Union Budget: బడ్జెట్‌కి సంబందించిన ముఖ్య‌మైన ప‌దాలు.. వాటి వివ‌ర‌ణ మీకోసం..

బడ్జెట్‌ అంటే.. స్థూలంగా ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ, వ్యయపట్టిక. సర్కారు ఆర్థిక, విధాన పత్రం. ప్రజల నుంచి పన్నుల రూపేణా వసూలు చేసిన ధనాన్ని వారికోసం ఎలా వినియోగించబోతున్నారో వివరించే కార్యాచరణ ప్రణాళిక.

మూలధన బడ్జెట్ (CAPITAL OUTLAY)
మూలధన ఆదాయ, వ్యయ పట్టికగా చెప్పుకోవచ్చు. వార్షిక బడ్జెట్‌లో మూలధన బడ్జెట్‌తోపాటు రెవెన్యూ బడ్జెట్‌ కూడా ఉంటుంది. ప్రభుత్వానికి మూలధన ఖాతాలో వసూలయ్యే ఆదాయం, ఖర్చులు మూలధన బడ్జెట్‌లో ఉంటాయి. ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ వసూళ్లు, ఖర్చులకు సంబంధించిన వివరాలు రెవెన్యూ బడ్జెట్‌లో ఉంటాయి.
క్యాపిటల్‌ పద్దు (ప్రణాళికా వ్యయం) (CAPITAL EXPENDITURE)
ప్రభుత్వం ఆదాయ వనరులను, ఆస్తులను సృష్టించుకునేందుకు చేసే వ్యయం ఇది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రణాళికలకు చేసే కేటాయింపులు ఇందులో ఉంటాయి.
రెవెన్యూ పద్దు (ప్రణాళికేతర వ్యయం) (REVENUE EXPENDITURE)
ఉద్యోగుల జీతభత్యాలు, రక్షణ, పోలీసు వ్యవస్థల నిర్వహణ, ఎన్నికలు, కళలు, క్రీడలు, కుటుంబ సంక్షేమం, సమాచార ప్రసార, పర్యాటకం, కార్మిక సంక్షేమం, వ్యవసాయ రంగాలకు వెచ్చించే నిధులు, వడ్డీలు, రుణ చెల్లింపులు ఈ పద్దులోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే ప్రణాళికేతర గ్రాంటులు కూడా ఈ ఖాతాలోనే ఉంటాయి.
సంచిత నిధి ( CONTINGENCY FUND )
అన్ని రకాల వసూళ్లు, ఆదాయాలు, రుణాల ద్వారా వచ్చిన సొమ్ము ఈ నిధి కింద జమ అవుతుంది. ఈ నిధి నుంచి ఖర్చు చేయడానికి ΄ార్లమెంటు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో రెండు పద్దులుంటాయి. 1. రెవెన్యూ వసూళ్లు–రెవెన్యూ వ్యయం. 2. మూలధన వసూళ్లు–మూలధన వ్యయం.
ప్రభుత్వ ఖాతా ( GOVERNMENT ACCOUNT )
సంచిత నిధిలో జమయ్యే వసూళ్లు మినహా ప్రభుత్వం వద్దకు వచ్చే ఇతర అన్ని రకాల నిధులు ఈ ఖాతాలో జమ అవుతాయి. ఆర్‌బీఐ నుంచి, పీఎఫ్‌  నుంచి తీసుకునే రుణాలను ఈ ఖాతా కింద ఖర్చు చేస్తారు. ఈ సొమ్మును మళ్లీ చెల్లించాల్సి ఉంటుంది.
రెవెన్యూ వసూళ్లు ( REVENUE RECEIPTS )
పన్నులు, సుంకాల ద్వారా వసూలయ్యే ఆదాయమే రెవెన్యూ వసూళ్లు. ఎగుమతి, దిగుమతి సుంకాలు (కస్టమ్స్‌), ఎక్సైజ్‌ డ్యూటీ, కార్పొరేట్‌ ట్యాక్స్, ఇతరత్రా పన్నుల రూపంలో వచ్చే సొమ్మంతా ఈ ఖాతాలోకే చేరుతుంది. ప్రభుత్వ పెట్టుబడులపై వడ్డీలు, డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం, ప్రభుత్వ సేవలపై వసూ లు చేసే చార్జీలు వీటి కిందకే వస్తాయి.
రెవెన్యూ వ్యయం ( REVENUE EXPENDITURE )
ప్రభుత్వ నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, బదిలీలపై చేసే ఖర్చును రెవెన్యూ వ్యయంగా పేర్కొంటారు. ఇది ప్రభుత్వానికి ఆస్తులను సృష్టించదు. 
రెవెన్యూ లోటు ( Revenue Deficit )
