Nobel Prize 2024: మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనిపెట్టిన శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు.. ఏమిటీ మైక్రో ఆర్‌ఎన్‌ఏ?
2024కు వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డును స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ మెడికల్ వర్సిటీ అక్టోబర్ 7వ తేదీ ప్రకటించింది. జన్యు నియంత్రణకు సంబంధించిన మౌలిక వ్యవస్థ అయిన మైక్రో ఆర్‌ఎన్‌ఏను కనిపెట్టిన అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లను నోబెల్ వరించింది. జన్యువులను, జీవక్రమాన్ని మైక్రో ఆర్‌ఎన్‌ఏ ఎలా ప్రభావితం చేస్తుంది. మొత్తంగా మనుషులతో పాటు ఇతర జీవజాలాన్ని ఎలా నియంత్రిస్తుందన్న అంశాలను వారి సంచలనాత్మక పరిశోధన లోతుగా పరిశోధించింది.
జన్యు నియంత్రణకు సంబంధించి ఏకంగా సరికొత్త సూత్రాన్నే ఇది వెలుగులోకి తెచ్చిదంటూ నోబెల్ కమిటీ ప్రశంసించింది. జీవుల ఎదుగుదల, పనితీరుకు సంబంధించిన మౌలికాంశాలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలు కల్పిస్తుందని పేర్కొంది.
ఈ పరిశోధన ఫలితాలు క్యాన్సర్ చికిత్సలో కొత్త ద్వారాలను తెరిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు లండన్ ఇంపీరియల్ కాలేజీలో మాలిక్యులార్ అంకాలజీ లెక్చరర్ డాక్టర్ క్లెయిరీ ఫ్లెచర్ వెల్లడించారు. చర్మ క్యాన్సర్ చికిత్సలో వీటి పనితీరుపై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు ఆమె తెలిపారు.
‘ఈ పరిశోధనల ద్వారా జన్యువుల ప్రవర్తనను నియంత్రించేందుకు కొత్త మార్గం తెరుచుకుంది. తద్వారా పలు రకాల వ్యాధుల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు కనిపెట్టడంతో పాటు చికిత్సకు కూడా వీలు కలుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న థెరపీల్లో చాలావరకు కణజాలంలోని ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకున్నవే. అలాగాక మైక్రో ఆర్‌ఎన్‌ఏ స్థాయిలో జోక్యం చేసుకోగలిగితే జన్యువులను నేరుగా నియంత్రించవచ్చు. తద్వారా ప్రభావవంతమైన ఔషధాల అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి’ అని వివరించారు.
Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'
ఆంబ్రోస్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్‌లో నాచురల్ సైన్స్ ప్రొఫెసర్. రువ్‌కున్ హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో జెనెటిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. బహుమతితో పాటు వారికి 10 లక్షల డాలర్ల నగదు పురస్కారం అందనుంది. నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 14 దాకా కొనసాగనుంది. అక్టోబర్ 8వ తేదీ ఫిజిక్స్, 9వ తేదీ కెమిస్ట్రీ, 10వ తేదీ సాహిత్య నోబెల్ అవార్డులను ప్రకటిస్తారు. అక్టోబర్ 14న ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రకటన ఉంటుంది. విజేతలకు డిసెంబర్ 10న పురస్కారాలను ప్రదానం చేస్తారు.
ఏమిటీ మైక్రో ఆర్‌ఎన్‌ఏ?
ఆంబ్రోస్, రువ్‌కున్ కనిపెట్టిన ఈ మైక్రో ఆర్‌ఎన్‌ఏను సూక్ష్మ జన్యుపదార్థ సమూహంగా చెప్పవచ్చు. కణజాల స్థాయిలో జన్యువుల పనితీరును నియంత్రించడంలో, మార్చడంలో దీనిది కీలక పాత్ర. ఒకవిధంగా ఇది కణజాల స్విచ్చుగా పని చేస్తుంది. కణాలన్నింట్లోనూ ఉండేది ఒకలాంటి క్రోమోజోములే. అయినప్పటికీ జీవుల్లో నరాలుగా, కండరాలుగా వేటికవే ప్రత్యేక లక్షణాలతో ఈ కణాలు అభివృద్ధి చెందుతాయి. జీవ వికాసానికి అత్యంత కీలకమైన ఈ తేడాలకు జన్యు నియంత్రణే కారకంగా నిలుస్తుంది.
డీఎన్‌ఏ నుంచి ఆర్‌ఎన్‌ఏకు వెళ్లే జన్యు సమాచారం రూపంలో ఈ నియంత్రణ జరుగుతుందని ఆంబ్రోస్, రువ్‌కువ్ కనిపెట్టారు. ఈ సూక్ష్మ ఆర్‌ఎన్‌ఏ తాలూకు సంతులనంలో తేడాలే క్యాన్సర్ తదితర వ్యాధులకు కారణమని తేలింది. ‘కొన్ని కణాల్లో నిర్దిష్ట జన్యువు, లేదా జన్యువులు మరీ ఎక్కువగా పని చేయడమో, ఉత్పరివర్తనం చెందడమో వ్యాధిగా పరిణమిస్తుంది.
IIFA Awards winners: మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్టు.. అలాగే ఈ హీరోలకూ..
సదరు జన్యు కార్యకలాపాన్ని మార్చగలిగే మైక్రో ఆర్‌ఎన్‌ఏను ఎంపిక చేసు కోవడం ద్వారా వ్యాధిగ్రస్త కణాల్లో ఉత్పరివర్తనాలను అరికట్టవచ్చు. మరోలా చెప్పాలంటే వ్యాధిని రూపుమాపవచ్చు’ అని డాక్టర్ ఫ్లెచర్ వివరించారు. ఈ కోణంలో సూక్ష్మ ఆర్‌ఎన్‌ఏ ఉనికిని కనిపెట్టిన ఆంబ్రోస్, రువ్‌కున్ ఆవిష్కరణకు ఎనలేని ప్రాధాన్యముందన్నారు.