PM Modi Ukraine Visit: ఉక్రెయిన్‌లో మోదీ పర్యటన.. యుద్ధాన్ని ఆపడానికి శాంతి, సుస్థిరతకు చర్చలే మార్గం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ‌స్టు 23వ తేదీ పోలండ్‌ నుంచి ట్రైన్‌ ఫోర్స్‌ వన్‌ రైలులో బయలుదేరి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు చేరుకున్నారు.

1991 తర్వాత ఉక్రెయిన్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. రష్యాపై ఉక్రెయిన్‌ ఎదురుదాడి ఉధృతమవుతున్న నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

కీవ్‌లో అడుగుపెట్టిన తర్వాత మోదీ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ హిస్టరీ వద్దనున్న ‘మల్టీమీడియా మార్టీరాలజిస్టు ఎక్స్‌పోజిషన్‌’ను సందర్శించారు. యుద్ధంలో మరణించిన ఉక్రెయిన్‌ చిన్నారుల స్మారకార్థం ఈ కట్టడాన్ని నిర్మించారు. అలాగే.. కీవ్‌ సిటీలోని ఒయాసిస్‌ ఆఫ్‌ పీస్‌ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మోదీ ఘనంగా నివాళులర్పించారు. 

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీ సమావేశమయ్యారు. భారత్‌–ఉక్రెయిన్‌ మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వాణిజ్యం, ఆర్థికం, రక్షణ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. భారత్‌–ఉక్రెయిన్‌ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరిగాయి. ఉక్రెయిన్‌–రష్యా మధ్య సంఘర్షణ అంతం కావాలని, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనాలని ప్రధానమంత్రి మోదీ ఆకాంక్షించారు. 

PM Modi Poland Visit: పోలెండ్‌లో పర్యటించిన మోదీ.. ఆ దేశ ప్రధానితో సమావేశం.. ద్వైపాక్షిక అంశాలపై చర్చ

సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలికేలా ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవడానికి ఉక్రెయిన్, రష్యా పరస్పరం చర్చించుకోవాలని కోరారు. శాంతి, సుస్థిరత కోసం రెండు దేశాల మధ్య ఆచరణాత్మక సంప్రదింపులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమ దేశ జాతీయ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భారత్‌ మద్దతు ఇస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణ..
ఉక్రెయిన్‌లో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు అన్ని రకాలుగా సాయం అందిస్తామని మోదీ హామీ ఇచ్చినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. మోదీ–జెలెన్‌స్కీ మధ్య నిర్మాణాత్మక, సమగ్ర చర్చ జరిగిందన్నారు. ఉక్రెయిన్‌–రష్యా మధ్య చర్చలు ప్రారంభించి, ముందుకు తీసుకెళ్లడానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన మార్గాలపై మోదీ, జెలెన్‌స్కీ చర్చించుకున్నారని వివరించారు. ఆ రెండు దేశాలు కలిసి కూర్చొని చర్చించుకొని, సంఘర్షణకు పరిష్కారం కనిపెట్టాలన్నదే భారతదేశ అభిమతమని జైశంకర్‌ స్పష్టంచేశారు.  

నాలుగు భీష్మ్‌ క్యూబ్స్‌ బహూకరణ..
ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ ప్రభుత్వానికి నాలుగు భీష్మ్‌ (భారత్‌ హెల్త్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ సహయోగ్‌ హిత, మైత్రి) క్యూబ్స్‌ను బహూకరించారు. అన్ని రకాల గాయాలకు చికిత్స అందించేందుకు అవసర మైన ఔషధాలు, పరికరాలు, వస్తువులు ఈ క్యూబ్స్‌లో ఉన్నాయి. అంతేకాదు పరిమితంగా విద్యుత్, ఆ క్సిజన్‌ను ఉత్పత్తిచేసే పరికరాలు సైతం ఉన్నాయి.  
  
నాలుగు ఒప్పందాలపై భారత్, ఉక్రెయిన్‌ సంతకాలు  
మోదీ–జెలెన్‌స్కీ చర్చల తర్వాత నాలుగు కీలక ఒప్పందాలపై భారత్, ఉక్రెయిన్ సంతకాలు చేశాయి. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, ఔషధాలు, సాంస్కృతికం–మానవతా సాయం విషయంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి. 

Strategic Partnership: భారత్, మలేషియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం.. ఎనిమిది ఒప్పందాలపై..

#Tags