ప్రభుత్వానికి వివిధ మార్గాల ద్వారా వచ్చే రెవెన్యూ ఆదాయం కంటే.. వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆదాయ లోటు ఏర్పడుతుంది. దీనినే రెవెన్యూ లోటు అంటారు. అప్పులు, ఇతర మార్గాల ద్వారా ఈ లోటును పూడ్చుకుంటారు. 
ప్రత్యక్ష పన్నులు ( DIRECT TAXES )  
ప్రభుత్వానికి మనం నేరుగా చెల్లించే పన్నులు ఇవి. ఆదాయ పన్ను, సంపద పన్ను, ఫ్రింజ్‌ బెనిఫిట్‌ ట్యాక్స్‌ వంటివి ఈ కోవలోకి వస్తాయి. ఈ పన్నులను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) పర్యవేక్షిస్తుంది. 
పరోక్ష పన్నులు ( INDIRECT TAXES )  
నేరుగా మనం చెల్లించకుండా వివిధ వస్తువులు, సేవలపై ప్రభుత్వం వేసే పన్నులను పరోక్ష పన్నులుగా చెప్పవచ్చు. జీఎస్టీ, వ్యాట్, సేల్స్‌ ట్యాక్స్, సర్వీస్‌ ట్యాక్స్‌ వంటివి పరోక్ష పన్నుల కేటగిరీలోకి వస్తాయి. ఈ పన్నులు సదరు వస్తువులు, సేవలను అందించే కంపెనీల  ద్వారా ప్రభుత్వానికి చేరుతాయి. 
సెస్‌లు  ( CESS )  
మనం చెల్లించే పన్నులకు అదనంగా కొంత శాతం మేర విధించే ప్రత్యేక పన్నులు/చార్జీలను సెస్‌లుగా చెప్పవచ్చు. ఎడ్యుకేషన్‌ సెస్, కృషి కల్యాణ్‌ సెస్, స్వచ్ఛ భారత్‌ సెస్, పెట్రోల్‌–డీజిల్‌లపై సెస్‌ వంటివి దీనికి ఉదాహరణలు. సాధారణంగా కేంద్రం వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అదే సెస్‌లుగా వసూలు చేసే మొత్తం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే వెళుతుంది. 
సర్‌చార్జీలు ( SURCHARGE ) 
అత్యంత విలాసవంతమైన, ఖరీదైన వస్తువులు, సేవలపై అదనంగా విధించే చార్జీలను సర్‌చార్జీలుగా చెప్పుకోవచ్చు. దేశంలో పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం కోసం ప్రభుత్వాలు ధనిక కేటగిరీల్లోని వారు వినియోగించే ఖరీదైన వస్తువులు, సేవలపై సర్‌చార్జీలను విధిస్తూ ఉంటాయి. ఉదాహరణకు విలాసవంతమైన కార్లు, ఖరీదైన బైకులు, దిగుమతి చేసుకునే వాహనాలు వంటివి. దీనికితోడు అత్యధిక ఆదాయం ఉండేవారి నుంచి వసూలు చేసే ఆదాయ పన్నుపైనా సర్‌చార్జీలు ఉన్నాయి. 
డిజిన్వెస్ట్‌మెంట్ ( DISINVESTMENT )
ప్రభుత్వ రంగ కంపెనీల్లో వాటాలను అమ్మడం, లేదా పూర్తిగా విక్రయించడం, లేదా స్టాక్‌ మార్కెట్లో వాటిని లిస్ట్‌ చేయడం ద్వారా ప్రభుత్వాలు నిధులను సమకూర్చుకోవడాన్ని పెట్టుబడుల ఉప సంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్‌) అంటారు.
ఓటాన్‌ అకౌంట్ ( VOTE ON ACCOUNT ) 
బడ్జెట్‌ ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరం పూర్తి నిడివికి సంబంధించి ఉంటుంది. అంటే ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తర్వాతి ఏడాది మార్చి 31వ తేదీ వరకు అన్నమాట. కేంద్రం, ఏవైనా రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలం ఈ మధ్యకాలంలో ముగిస్తే.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి వీలుండదు. సదరు ప్రభుత్వం పదవిలో ఉండే కాలానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీనినే ఓటాన్‌ అకౌంట్‌ అంటారు. ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. 

Union Budget 2023: 2023–24 కేంద్ర బడ్జెట్‌ సమగ్ర స్వరూపం..

#Tags