Amma ki Vandanam Scheme : అమ్మ‌కు వంద‌నం.. అంతా మాయ..? ప్ర‌తి విద్యార్థికి రూ.15 వేలు ఇంకెప్పుడు..?

పేదంటి విద్యార్థులందరూ చదువుకునేందుకు తల్లిదండ్రులకు భరోసాగా గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకాన్ని 2020 జనవరి 9వ తేదీన ప్రారంభించారు.

గ‌త ప్ర‌భుత్వంలో దీనిని ప‌క్కాగా అమ‌లు చేశారు. ప్ర‌స్తుత ఈ ప‌థ‌కంను..అమ్మ‌కు వంద‌నంగా పేరు అయితే మార్చారు కానీ.. విద్యార్థుల‌కు ఇవాల్సిన రూ.15 వేలు మాత్రం ఇవ్వ‌లేదు. ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు దాటించింది. రెండు సార్లు కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. అయితే అమ్మకు వందనంపై ఇంత వరకు విధివిధానాలు నిర్ణయించలేదు. కేబినెట్‌ చర్చ కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. కనీసం ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం ఈ ఊసే ఎత్తలేదు. అమ్మ‌కు వంద‌నం కోసం లక్షలాది మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. వీళ్ల తీరు చూస్తుంటే.. అమ్మ‌కు వంద‌నం.. మంగ‌ళం పాడేలా ఉన్నారు..?

గ‌త ప్ర‌భుత్వంలో కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న కూడా..
కరోనా స‌మ‌యంలో కూడా విద్యార్థుల‌కు ఎటువంటి ఇబ్బంది చేయ‌కుండా.. గ‌త వైఎస్సార్ ప్ర‌భుత్వం అమ్మ ఒడి నిధులను విడుద‌ల చేసింది. 2021 జనవరి 9వ తేదీన రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం నిధులు జమ చేశారు. అయితే పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని, విద్యా ప్రమాణాలు పెంచేందుకు 75 శాతం హాజరు దినాల ప్రాతిపదికన అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 2022 జూన్‌ 27వ తేదీ, 2023 జూన్‌ 28 తేదీన అమ్మ ఒడి నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఈ ఏడాది కూడా జూన్‌ చివరిలో అమ్మఒడి నిధులు జమ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మారడంతో ఈ పథకంపై అయోమయం నెలకొంది.

ఇప్పటికి స్పష్టత లేదు..
ఇప్పటికే తమ పిల్లలను అప్పోసప్పో చేసి తమ పిల్లలను ప్రైవేట్‌, ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల్లో చేర్పించారు. ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ ప్రభుత్వం అమ్మకు వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు బడికి పోతే అంత మందికి ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందిస్తామని హామీ ఇచ్చింది.  గత ప్రభుత్వంలో పాఠశాలలు తెరిచిన తర్వాత అమ్మఒడి పథకాన్ని అందించేది. ఆ డబ్బులతో ఆయా పాఠశాలలు, కళాశాలల్లో ఫీజు చెల్లించుకునే పరిస్థితి ఉండింది. ఈ ఏడాది పరిస్థితిపై తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ఈ ఏడాది 1.80 లక్షల మందికి పైగా.. కానీ
ఈ విద్యా సంవత్సరం అమ్మఒడి పథకం కింద 1.80 లక్షల మందికి పైగా విద్యార్థులు పెరిగే అవకాశం ఉంది. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలను బడికి, కళాశాలకు పంపించినట్లయితే అంత మంది పిల్లలకు తల్లికి వందనం పేరుతో పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి విధివిధానాలు జిల్లా విద్యాశాఖాధికారులకు రాలేదు. 

కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పథకాన్ని అమలు చేస్తారా? లేక ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు కూడా అమలు చేస్తారా? అనే దానిపై రకరకాలుగా ఊహాగానాలు ప్రచారంలో ఉండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. గత ప్రభుత్వం ఇంట్లో ఒక బిడ్డకే ఇచ్చినా ప్రభుత్వంతో పాటు ప్రైవేట్‌ విద్యార్థులకు పథకాన్ని అందించింది. రాష్ట్ర విద్యాశాఖా మంత్రిగా సీఎం తనయుడు లోకేశ్‌ వ్యవహరిస్తున్నారు.

ఇక కాలేజీల్లో అయితే..
జూనియర్‌ కళాశాలలు పునః ప్రారంభించి నెల రోజులు, పాఠశాలలు ప్రారంభించి రెండు వారాలు దాటాయి. అమ్మకు వందనంగా మారిన అమ్మఒడి పథకంపై అయోమయం నెలకొంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తొలి రెండేళ్లు ఏటా జనవరిలోనే ఈ పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. అయితే పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలనే నిబంధన పెట్టి రెండేళ్లు పాఠశాలలు తెరిచిన తర్వాత జమ చేస్తూ వచ్చింది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది జూన్‌లో అమ్మఒడి నగదు జమ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మారడంతో ఈ పథకానికి సంబంధించిన నిధుల జమపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

ఇప్ప‌టికి ఎలాంటి విధివిధానాలు లేవ్‌..
అమ్మకు వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి ఎలాంటి విధివిధానాలు ఇప్పటి వరకు రాలేదు. ఈ పథకానికి సంబంధించి సమాచారం కూడా అందలేదు. ఏవైనా విధివిధానాలు వస్తే అందుకనుగుణంగా పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. గతంలో కంటే ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది.
                                                                                                                         – పీవీజే రామారావు

#Tags