Motivational Story: ఇద్దరు మిత్రులు.. ఓ ఆసక్తికర స్టోరీ.. !
84 ఏళ్ల రతన్‌టాటాకి సహాయకుడిగా అన్ని సమయాల్లో తోడుండే వ్యక్తి శంతన్ నాయుడు. టాటా కుటుంబంతో ఎటువంటి సంబంధం లేని శంతన్, రతన్ టాటాకి ఎలా చేరువయ్యాడు ?
ఓ టీనేజ్ కుర్రాడు..
ఇటీవల రతన్‌టాటా తన 84వ జన్మదిన వేడుకులను అత్యంత సాధారణంగా జరుపుకున్న వీడియో దేశవ్యాప్తంగా చాలా మంది దృష్టిని ఆకర్షించింది. వేల కోట్ల రూపాయల ఆస్తులు, సంపద ఉన్నా కేవలం ఒక కప్ కేక్‌తో తన బర్త్‌డే జరుపుకున్నారు రతన్‌టాటా. అయితే ఈ బర్త్‌డే వీడియోలో రతన్ టాటాకి కేక్ తినిపిస్తూ ఓ టీనేజ్ కుర్రాడు కనిపించాడు కదా ! అతనే శంతన్ నాయుడు. అతను టీనేజీ కుర్రాడేమీ కాదు. పూనే యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నాడు. ప్రస్తుతం టాటా గ్రూపులో డీజీఎం హోదాలో ఉన్నాడు. మలి వయసులో రతన్‌టాటాకి చేదోడు వాదోడుగా ఉంటున్నాడీ యువ ఇంజనీర్.
కుటుంబ నేపథ్యం :
పేరు చూసి శంతన్ నాయుడు తెలుగు వాడు అనుకునే అవకాశం ఉంది. కానీ అతని స్వస్థలం మహారాష్ట్ర. శంతన్ నాయుడు పూర్వికులు మహారాష్ట్రకి వెళ్లి స్థిరపడ్డారు. 1993లో పూనేలో జన్మించాడు శంతన్ నాయుడు.
చదువు :
పూనే యూనివర్సిటీ నుంచి 2014లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు, ఆ తర్వాత టాటా గ్రూపులో డిజైన్ ఇంజనీరుగా జాయిన్ అయ్యాడు.
ఆ కుక్క శవం మీదుగానే..
ఓ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుంటే రోడ్డు మధ్యలో ఓ వీధి కుక్క చనిపోయి కనిపించింది. వాహనాలు ఆ కుక్క శవం మీదుగానే పోతున్నాయి. ఈ దృశ్యం చూసి శంతను చలించిపోయాడు.
టాటా ఇంటర్నల్ మ్యాగజైన్‌లో..
తన స్నేహితులతో కలిసి వీధి కుక్కల కోసం రేడియం స్టిక్కర్లతో తయారు చేసిన కాలర్స్‌ని తయారు చేశాడు. తను ఆఫీసుకు వెళ్లే దారిలో కనిపించిన కుక్కలకు వాటిని అమర్చాడు. ఆ పనికి మరుసటి రోజే స్థానికుల మంచి రెస్పాన్స్ వచ్చింది. టాటా ఇంటర్నల్ మ్యాగజైన్‌లో సైతం దీనిపై స్టోరీ రాశారు. ఈ క్రమంలో ముంబైలో ఉన్న వీధి కుక్కలన్నింటీ ఈ కాలర్ అమర్చాలంటూ చాలా మంది సూచించారు. అయితే నిధుల సమస్య ఎదురైంది. తండ్రితో ఈ విషయం చెబితే ‘ వీధి కుక్కలను కాపాడేందుకు సాయం చేయాల్సిందిగా రతన్ టాటాని అడుగు. ఆయనకి కుక్కలంటే ఇష్టం’ అంటూ ఐడియా ఇచ్చాడు తండ్రి.
రతన్‌టాటాతో పరిచయం ఇలా..
