పారిశ్రామిక తీర్మానాలు

పారిశ్రామికీకరణకు సాధనంగా ప్రతిదేశం పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుంది. పారిశ్రామిక తీర్మానాన్ని ప్రభుత్వ రంగం అమలు పరుస్తుంది. భారత్‌లాంటి ఆర్థిక వ్యవస్థల్లో అనేక వ్యాపారాల్లో ప్రైవేట్ రంగాన్ని అనుమతించిన నేపథ్యంలో సమగ్ర పారిశ్రామిక విధానం రూపకల్పన తప్పనిసరి. స్వాతంత్య్రానంతరం భారత్‌లో ఉత్పత్తి తగ్గిన కారణంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్మిక సంఘాల నాయకులు జాతీయీకరణను బలపరచగా పారిశ్రామిక వేత్తలు స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థను బలపరిచారు.
భారత ప్రభుత్వం 1948 ఏప్రిల్ 6న మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటించింది. ఈ తీర్మానం ద్వారా భారత్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ దృక్పథాన్ని ఎంచుకుంది. 1948 పారిశ్రామిక తీర్మానం ద్వారా పరిశ్రమలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. మూలధన వస్తువులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపునకు ఈ తీర్మానం విదేశీ మూలధన ప్రవాహాన్ని ప్రోత్సహించింది. భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా, కుటీర పరిశ్రమల ఆవశ్యకతను ఈ తీర్మానం గుర్తించింది. 1948 పారిశ్రామిక తీర్మానాన్ని అమలు పరచడానికి ‘పరిశ్రమల అభివృద్ధి, నియంత్రణ చట్టం 1951’ను తీసుకువచ్చింది.
 
1956 ఏప్రిల్ 30న ప్రభుత్వం రెండో పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటించింది. ఈ తీర్మానం ద్వారా పరిశ్రమలను 3 షెడ్యూల్‌లుగా విభజించారు. షెడ్యూల్-అలో ఉన్న 17 పరిశ్రమలను ప్రభుత్వ రంగానికి రిజర్‌‌వ చేశారు. భారత్‌లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం, ప్రణాళికబద్ధ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను రూపొందించే క్రమంలో ప్రణాళికల అమలు ప్రారంభం, సామ్యవాద సమాజ స్థాపన దిశగా పార్లమెంట్ తీర్మానం చేయడంలాంటి అంశాలు రెండో పారిశ్రామిక తీర్మానం (1956) ప్రకటించడానికి కారణమయ్యాయి. ప్రభుత్వ రంగాన్ని విస్తరించడం, సహకార రంగాన్ని పటిష్ట పరచడం, ప్రైవేట్ పరిశ్రమల్లో ఓనర్‌షిప్, యాజమాన్యాన్ని వేరుపరచడాన్ని ప్రోత్సహించడం, ప్రైవేట్ ఏకస్వామ్యాలను నిరోధించండం లాంటి అంశాలకు 1956 పారిశ్రామిక తీర్మానం ప్రాధాన్యమిచ్చింది. 1956 పారిశ్రామిక తీర్మానాన్ని ‘భారత ఆర్థిక రాజ్యాంగం’ లేదా ‘ది బైబిల్ ఆఫ్ స్టేట్ కాపిటలిజం’గా పేర్కొనవచ్చు.
 
