Andhra Pradesh: కొత్తగా ఎన్ని జిల్లాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం జనవరి 25న ఆమోదముద్ర వేసింది. ఈ ప్రతిపాదన ప్రకారం కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌.. 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌గా మారిపోనుంది. 1974 ఏపీ డిస్ట్రిక్ట్‌ (ఫార్మేషన్‌) చట్టం ప్రకారం కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి అంటే 2022, ఏప్రిల్‌ 2వతేదీ నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలనా సౌలభ్యం.. ప్రజలకు సత్వర సేవలు అందించడమే లక్ష్యంగా లోక్‌సభ నియోజక వర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించిన విషయం విదితమే.

11 జిల్లాలు ఆంగ్లేయుల హయాంలోనే..

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిలాల్లో 11 ఆంగ్లేయుల హయాంలో ఏర్పాటైనవే. స్వాతంత్య్రం వచ్చాక పరిపాలన సౌలభ్యం కోసం గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలతో ఒంగోలు కేంద్రంగా 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా ఆవిర్భవించింది. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో విజయనగరం కేంద్రంగా 1979 జూన్‌ 1న చివరిగా విజయనగరం జిల్లా ఏర్పాటైంది.

రెవెన్యూ డివిజన్లూ పునర్‌ వ్యవస్థీకరణ..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ అతి పెద్దది. 33 మండలాలు ఇందులో ఉంటాయి. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా పది నుంచి 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.

కొత్త జిల్లాల ప్రతిపాదనలు ఇలా..

అల్లూరి సీతారామరాజు జిల్లా.. అనకాపల్లి జిల్లా..

  • ఒక నియోజకవర్గం మొత్తాన్ని ఒకే జిల్లాలోకి తేవాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. సగటున 18 నుంచి 20 లక్షల జనాభాతో ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
  • శ్రీకాకుళం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలతోపాటు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి శ్రీకాకుళం జిల్లాగా ఏర్పాటు చేయాలి.
  • ఎచ్చెర్ల మినహా విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలకు విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోని శృంగవరపు కోట శాసనసభ స్థానాన్ని కలిపి విజయనగరం జిల్లా ఏర్పాటు చేయాలి.
  • శృంగవరపు కోట మినహా విశాఖ లోక్‌సభ స్థానం పరిధిలోని మిగతా  ఆరు నియోజకవర్గాలతో విశాఖపట్నం జిల్లాను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలో ఉన్న పెదగంట్యాడ మండలాన్ని విశాఖ జిల్లా పరిధిలోకి తేవాలి.
  • అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో కొత్తగా అనకాపల్లి జిల్లా ఏర్పాటు చేయాలి.
  • అరకు లోక్‌సభ స్థానాన్ని రెండు జిల్లాలుగా విభజించాలి. పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం, కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాలతో పార్వతీపురం జిల్లాను ఏర్పాటు చేయాలి. రంపచోడవరం, పాడేరు, అరకు వ్యాలీ నియోజకవర్గాలతో కలిపి పాడేరు కేంద్రంగా కొత్తగా అల్లూరి సీతారామరాజు పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలి.

కోనసీమ జిల్లా.. ఎన్టీఆర్‌ జిల్లా..

  • అమలాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటు.
  • కాకినాడ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కాకినాడ జిల్లా ఏర్పాటు.
  • రాజమహేంద్రవరం కేంద్రంగా రాజమండ్రి లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో తూర్పు గోదావరి జిల్లా ఏర్పాటు.
  • ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో ఏలూరు కేంద్రంగా జిల్లా ఏర్పాటు.
  • నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు.
  • మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లా ఏర్పాటు.
  • విజయవాడ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్‌ జిల్లా ఏర్పాటు.

భావపురి జిల్లా.. పల్నాడు జిల్లా..

  • గుంటూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలతో కలిపి గుంటూరు జిల్లా ఏర్పాటు.
  • సంతనూతలపాడు మినహా బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటు. భావ నారాయణస్వామి వెలిసిన బాపట్ల కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు భావపురిగా పేరు పెట్టాలని యోచన.
  • నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. 

బాలాజీ జిల్లా.. అన్నమయ్య జిల్లా..

  • ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకర్గాలకు బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలోని సంతనూతలపాడు శాసనసభ స్థానాన్ని కలిపి ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లా ఏర్పాటు.
  • నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలు, తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని సర్వేపల్లితో కలిపి నెల్లూరు కేంద్రంగా శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా ఏర్పాటు.
  • సర్వేపల్లి శాసనసభ స్థానం మినహా తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలకు చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని చంద్రగిరి శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన.
  • చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం పోనూ చిత్తూరు లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ స్థానాలకు రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పుంగనూరును చేర్చి చిత్తూరు కేంద్రంగా చిత్తూరు జిల్లా ఏర్పాటు.
  • పుంగనూరు శాసనసభ నియోజకవర్గంపోనూ రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో రాయచోటి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.
  • ప్రముఖ వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులను స్మరించుకుంటూ రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు అన్నమయ్య జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

సత్యసాయి జిల్లా..

  • కడప లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో కడప కేంద్రంగా వైఎస్సార్‌ జిల్లా ఏర్పాటు.
  • కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలకు.. నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని పాణ్యం శాసనసభ నియోజకవర్గాన్ని కలిపి కర్నూలు  జిల్లా ఏర్పాటు ప్రతిపాదన.
  • పాణ్యం మినహా నంద్యాల లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో నంద్యాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు.
  • అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలకు.. హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని రాప్తాడు శాసనసభ స్థానాన్ని కలిపి అనంతపురం జిల్లా ఏర్పాటు ప్రతిపాదన.
  • రాప్తాడు మినహా హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాలతో పుట్టపర్తి కేంద్రంగా జిల్లా ఏర్పాటు. శ్రీసత్యసాయిబాబా సేవలను స్మరించుకుంటూ పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

చ‌ద‌వండి: ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags