US elections 2024: డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్‌.. అమెరికా అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ తొలి విజయం

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం  జరుగుతున్న వరుస ప్రైమారీల్లో గెలుస్తూ దూసుకుపోతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు బ్రేక్‌ పడింది. తాజాగా వాషింగ్టన్‌ డీసీ ప్రైమారీలో నిక్కీ హేలీ  విజయం సాధించారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధక్ష్య అభ్యర్థిత్వం పోటీ పడుతున్న నిక్కీ హేలీకి ఇదే మొదటి ప్రైమరీ విజయం కావటం గమనార్హం.

వాషింగ్టన్‌ డీసీలో ఉ‍న్న 22 వేల ఓట్లలో నిక్కీ హేలీ 63 శాతం ఓట్లను దక్కించుకున్నారు. ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ 33.2 శాతం ఓట్లకే పరిమితమయ్యారు. వాషింగ్టన్‌ డీసీలో గత 2020 ఎన్నికల సమయంలో డొమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జోబైడెన్‌ 92 శాతం ఓట్లు సాధించారు. అయితే ఇక్కడ రిపబ్లికన్‌ పార్టీకి ఎక్కువ శాతం మెజర్టీ  రాదనే వాదనలు ఉన్నాయి. దానికి భిన్నంగా నిక్కీ హేలీ 62 శాతం ఓట్లు సాధించారు. ‘వాషింగ్టన్‌లోని రిపబ్లికన్లు డొనాల్డ్‌ ట్రంప్‌ .. అతని గందరగోళాన్ని తిరస్కరిచంటంలో ఆశ్చర్యం లేదు’ అని నిక్కీ హేలీ తెలిపారు.

మరోవైపు.. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినాల ప్రైమరీల్లో నిక్కీ హేలీపై విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్‌ మంగళవారం (మార్చి 5న) ముందు నిక్కీ హేలీ.. మొదటి ప్రైమరీలో విజయం సాధించటం కొంత ఊరటనిచ్చింది. సూపర్‌ మంగళవారం రోజు సుమారు 12 రాష్ట్రాల్లోని అధ్యక్ష పైమరీలు, కాకస్‌లో ప్రజలు ఓటు వేయనున్నారు. అదేవిధంగా యూఎస్‌ కాంగ్రెస్‌లోని  హౌజ్‌ ఆఫ్‌  రిప్రజెంటేటివ్స్‌, సెనెట్‌కు ఓట్లు వేయనున్నారు.

#Tags