ఐటీలో మేటి కెరీర్‌కు హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్కింగ్

ఐటీ, సాఫ్ట్‌వేర్ జాబ్ ప్రొఫైల్స్ అనగానే సాధారణంగా, ప్రోగ్రామర్స్, డెవలపర్స్ వంటి విభాగాలే గుర్తొస్తాయి! అధిక శాతం మంది అభ్యర్థులు కూడా వీటిపైనే దృష్టిసారిస్తారు. కానీ,హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ విభాగాలు ఐటీ రంగ మనుగడలో వెన్నెముకగా నిలుస్తూ, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. దేశంలో సాఫ్ట్‌వేర్ సేవలు మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో కాంతులీనే కెరీర్‌ను అందించనున్న హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ విభాగాలపై ఫోకస్...
ఐటీ హార్డ్‌వేర్
ఒక కంప్యూటర్ ఉత్పత్తుల ప్రక్రియలో హార్డ్‌వేర్ కీలకమైంది. అర చేతిలో ఇమిడే టాబ్లెట్స్ నుంచి డెస్క్‌టాప్స్ వరకు వివిధ సమాచార సాంకేతిక పరికరాలను ఆకట్టుకునే రీతిలో రూపొందించి, వాటి ఆకృతులను బట్టి ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించాల్సిన విడి భాగాలను సరైన రీతిలో హార్డ్‌వేర్ పొందుపరుస్తుంది. అంటే.. కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిలో అవసరమైన విడి భాగాల సమ్మిళితంగా హార్డ్‌వేర్‌ను పేర్కొనొచ్చు. ఉత్పత్తులకు మరమ్మతులు చేయటం, అవి యథాతథంగా పని చేసేలా చేయటం కూడా హార్డ్‌వేర్‌లో భాగమే. ఈ నైపుణ్యాలను హార్డ్‌వేర్ టెక్నాలజీ అందిస్తోంది.

నెట్‌వర్కింగ్
లోకల్ ఏరియా నెట్‌వర్క్, ఇంట్రానెట్, నెట్‌వర్క్ సర్వర్స్.. సాఫ్ట్‌వేర్ సేవల్లో లోపాలు, అంతరాయం లేకుండా చేసే నెట్‌వర్కింగ్ విభాగానికి సంబంధించినవి. సాధారణంగా సంస్థల స్థాయిలో నెట్‌వర్కింగ్ విభాగం అవసరం. సాఫ్ట్‌వేర్ ఆధారంగా సేవలు అందించే క్రమంలో.. ఒక సంస్థలో వివిధ విభాగాల మధ్య డేటా ట్రాన్స్‌ఫర్, పలు కంప్యూటర్ల మధ్య నెట్‌వర్క్ షేరింగ్, లోకల్ ఏరియా నెట్‌వర్క్ వంటి అంశాలు నెట్‌వర్కింగ్‌లో ఇమిడి ఉంటాయి. వీటిలో నైపుణ్యాలను నెట్‌వర్క్ టెక్నాలజీ విభాగం అందిస్తుంది.

ఇంటర్ నుంచే అడుగులు
ఐటీ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ విభాగాల్లో ఇంటర్మీడియెట్ అర్హతతోనే అడుగులు వేయొచ్చు. సాధారణంగా బీటెక్‌లో ఈసీఈ, సీఎస్‌ఈ పూర్తిచేసిన అభ్యర్థులకు హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ విభాగాలపై అవగాహన ఉంటోంది. కానీ, ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న అవసరాలను పరిగణిస్తే ఇంటర్మీడియెట్ అర్హతతోనే ప్రవేశించొచ్చు. అందుబాటులో ఉన్న కొన్ని సర్టిఫికెట్ కోర్సులు చేయటం ద్వారా ఈ విభాగాల్లో నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. నెట్‌వర్కింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉంటే అవకాశాలు మెరుగవుతాయి.

అర్హతను బట్టి వేతనాలు
ఐటీ హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ విభాగాల్లో అర్హతను బట్టి వేతనాలు లభిస్తున్నాయి. షార్ట్‌టర్మ్ సర్టిఫికెట్ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు రూ.10 వేలు వచ్చే అవకాశం ఉంది. ఈసీఈ, సీఎస్‌ఈ బ్రాంచ్‌లతో బీటెక్ పూర్తిచేసి, సర్టిఫికేషన్స్ కూడా చేసిన అభ్యర్థులకు నెలకు రూ.30 నుంచి 40 వేల జీతం లభిస్తుంది.

