AP POLYCET Results 2024 : పాలిసెట్ ఫలితాల్లో 88శాతం ఉత్తీర్ణత
తిరుపతి ఎడ్యుకేషన్ : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు పదో తరగతి విద్యార్హతతో ఏప్రిల్ 27వ తేదీన రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ పాలిసెట్–2024 ప్రవేశ పరీక్షను నిర్వహించింది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.
ఈ ఫలితాల్లో తిరుపతి జిల్లా నుంచి 88 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షకు జిల్లా నుంచి బాలబాలికలు 4.436 మంది హాజరయ్యారవ్వగా.. 3,909 (88 శాతం)మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, పాలిసెట్ జిల్లా కన్వీనర్ డాక్టర్ వై.ద్వారకనాథ్‌రెడ్డి తెలిపారు.
జిల్లా టాపర్లు వీరే
పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ఈ ఫలితాల్లో వడమాలపేట మండలం, కదిరిమంగళంకు చెందిన కొమిండల సాహిత్ 120 మార్కులకుగాను 118 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 24వ ర్యాంకు, జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకును సాధించాడు. అలాగే పెళ్లకూరు మండలం, తాళ్వాయిపాడు గ్రామానికి చెందిన కట్టా వెంకటసత్యం 115 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 153వ ర్యాంకు, జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు, నాయుడుపేటకు చెందిన గుంటుమడుగు జ్ఞాణేష్ 114 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 172వ ర్యాంకు, జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు.