Unified Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. కొత్త పెన్షన్ విధానానికి ప్రభుత్వం ఆమోదం..!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మోదీ సర్కారు తాజాగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని (యూపీఎస్) తీసుకొచ్చింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్) స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం (యూపీఎస్)ను అమలు చేసేలా విధానాలు రూపొందించింది. 2025 ఏప్రిల్ 1 నుంచి ఈ యూపీఎస్ విధానం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. 2004 ఏప్రిల్ 1 తర్వాత సర్వీసులో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్‌పీఎస్ వర్తిస్తోంది.
వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రానున్నారు. దాంతో 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్) స్థానంలో కొత్త యూపీఎస్‌ను అమలు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 90 లక్షలకు చేరుతుందని చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విధానానికి ఆమోదం లభించింది.
యూపీఎస్ విధానంలోని కీలకాంశాలు ఇవే..
➤ ప్రస్తుతం అమలవుతున్న ఎన్‌పీఎస్ విధానంలో ఉద్యోగి వేతనం నుంచి 10 శాతం, ప్రభుత్వం మరో 10 శాతం జమచేసి పెట్టుబడి పెట్టేది. ఉద్యోగి పదవీ విరమణ పొందాక ఆ మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందించేవారు. అయితే యూపీఎస్‌లో మాత్రం రిటైర్డ్ అయ్యే 12 నెలల ముందు వరకు ఎంత వేతనం ఉందో అందులో సరాసరి 50 శాతం పెన్షన్ రూపంలో చెల్లిస్తారు.
➤ పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కనీస సర్వీసు 25 సంవత్సరాలు ఉంటే పూర్తి పెన్షన్‌కు అర్హులు. ఒకవేళ 25 ఏళ్లు పూర్తి అవ్వకపోతే దామాషా ప్రకారం 10-25 ఏళ్లలోపు పెన్షన్ లెక్కించి ఇస్తారు.
Monkeypox RT-PCR Kit: దేశంలోనే తొలిసారి మంకీపాక్స్ నిర్ధారణ కిట్ తయారీ
➤ కనీసం 10 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటేనే యూపీఎస్ కిందకు వస్తారు. అలా కేవలం పదేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులు కనిష్ఠంగా రూ.10,000 పెన్షన్ తీసుకోవచ్చు. ఆపై 25 ఏళ్లలోపు సర్వీసు ఉన్న వారికి దామాషా ప్రకారం పెన్షన్ చెల్లిస్తారు. 25 ఏళ్ల సర్వీసు దాటితే పూర్తి పెన్షన్ వస్తుంది.
➤ ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. కాబట్టి యూపీఎస్ కింద ఇచ్చే పెన్షన్‌లోనూ ఏటా ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి ఇస్తారు. దాంతో కిందటి ఏడాది కంటే ప్రస్తుత ఏడాదికి ఎక్కువ పెన్షన్ అందుతుంది.
➤ యూపీఎస్ విధానంలో చేరిన పెన్షనర్లు మరణిస్తే అప్పటివరకు తాము తీసుకుంటున్న పెన్షన్‌లో 60 శాతం వారి భాగస్వామికి ఇస్తారు.
➤ యూపీఎస్ నిబంధనల ప్రకారం 1/10వ వంతు సుపర్ అన్యూయేషన్(మొత్తం సర్వీసును లెక్కించి చెల్లించే నగదు) చెల్లిస్తారు. బేసిక్ వేతనంలో 1/10వ వంతును పరిగణనలోకి తీసుకుని ప్రతి ఆరు నెలలకు ఒకసారి దీన్ని లెక్కిస్తారు. సర్వీసు పూర్తయిన వెంటనే ఒకేసారి ఈ మొత్తాన్ని అందిస్తారు. ఈ చెల్లింపునకు, పెన్షన్‌కు ఎలాంటి సంబంధం ఉండదు.
➤ కొత్త యూపీఎస్ విధానానికి మారాలనుకునే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక ప్రభుత్వాలను అనుసరించి డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్ అమలుకు సిద్ధంగా ఉండాలి.
Assembly Elections: ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ షెడ్యూల్ విడుదల