాతం, భారాసకు కేవలం 16.68 శాతం ఓట్లు వచ్చాయి. 

Delhi Election Results: వరుసగా మూడోసారి బీజేపీ క్లీన్‌స్వీప్‌.. తగ్గిన ఓటింగ్‌ శాతం

#Tags