చివరకు వీధి కుక్కలను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడేందుకు మోటోపా పేరుతో స్టార్టప్ ఏర్పాటు చేశానని, దానికి సాయం చేయాల్సిందిగా కోరుతూ వివరాలతో కూడిన ఈ మెయిల్‌ని ఏకంగా రతన్‌టాటాకే పంపాడు. రోజులు గడిచిపోయినా అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో రెగ్యులర్ పనిలో పడిపోయాడు శంతన్. చివరకు రెండు నెలల తర్వాత నేరుగా తనని కలవాలంటూ రతన్‌టాటా నుంచి ఆహ్వానం అందింది. అదే రతన్‌టాటాతో శంతన్ నాయుడికి తొలి పరిచయం. వ్యక్తిగతంగా రతన్ టాటాను కలిసి తన ప్రాజెక్టు గురించి వివరించాడు శంతన్. వీధి కుక్కల పట్ల అతను చూపిన ప్రేమకు రతన్‌టాటా ఫిదా అయ్యారు. వెంటనే సాయం చేసేందుకు అంగీకరించారు రతన్‌టాటా. అటా మోటోపా స్టార్టప్ మొదలైంది.
అసిస్టెంట్‌గా ఉంటావా.. అన్నారు..?
మరి కొన్నాళ్లకే కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు రావడంతో శంతన్ అమెరికా బయల్దేరాడు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత టాటా గ్రూపులోనే పని చేయాలంటూ శంతన్‌ని కోరారు రతన్‌టాటా. ఏంబీఏ పూర్తైన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత టాటా ట్రస్టులో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో జాయిన్ అయ్యారు. అయితే కొద్ది కాలానికే శంతన్‌ను పిలిపించుకున్న రతన్ టాటా.. పని ఒత్తిడి ఎక్కువగా ఉందని.. తనకు వ్యక్తిగత సహాయకుడిగా ఉండమంటూ కోరాడు. అలా 2018 నుంచి ఇప్పటి వరకు రతన్‌టాటాకి నీడలా వెన్నంటి ఉంటున్నాడు శంతన్.
ఇద్దరు మిత్రులు.. రతన్ టాటా భుజంపై చెయ్యి వేసి..
సాటి జీవుల పట్ల శంతన్ నాయుడికి ఉన్న ప్రేమ. మూగ జీవాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన కారుణ్యం, కార్యదక్షత రతన్‌టాటాని ఆకట్టుకున్నాయి. అంతేకాదు శంతన్‌నాయుడిలోని సింప్లిసిటీ, ఆలోచణ సరళి కూడా టాటాని ఆకర్షించాయి. అందుకే టాటా గ్రూపుకి చైర్మన్‌గా పదవీ విరమణ చేసి.. వానప్రస్థ జీవితం గడుపుతూ.. సహాయకుడిగా శంతన్‌ను ఎంచుకున్నారు రతన్ టాటా. ఇప్పుడీ 28 ఏళ్ల యువకుడు 84 ఏళ్ల కురు వృద్ధుడిల మధ్య యజమాని- ఉద్యోగి అనే కంటే స్నేహమే ఎక్కువగా ఉంది. రతన్ టాటా భుజంపై చెయ్యి వేసి నిల్చునే చనువు.. వెన్నుతట్టి ముద్ద తినిపించే సాన్నిహిత్యం శంతన్‌నాయుడి సొంతమయ్యాయి.
వృద్ధుల్లో ఒంటరితనం పోగొట్టేందుకు..
రతన్‌టాటా సహాయకుడిగా ఉన్ననప్పుడు గమనించిన అంశాలతో ఇప్పటికే రెండు పుస్తకాలు రచించాడు శంతన్. కాగా ఇప్పుడు మరో స్టార్టప్ మొదలు పెట్టే సన్నాహకాల్లో ఉన్నాడు. మలి వయసులో ఉన్న వృద్ధుల్లో ఒంటరితనం పోగొట్టేందుకు వీలుగా ఓ యాప్‌ని ప్రారంభించే యోచనలో ఉన్నాడు. అంటే అద్దెకు మనవళ్లు/మనవరాళ్లు అన్న మాట!
Mukesh Ambani: ముఖేష్ అంబానీ టాప్ సక్సెస్ సీక్రెట్స్ ఇవే..