ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్

అఖిల భారత సర్వీసుల్లో ఐఏఎస్, ఐపీఎస్‌ల తర్వాత నిలిచే ఉన్నత స్థాయి సర్వీసుల్లో ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఒకటి.
కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఇంజనీరింగ్ కెరీర్‌తో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనుకునే వారికి ఇదో సువర్ణావకాశం. యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఈ పరీక్షకు తీవ్ర పోటీ ఉంటుంది. మార్చి 14న దీనికి నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో స్పెషల్ ఫోకస్..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌పై సరైన అవగాహన లేకపోవడంతో కొద్ది మంది మాత్రమే ఎంపికవుతున్నారు. అర్హత: బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్స్, సివిల్, మెకానికల్) లేదా తత్సమానం. కచ్చితమైన ప్రణాళికతో, పూర్తిస్థాయి విశ్లేషణతో సిద్ధంకావడం ద్వారా సర్వీస్‌ను సొంతం చేసుకోవచ్చు. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష మూడు రోజుల వ్యవధిలో జరుగుతుంది.

మొదటి రోజు..
  • మొదటి రోజు జనరల్ ఎబిలిటీ పరీక్ష ఉంటుంది. ఇందులో పార్ట్-ఎ జనరల్ ఇంగ్లిష్ (60 ప్రశ్నలు, 100 మార్కులు), పార్ట్-బి జనరల్ స్టడీస్ (60 ప్రశ్నలు, 100 మార్కులు) ఉంటాయి. మొత్తం రెండు గంటల వ్యవధి ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఇస్తారు.
ఇంగ్లిష్: జనరల్ ఇంగ్లిష్‌లో సినోనిమ్స్, యాంటోనిమ్స్, కాంప్రెహెన్షన్, స్పాటింగ్ ఎర్రర్ అంశాలపై ప్రశ్నలుంటాయి. జనరల్ వొకాబ్యులరీ, టెక్నికల్ వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. రోజూ కొన్ని పదాలు నేర్చుకొని, వాటిని వాక్యాల్లో ప్రయోగించడాన్ని ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం ఇంగ్లిష్ దినపత్రికలను ఉపయోగించుకోవాలి. కాంప్రెహెన్షన్‌లో పారాగ్రాఫ్ ఇచ్చి, ప్రశ్నలు అడుగుతారు కాబట్టి దీనికోసం రీడింగ్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. స్పాటింగ్ ఎర్రర్‌కు గ్రామర్‌పై అవగాహన ఉంటే సరిపోతుంది.

జనరల్ స్టడీస్: ప్రాచీన, ఆధునిక భారతదేశ చరిత్రపై ఎక్కువ ప్రశ్నలుంటాయి. సింధూ నాగరికత, వేద కాలం మొదలు భారత జాతీయోద్యమం వరకు చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి. పాలిటీలో భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, అధికారాల విభజన తదితర అంశాలపై దృష్టిసారించాలి. జీడీపీ రేటు, బ్యాంకింగ్ రంగం, పంచవర్ష ప్రణాళికలు వంటి అంశాలు చదవాలి. అడవులు, రహదారులు, రైల్వేలు, వాతావరణం, ఖనిజాలు, పరిశ్రమలు, జనాభా అంశాలపై దృష్టిసారించాలి. సైన్స్, టెక్నాలజీకి సంబంధించి ఆవిష్కరణలు, వైరస్‌లు, బ్యాక్టీరియాలు, శాస్త్రవేత్తలు కీలకమైనవి. ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా, జాతీయంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాల అధ్యయనం తప్పనిసరి.

రెండో రోజు పరీక్ష..
ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ పేపర్-1, పేపర్-2లలోని ప్రశ్నలు... బ్రాంచ్‌ల వారీగా బీఈ/బీటెక్ స్థాయిలో ఉంటాయి. ఒక్కో పేపర్‌లో 120 ప్రశ్నలు, 200 మార్కులకు ఉంటాయి. పేపర్‌కు రెండు గంటల చొప్పున సమయం అందుబాటులో ఉంటుంది. ఈ పేపర్లు చాలా కీలకమైనవి. ఇంజనీరింగ్ సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలుంటాయి కాబట్టి ప్రాక్టీస్ ద్వారా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు.

