Change Name in Certificates: సర్టిఫికెట్లపై పేరు మార్చి ఇస్తే నష్టమేంటి ?: హైకోర్టు
తదుపరి విచారణలోగా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ రెండువారాలు వాయిదా వేసింది. తన పేరు మార్చుకున్నట్టు ప్రభుత్వ గెజిట్ జారీ అయినా..ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ బోర్డులు, ఉస్మానియా యూనివర్సిటీ ఆ మేరకు సర్టిఫికెట్లు మార్చి ఇవ్వడం లేదంటూ రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన వి.మధుసూదన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
1961లో జారీ చేసిన జీవో 1263 సెక్షన్ సీ లోని రూల్ 1, 2, 3 చట్టవిరుద్ధమని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం
విచారణ చేపట్టింది. సర్టిఫికెట్లలో పేరు మార్చేందుకు బోర్డులు నిరాకరించడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది కారుకొండ అరవింద్‌రావు వాదించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఒకసారి పేరు మారుస్తూ గెజిట్ జారీ అయ్యాక.. ఇక సర్టిఫికెట్ మార్పు అవసరం లేదని, గెజిట్‌లోని పేరే చెల్లుబాటు అవుతుందన్నారు.
చదవండి: Group 1 Results: గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో తండ్రీకొడుకుల ఉత్తీర్ణత
రూల్ 1, 2, 3 అదే చెబుతోందని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ‘పిటిషనర్ విజ్ఞప్తి న్యాయబద్ధమైనది. ఇలాంటి వారు పరీక్షలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో పేరు మారింది రాస్తారు.. అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్‌లో పాతపేరు అలాగే ఉంటుంది. ఆ కారణంతో వారు పరీక్షకు రాయడానికి అనర్హులుగా మారే ప్రమాదం ఉంది కదా.
అప్పుడు ఆ నష్టాన్ని ఎవరు పూడ్చుతారు? విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తున్న బోర్డులు, వర్సిటీలు గెజిట్ ప్రకారం పేరు మార్చి సర్టిఫికెట్ ఇస్తే నష్టమేంటి? ఇక్కడ పిటిషనర్ రూల్‌ను కూడా చాలెంజ్ చేస్తున్నారు’అని పేర్కొంది. దీనిపై తమ వివరాలు తెలియజేసేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీనికి అనుమతించిన ధర్మాసనం విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణలోగా పిటిషనర్‌కు సర్టిఫికెట్లలో పేరు మార్చి ఇస్తారని భావిస్తున్నామని వ్యాఖ్యానించింది.