కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ నేత?

కర్ణాటక రాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ సోమప్ప బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో జూలై 28న జరిగిన కార్యక్రమంలో బొమ్మైతో రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.
Basavaraj S Bommai

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఆర్‌.బొమ్మై కుమారుడైన బసవరాజ బొమ్మై ఇప్పటివరకు యడియూరప్ప కేబినేట్‌లో హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప జూలై 26న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

బసవరాజ సోమప్ప బొమ్మై గురించి...

  • కర్ణాటకలోని హుబ్లీలో 1960 జనవరి 28వ తేదీన బసవరాజ బొమ్మై జన్మించారు. మెకానికల్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన ఆయన టాటామోటార్స్‌లో కొన్నాళ్లు పనిచేశారు. అనంతరం సొంత వ్యాపారం పెట్టుకున్నారు.
  • జనతాదళ్‌ పార్టీ నుంచి బొమ్మై రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది.
  • 2008లో బీజేపీలో చేరి సిగ్గాన్‌ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2013, 2018లో కూడా ఇక్కడ నుంచే ఆయన గెలిచారు. అంతకుముందు శాసన మండలిలో రెండుమార్లు సభ్యుడిగా ఉన్నారు.
  • 2008 నుంచి 2013 వరకు మంత్రిగా బీఎస్‌ యడియూరప్ప, డీవీ సదానందగౌడ, జగదీశ్‌ శెట్టర్‌ ప్రభుత్వాల్లో పని చేశారు.
  • ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ఆయనకు అపార జ్ఞానం ఉంది.
  • కర్ణాటక క్రికెట్‌ సంఘం, కర్ణాటక వాలీబాల్‌ సంఘానికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
  • ఆరుణోదయా కోఆపరేటివ్‌ సొసైటీని ఆయన స్థాపించారు.
  • కర్ణాటకలో బలమైన లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన బొమ్మైకు తొలి నుంచీ వివాదరహితుడిగా పేరుంది.
  • బసవరాజ బొమ్మై తండ్రి ఎస్‌ఆర్‌ బొమ్మై జనతా పార్టీ తరఫున కర్ణాటక సీఎంగా 1988– 89 మధ్య కాలంలో పని చేశారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కర్ణాటక రాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ నేత?
ఎప్పుడు    : జూలై 28
ఎవరు    : బసవరాజ సోమప్ప బొమ్మై
ఎక్కడ    : రాజ్‌భవన్, బెంగళూరు, కర్ణాటక
ఎందుకు  : ఇప్పటివరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న యడియూరప్ప తన పదవికి రాజీనామా చేయడంతో...
 

#Tags