Odisha Train Accident: మూడు రైళ్లు ఘోర ప్రమాదానికి యమపాశమైన‌ లూప్ లైన్‌.. అస‌లు లూప్ లైన్ అంటే ఏమిటి..?

ఒడిశాలో మూడు రైళ్లు ఘోర ప్రమాదానికి లూప్‌లైనే మృత్యుపాశంగా మారింది. మెయిన్‌ లైన్లో వెళ్లాల్సిన కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ లూప్‌లైన్లోకి మళ్లడమే దేశమంతటినీ కుదిపేసిన మహా విషాదానికి దారితీసింది.

లూప్‌ లైన్లో ఆగి ఉన్న గూడ్స్‌ రైలును మహా వేగంతో ఢీకొట్టేందుకు, వందలాది మంది దుర్మరణం పాలయ్యేందుకు కారణమైంది. జూన్ 2న‌ ఒడిశాలో మూడు రైళ్లు ఘోర ప్రమాదానికి గురైన పెను విపత్తుపై రైల్వే శాఖ జరిపిన ప్రాథమిక విచారణ ఈ మేరకు తేల్చింది. గూడ్సును ఢీకొన్న వేగానికి ఏకంగా 21 కోరమాండల్‌ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. చెల్లాచెదురై పక్క ట్రాక్‌పై పడిపోయాయి. దానిపై వస్తున్న బెంగళూరు–హౌరా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆ బోగీలను ఢీకొన్ని పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో కోరడమండల్‌ గంటలకు 128 కిలోమీటర్లు, హౌరా 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి! దాంతో జంట ప్రమాదాల తీవ్రత ధాటికి పలు బోగీలు తలకిందులయ్యాయి.

ఒక ఇంజన్‌తో పాటు బోగీలకు బోగీలే గూడ్స్‌పైకి దూసుకెళ్లాయి. బహనగా బజార్‌ స్టేషన్‌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను అధికారులు ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించారు. రైల్వే శాఖ ప్రమాద కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదు. విద్రోహ కోణానికీ ఆధారలేవీ ఇప్పటిదాకా లేవని రైల్వే వర్గాలంటున్నాయి. మొత్తం ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు సౌత్‌ ఈస్టర్న్‌ సర్కిల్‌ రైల్వే సేఫ్టీ కమిషనర్‌ ఎ.ఎం.చౌదరి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. పౌర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో పని చేసే రైల్వే సేఫ్టీ కమిషనర్‌ ఇలాంటి ప్రమాద ఘటనలను దర్యాప్తు చేస్తారు.

Supreme Court: రూ.2 వేల నోటు రద్దుపై అత్యవసర విచారణకు సుప్రీం నో
 

లూప్‌లైన్‌ అంటే..?
సులువుగా చెప్పాలంటే ఇవి రైల్వే స్టేషన్లలో ఉండే అదనపు రైల్వే లైన్లు. ఒకటికి మించిన ఇంజన్లతో కూడిన భారీ గూడ్సులకు కూడా సరిపోయేలా ఈ లూప్‌ లైన్లు సాధారణంగా కనీసం 750 మీటర్ల పొడవుంటాయి.
► కారణంపై తలో మాట... ప్రమాద కారణంపై తలో మాట వినిపిస్తున్నారు...
► ఇది కచ్చితంగా సిగ్నలింగ్‌ వైఫల్యమేనని కొందరంటున్నారు.
► రైల్వే శాఖ వర్గాలు మాత్రం కోరమండల్‌ నేరుగా లూప్‌లైన్లోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్సును ఢీకొందా, లేక పట్టాలు తప్పి, ఆ క్రమంలో కొన్ని బోగీలు తలకిందులై, మిగతా రైలు లూప్‌లోన్లోకి మళ్లి గూడ్సును గుద్దిందా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు.

డ్రైవర్ల తప్పిదం కాదు
ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే డ్రైవర్ల తప్పిదం ఏమీ లేనట్టే కనిపిస్తోందని చెన్నై ఇంటిగ్రెల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ మాజీ జనరల్‌ మేనేజర్, తొలి వందేభారత్‌ రైలును రూపొందించిన బృందానికి సారథ్యం వహించిన సుధాన్షు మణి స్పష్టం చేశారు. ‘‘కేవలం ప్రయాణికుల రైలు పట్టాలు తప్పడం మాత్రమే జరిగి ఉంటే దానివన్నీ అత్యాధునిక లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లే. అవి ఇలా తిరగబడిపోవడం జరగదు. ఇంతమంది దుర్మరణం పాలయ్యే అవకాశమే ఉండదు’’ అని వివరించారు. ‘‘ప్రమాద సమయంలో కోరమండల్‌కు అది వెళ్లిన లైన్‌పై గ్రీన్‌ సిగ్నల్‌ ఉన్నట్టు డేటా లాగర్‌లో స్పష్టంగా ఉంది. అంటే డ్రైవర్‌ సిగ్నళ్లను ఉల్లంఘించడం వంటిదేమీ జరగలేదన్నది స్పష్టం’’ అని ఆయనన్నారు. అంతటి వేగంలో ప్రమాదాన్ని నివారించేందుకు రెండో రైలు (హౌరా) డ్రైవర్‌ చేయగలిగిందేమీ ఉండదని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ట్రాఫిక్‌) శ్రీప్రకాశ్‌ అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల రైళ్లు వాటంతట అవి పట్టాలు తప్పడం చాలా అరుదని వివరించారు.  

Superfast Railway Line: సూపర్‌ఫాస్ట్‌ రైల్వే లైన్లకు పచ్చ జెండా..

ప్రమాద సమయంలో..
కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగం: గంటకు 128 కి.మీ.
బెంగళూరు–హౌరా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగం: గంటలకు 116 కి.మీ.
గూడ్స్ లూప్‌ లైన్లో ఆగి ఉంది
ప్రమాద సమయంలో రెండు రైళ్లలో ప్రయాణికులు : 2,700 పై చిలుకు (కోరమాండల్‌లో 1257,
హౌరాలో 1039 మంది రిజర్వ్‌డ్‌ ప్రయాణికులున్నారు. రెండింటి జనరల్‌ బోగీల్లో వందలాది మంది ఉంటారని రైల్వే వర్గాలు అధికారికంగానే వెల్లడించాయి)
ప్రమాద ప్రాంత విస్తీర్ణం  : దాదాపు ఒక కిలోమీటర్‌

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (07-13 మే 2023)

#Tags