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
ఆబ్జెక్టివ్ పేపర్-1:
ఎలక్ట్రికల్ సర్క్యూట్ల నుంచి 40-50 ప్రశ్నలు వస్తాయి. బేసిక్ అంశాలతో పాటు నెట్‌వర్క్ సింథసిస్, నెట్‌వర్క్ ఫంక్షన్స్‌పై దృష్టిసారించాలి. కంట్రోల్ సిస్టమ్స్ నుంచి 40-45 ప్రశ్నలు వస్తాయి. మెసర్‌మెంట్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ నుంచి 30-35 ప్రశ్నలు అడుగుతారు. ఎలక్ట్రికల్ మెటీరియల్స్ నుంచి 25-30 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. ఎలక్ట్రోమ్యాగ్నటిక్ థియరీలో మ్యాగ్నటిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ సంబంధిత సిద్ధాంతాలు, సూత్రాలు, సమస్యలు తదితరాల నుంచి 30-35 ప్రశ్నలు రావడానికి అవకాశముంది.
  • ఎలక్ట్రిక్ సర్క్యూట్లు, కంట్రోల్ సిస్టమ్స్, మెసర్‌మెంట్స్ అంశాల ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు.
ఆబ్జెక్టివ్ పేపర్-2: ఈ పేపర్‌లో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ సంబంధిత సబ్జెక్టులపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
  • అనలాగ్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్: దీన్నుంచి దాదాపు 30 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. డిజిటల్, ఆపరేషనల్ ఆంప్లిఫైయర్స్‌పై ప్రశ్నలు తేలిగ్గా ఉంటాయి.
  • పవర్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్ తదితర అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
పేపర్-1:
నెట్‌వర్క్ థియరీ, ఎలక్ట్రానిక్ డివెసైస్, సిగ్నల్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్ థియరీల బేసిక్ సబ్జెక్టుపై పట్టు సాధిస్తే మిగిలిన సబ్జెక్టులు తేలిగ్గా అర్థమవుతాయి.

పేపర్-2: కంట్రోల్ సిస్టమ్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, డిజిటల్ సర్క్యూట్స్ సబ్జెక్టుల్లో తేలిగ్గా మార్కులు స్కోర్ చేయొచ్చు. కాబట్టి అనలాగ్ సర్క్యూట్లు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి.

సివిల్ ఇంజనీరింగ్
పేపర్ 1: సాలిడ్ మెకానిక్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్‌లో స్పెసిఫికేషన్స్, ప్రాపర్టీస్‌పై ప్రశ్నలుంటాయి. వీటి నుంచి 120-150 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. మిగిలిన మార్కులకు ప్రశ్నలు బిల్డింగ్ మెటీరియల్స్, కన్‌స్ట్రక్షన్ ప్రాక్టీస్ వంటి సబ్జెక్టుల నుంచి వస్తాయి.

పేపర్ 2: ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలజీ, సాయిల్ మెకానిక్స్, సర్వేయింగ్‌లను బేసిక్ సబ్జెక్టులుగా గుర్తించి, ప్రాక్టీస్ చేయాలి.

మెకానికల్ ఇంజనీరింగ్
పేపర్ 1:
ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ ప్రాథమిక అంశాల నుంచి అప్లికేషన్స్ వరకు క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పవర్‌ప్లాంట్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనింగ్, ఐసీ ఇంజిన్స్ ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు.

పేపర్ 2: స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అంశాలపై పట్టు సాధిస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ఎస్‌ఎం, థియరీ ఆఫ్ మెకానిక్స్, మెషీన్ డిజైన్ సమస్యలు స్పెసిఫికేషన్స్, ప్రాపర్టీస్ కూడి ఉంటాయి. ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో సమస్యలు విశ్లేషణాత్మకంగా ఉంటాయి.

మూడో రోజు..
కన్వెన్షనల్ పేపర్లు:
ఈ పేపర్లలో డిస్క్రిప్టివ్ ప్రశ్నలుంటాయి. డెఫినిషన్స్, స్టేట్‌మెంట్స్, డెరివేషన్ ఆఫ్ మ్యాగ్జిమమ్ కండిషన్స్, ఫార్ములాలు సంబంధిత ప్రశ్నలు ఇస్తారు. పేపర్-1, పేపర్-2లకు 200 చొప్పున మార్కులు కేటాయించారు. ఒక్కో పేపర్‌కు రెండు గంటల వ్యవధి ఉంటుంది.


















#Tags