Rao Study Center: ఐదే నిమిషాల్లో మునక! ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటన వీడియోలు వైరల్‌

ఢిల్లీ: దేశ రాజధానిలోని ఓ సివిల్స్‌ కోచింగ్ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి వరదనీరు చేరడంతో పరీక్షకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు నీట మునిగి మృతిచెందారు. ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని రావ్ స్టడీ సెంటర్‌లో ఈ ఉదంతం చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి.

ప్రమాదానికి ముందు.. బేస్‌మెంట్‌లోకి నీరు ఎలా వేగంగా చేరుతున్నదో  చూడవచ్చు. ఆ సమయంలో లోపలున్న విద్యార్థులు వీలైనంత త్వరగా బయటకు రావాలని కోచింగ్ సెంటర్ సిబ్బంది చెప్పడం కూడా కనిపిస్తుంది.

అలాగే లోపల ఎవరైనా  ఉన్నారా? అని అడగడాన్ని గమనించవచ్చు. కేవలం ఐదే ఐదు నిమిషాల్లో సెల్లార్‌ నిండా వరద నీటితో నిండిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

జూలై 27‌ సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. ఏడు గంటల పాటు శ్రమించి ముగ్గురు విద్యార్థుల మృతదేహాల్ని అధికారులు వెలికి తీశారు.

చదవండి: Anusuya to Anukathir Surya Gender Change: ఇండియన్ సివిల్ సర్వీసుల చరిత్రలో తొలిసారి కీలక పరిణామం

మరోవీడియోలో కోచింగ్‌ సెంటర్‌ బయట నడుం లోతు నీరు పేరుకుపోవడం గమనించవచ్చు. మరోవైపు సెంటర్‌కు ఎదురుగా నిల్చొని కొందరు ఆ వరద తాకిడిని వీడియోలు తీసిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. 

మరోవైపు నిబంధనలను ఉల్లంఘిస్తున్న కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) చర్యలు మొదలుపెట్టింది. ఢిల్లీలో చట్టవిరుద్ధంగా నడుస్తున్న పలు కోచింగ్ సెంటర్లను సీల్ చేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ బృందం పాత రాజేంద్ర నగర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది.

అదేవిధంగా ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి త్వరలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఒక అధికారి తెలిపారు.

#Tags