Free Corporate Education: ప్రతి పేద విద్యార్థికి ఉచితంగా కార్పొరేట్‌ విద్య.. ఏక్కడ..?

సాక్షి, హైదరాబాద్‌: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకే సమీకృత గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.

గురుకుల విద్యా సంస్థలను ఒకే చోటుకు చేర్చి కార్పొరేట్‌ పాఠశాల తరహాలో విద్యాబోధన నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 11న‌ సచివాలయంలో సమీకృత గురుకుల పాఠశాలలు, స్కిల్‌ యూనివర్సిటీ భవనాల నమూనాలపై సంబంధిత అధికారులతో భట్టి సమీక్ష నిర్వహించారు.

సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక సమీకృత గురుకులాన్ని నిర్మించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు వివరించారు. జిల్లాల వారీగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

చదవండి: TG Cabinet Subcommittee: ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల కట్టడి.. ఈ కోచింగ్‌ కేంద్రాలపై నియంత్రణ

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు ఉంటాయన్నారు. విద్యతోనే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, విద్యపై పెట్టే ఖర్చు దేశ భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తున్నామని భట్టి పేర్కొన్నారు.

సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి.సైదులు, ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి, గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

#Tags