NSS Volunteers: ట్రాఫిక్‌ విధుల్లో ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు.. వలంటీర్ల మోహరింపు ఇలా...

సాక్షి, సిటీబ్యూరో: ఓపక్క నగరంలో వాహనాలు, ఉల్లంఘనుల సంఖ్య నానాటికీ పెరుగుతూ పోతోంది...ట్రాఫిక్‌ విభాగంలో సిబ్బంది సంఖ్య మాత్రం అవసరమైన స్థాయిలో ఉండట్లేదు.

ఈ కారణంగా నగర జీవి రోడ్డుపై నిత్యం నరకం చవిచూస్తున్నాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న విద్యా శాఖ పోలీసు విభాగానికి సహకరించడానికి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా నేషనల్‌ సర్వీస్‌ స్కీమ్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌)వలంటీర్లను ట్రాఫిక్‌ విధులకు వినియోగించాలని నిర్ణయించారు. దీంతో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న వలంటీర్లలో 225 మంది ఆగ‌స్టు 15న‌ నుంచి అధికారికంగా విధులు నిర్వర్తించడం ప్రారంభించారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఆయా మార్గాల్లో వీరిని మోహరించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లకు ట్రైనింగ్‌ ఫర్‌ ట్రైనర్స్‌ విధానంలో కొందరిని తీర్చిదిద్దారు. తొలి బ్యాచ్‌ శిక్షణను ఈ ఏడాది జూన్‌ 24న నాటి డీజీపీ రవి గుప్తా ప్రారంభించారు.

చదవండి: TGSCHE: ర్యాగింగ్, డ్రగ్స్‌పై సమరభేరి

ఈ శిక్షణలో భాగంగా ఒక్కో బ్యాచ్‌లో 100 మంది చొప్పున మొత్తం 600 మందికి శిక్షణ ఇచ్చారు. గోషామహల్‌లోని ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో (టీటీఐ) ఒక రోజు, ఆరు గంటల పాటు ఈ ట్రైనింగ్‌ జరిగింది. ఇందులో భాగంగా ఇండోర్‌ విభాగంలో నిబంధనలు, చట్టంలోని ప్రాథమిక అంశాలు బోధిస్తారు. ఔట్‌ డోర్‌ విభాగంలో రహదారులపై విధులు నిర్వర్తించే విధానం, ట్రాఫిక్‌ నిర్వహణలో కీలకాంశాలు నేర్పారు.

భవిష్యత్తులో నగరంలో ఒక్కో కూడలి వద్ద 20 నుంచి 30 మంది వలంటీర్లు విధుల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక ట్రాఫిక్‌ పోలీసులు వీరి భద్రతకు కీలక ప్రాధాన్యం ఇస్తూనే విధులు కేటాయిస్తారు. ప్రధానంగా ఫ్రీ లెఫ్ట్‌ అమలు, పాదచారుల భద్రత తదితర అవగాహన కార్యక్రమాలు వీరి ద్వారా చేయిస్తున్నారు.

గురువారం వలంటీర్ల మోహరింపు ఇలా...

స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో గోల్కొండ కోటలో జరిగే అధికారిక కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. అధికారికంగా ఆయనే జెండా వందనం చేశారు. దీనికి ముందు ఆయన గాంధీభవన్‌, సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లోని వార్‌ మెమోరియల్‌కు వెళ్లారు. ఈ మార్గాల్లోని జంక్షన్లలో 225 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు విడుదల వారిగా ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు విధులు నిర్వర్తించారు. వారి మోహరింపు ఇలా...

  • జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం గాంధీ భవన్‌ మధ్య ఉన్న 14 జంక్షన్లలో 99 మంది.
  • గాంధీభవన్‌–వార్‌ మెమోరియల్‌ మధ్య ఉన్న ఆరు జంక్షన్లలో 36 మంది.
  • వార్‌ మెమోరియల్‌ నుంచి గోల్కొండ కోట మధ్య ఉన్న 13 జంక్షన్లలో 90 మంది.

అధికారికంగా పని ప్రారంభం

  • నియంత్రణతో పాటు అవగాహన కోసం వీరి కృషి
  • స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో 225 మంది విధులు
  • జూబ్లీహిల్స్‌ నుంచి గోల్కొండ కోట వరకు మోహరింపు

#Tags