హోదాలు
హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ విభాగంలో అర్హతలు, అనుభవం ఆధారంగా హోదాలు ఉంటాయి.
అవి..
  • సిస్టమ్ ఇంటిగ్రేటర్
  • నెట్‌వర్కింగ్ ప్రొఫెషనల్
  • పీసీ అసెంబ్లర్ అండ్ టెక్నీషియన్
  • టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్
  • పెరిఫెరల్ ఇంజనీర్
  • చిప్ డిజైనర్
  • సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్
  • సిస్టమ్ ఇంజనీర్.
హార్డ్‌వేర్, నెట్‌వర్క్ ఇంజనీర్ విధులు
  • ప్రొడక్ట్ డిజైన్
  • హార్డ్‌వేర్ ఇన్‌స్టాలేషన్
  • హార్డ్‌వేర్ మెయింటనెన్స్
  • సూపర్ వైజింగ్
  • నెట్‌వర్క్ మెయింటనెన్స్
  • నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్
  • సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్

ప్రైవేటు, ప్రభుత్వ కొలువులు
సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల తయారీలో స్వదేశీ సంస్థల సంఖ్య పెరగటంతో పాటు ఒక ఉత్పత్తి తయారీలో ఉపయోగించే విడి భాగాలను రూపొందించేందుకు ప్రత్యేకంగా సంస్థలు ఏర్పడటం వంటివి హార్డ్‌వేర్ రంగం శరవేగంగా విస్తరిస్తుందనేందుకు నిదర్శనాలు. ఎస్‌ఎంఈల నుంచి బహుళజాతి సంస్థల వరకు ప్రతి సంస్థలోనూ సాఫ్ట్‌వేర్ ఆధారిత సర్వీసులకు ప్రాధాన్యం పెరిగింది. ప్రతి సంస్థ ఏదో ఒక రూపంలో సాఫ్ట్‌వేర్ వినియోగంపై ఆధారపడటంతో, నెట్‌వర్కింగ్ నైపుణ్యాలున్న మానవ వనరుల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇలా కంపెనీల అవసరాలను అందిపుచ్చుకుంటే అద్భుత అవకాశాలు సొంతం చేసుకోవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్‌లో నిర్ణీత అర్హతలు పొందిన అభ్యర్థులకు ప్రైవేటు రంగంలో కోర్ ఐటీ సంస్థలు, బీపీఓలు, ఐటీ అనుబంధ సేవల సంస్థలు, టెలికం సంస్థలు, సిస్టమ్ డిజైన్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. మరో వైపు ప్రభుత్వ రంగంలోనూ కొలువులు ఖాయమవుతున్నాయి. ప్రభుత్వ రంగంలో ఈసీఐఎల్, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

స్వయం ఉపాధి అవకాశాలు అపారం
హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ విభాగాల్లో స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విభాగంలో నిపుణులు కంప్యూటర్ అసెంబ్లింగ్ యూనిట్లను, హార్డ్‌వేర్ మరమ్మతుల సంస్థలను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో పర్సనల్ కంప్యూటర్స్ వినియోగం పెరుగుతుండటంతో, స్వయం ఉపాధి దిశగా ఊతమిస్తోంది.

హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ పరిశ్రమ గణాంకాలు
  • 2019 నాటికి 5.6 బిలియన్ డాలర్లకు చేరుకోనున్న కంప్యూటర్ హార్డ్‌వేర్ పరిశ్రమ.
  • ఎన్‌ఎస్‌డీసీ అంచనాల ప్రకారం, 2022 నాటికి ఈ రంగంలో 4.61 మిలియన్
ఉద్యోగాలు.
  • నెట్‌వర్కింగ్ విభాగంలో 2020 నాటికి 1.13 లక్షల ఉద్యోగాలు.
  • డిజిటల్ ఇండియా ఇనీషియేటివ్ నేపథ్యంలో 2025 నాటికి ట్రిలియన్ డాలర్లకు భారత ఐటీ రంగం చేరుకోనుంది. ఇందులో 20 శాతం మేర హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ విభాగాలదే అని మెకిన్సే అంచనా.
హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ విభాగాల్లో కొలువుల ఔత్సాహికులకు అందుబాటులో ఉన్న సర్టిఫికేషన్ కోర్సులు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమైన సర్టిఫికేషన్ కోర్సుల వివరాలు..
లినక్స్
లోకల్ ఏరియా నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో లినక్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కోర్సు ముఖ్యమైన నైపుణ్యాలు అందిస్తుంది. ఈ సర్టిఫికేషన్‌లు అభ్యర్థులు ఎంచుకున్న కోర్సు ఆధారంగా పలు స్థాయిల్లో ఉంటాయి. అవి..
సర్టిఫికేషన్ లెవల్ 1; Comp TIA Linux+
సర్టిఫికెట్ లెవల్ 2
సర్టిఫికెట్ లెవల్ 3
వెబ్‌సైట్: www.lpi.org

సిస్కో సర్టిఫికేషన్స్
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ సిస్కో కూడా హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్‌ల్లో పలు షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తోంది. అవి..
  • సిస్కో సర్టిఫైడ్ నెట్‌వర్క్ అసోసియేట్
  • సిస్కో సర్టిఫైడ్ డిజైన్ అసోసియేట్
  • సిస్కో సర్టిఫైడ్ నెట్‌వర్క్ ప్రొఫెషనల్
  • సిస్కో సర్టిఫైడ్ డిజైన్ ప్రొఫెషనల్
  • సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్ ప్రొఫెషనల్
  • సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్ ఎక్స్‌పర్ట్
  • సిస్కో సర్టిఫైడ్ డిజైన్ ఎక్స్‌పర్ట్
  • సీఎస్‌ఈ/ఈసీఈ బ్రాంచ్‌లతో బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
వెబ్‌సైట్: www.cisco.com

జెట్‌కింగ్
హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్‌ల్లో భారతదేశంలో ప్రఖ్యాతి గడించిన జెట్‌కింగ్ పలు సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తోంది. అవి...
  • జెట్‌కింగ్ సర్టిఫైడ్ హార్డ్‌వేర్ అండ్ నెట్‌వర్క్ ఇంజనీర్
  • మాస్టర్ ఇన్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్
  • స్మార్ట్ గ్రిడ్ కోర్సెస్
  • నెట్ వర్క్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్
వెబ్‌సైట్: www.jetking.com

రెడ్ హ్యాట్ అండ్ నావెల్
  • రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్
  • రెడ్ హ్యాట్ సర్టిఫైడ్ ఆర్కిటెక్ట్.
వెబ్‌సైట్: www.redhat.com

హార్డ్‌వేర్‌కు ప్రాధాన్యం
ఐటీ రంగంలో సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు, సేవలతో పాటు వాటి రూపకల్పన, నిర్వహణలో కీలక పాత్ర పోషించే హార్డ్‌వేర్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ విషయంలో ఇటీవల కాలంలో సంస్థల దృక్పథంలోనూ మార్పు వచ్చింది. ప్రత్యేకంగా హార్డ్‌వేర్ ప్రొఫైల్ ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. ఔత్సాహిక విద్యార్థులు వీటిని అందిపుచ్చుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.
- ప్రొఫెసర్ కృష్ణ మోహన్, సీఎస్‌ఈ, ఐఐటీ-హెచ్

నెట్‌వర్క్ నైపుణ్యాలకు పెద్ద పీట
ప్రస్తుతం అన్ని రంగాల్లో సాఫ్ట్‌వేర్ వినియోగం, వాటి ఆధారంగా సేవలు అందించడానికి ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో ఐటీ నెట్‌వర్క్ నైపుణ్యాలున్న వారికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. సాధారణంగా పెద్ద సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్, ఇంటర్న్‌షిప్‌ల ద్వారా నియామకాలు చేపడుతున్నాయి. అయితే మిగతా అభ్యర్థులు సర్టిఫికేషన్ కోర్సులు చేయటం ద్వారా ఆయా సంస్థలకు నేరుగా దరఖాస్తు చేసుకుని, ఉద్యోగాలు పొందొచ్చు. అభ్యర్థులు కేవలం కోర్సుల అభ్యసనానికే పరిమితం కాకుండా, వెండార్ ఇన్‌స్టిట్యూట్‌లుగా పేర్కొనే ఆయా సంస్థలు (ఉదా: సిస్కో, లినక్స్) నిర్వహించే పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధిస్తే అవకాశాలు మరింత మెరుగవుతాయి.
- రాఘవ కృష్ణ, ప్లేస్‌మెంట్ మేనేజర్, జెట్‌కింగ్ ఇన్ఫోట్రెయిన్




































#Tags