1977 పారిశ్రామిక తీర్మానాన్ని జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చిన్నతరహా, కుటీర పరిశ్రమలకు ఈ పారిశ్రామిక తీర్మానం ప్రాధాన్యమిచ్చింది. చిన్నతరహా పరిశ్రమలకు విస్తృతమైన మద్దతు చర్యలను ఈ పారిశ్రామిక తీర్మానం ప్రకటించింది. ఈ తీర్మానం చిన్న తరహా పరిశ్రమలను కుటీర  మరియు కుటుంబ పరిశ్రమలు, అనుషంగిక పరిశ్రమ, చిన్నతరహా పరిశ్రమలు అనే మూడు కేటగిరీలుగా విభజించింది. ప్రతి కేటగిరీకి సంబంధించి ప్రత్యేకంగా విధాన చర్యలను రూపొందించడానికి చిన్నతరహా పరిశ్రమలను ఈ విధంగా విభజించారు. మౌలిక, మూలధన వస్తువులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశ్రమలో పెద్ద తరహా పరిశ్రమలను అనుమతిస్తారు. విత్త సంస్థల నుంచి అధిక మొత్తంలో నిధులు చిన్నతరహా పరిశ్రమల రంగానికి అందుబాటులో ఉంచటానికి ఈ తీర్మానం ప్రాధాన్యమిచ్చింది. నూతన ప్రాజెక్ట్‌లు  ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి పెద్ద తరహా పరిశ్రమలు అంతర్గత ఫైనాన్‌‌సను సృష్టించుకోవాల్సిన అవశ్యకతను ఈ తీర్మానం పేర్కొంది. ప్రభుత్వ రంగం పాత్ర విస్తరణకు ఈ తీర్మానం ప్రాధాన్యమిచ్చింది.
 
1980 పారిశ్రామిక తీర్మానం ఆర్థిక అవస్థాపన పెంపునకు ప్రభుత్వ రంగాన్ని మూల స్తంభంగా గుర్తించింది. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో సామర్థ్యం పెంపు ఆవశ్యకతను ఈ తీర్మానం పేర్కొంది. ఎంఆర్‌టీపీ చట్ట పరిధిల్లోని కంపెనీల ఆస్తుల పరిమితిని పెంచారు. లెసైన్సింగ్ నుంచి అనేక పెద్ద తరహా పరిశ్రమలను మినహాయించారు. ఈ తీర్మానం ద్వారా అనుషంగిక పరిశ్రమల పెట్టుబడి పరిమితిని రూ.1 లక్షకు,  చిన్న తరహా యూనిట్ల పెట్టుబడి పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు, అనుబంధ పరిశ్రమల పెట్టుబడి పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు.
 
జనతాదళ్ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని 1990 మే 31న ప్రకటించింది. చిన్న తరహా పరిశ్రమల ప్లాంటు, యంత్రాలపై పెట్టుబడి పరిమితిని రూ. 35 లక్షల నుంచి 60 లక్షలకు, అనుబంధ యూనిట్లలో రూ. 45 లక్షల నుంచి 75 లక్షలకు పెంచడం జరిగింది. అనుబంధ యూనిట్ల వార్షిక ఉత్పత్తిలో ఎగుమతి వాటా 30 శాతం ఉన్నట్లయితే ఆయా యూనిట్లలో పెట్టుబడి పరిమితిని రూ.75 లక్షల వరకు అనుమతిస్తారు. అనుషంగిక యూనిట్లలో పెట్టుబడి పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. చిన్నతరహా పరిశ్రమలకు ఇప్పటికే 836 వస్తువుల తయారీని రిజర్‌‌వ చేయగా అదనంగా మరికొన్ని వస్తువుల ఉత్పత్తిని చిన్న తరహా పరిశ్రమలకు రిజర్‌‌వ చేయాలని భావించారు. చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో అవసరమయిన పరపతి అందించడానికి ఐఈఆఐను ఏర్పాటు చేశారు. చిన్న తరహా యూనిట్లపై బ్యూరోక్రటిక్ నియంత్రణ తగ్గించాలని ఈ తీర్మానం పేర్కొంది. గ్రామీణ, కుటీర పరిశ్రమల్లోని నిమగ్నమైన అతిపెద్ద సంఖ్యలో ఉన్న చేతి వృత్తుల వారికి తగిన చేయూత నివ్వడానికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ)ను పటిష్ట పరచాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు. విత్త సంస్థల నుంచి లభించే పరపతిలో ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.
 
1990వ దశకం ముందు భాగంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 1991 పారిశ్రామిక తీర్మానం రూపుదిద్దుకుంది. ఆర్థిక నియంత్రణలో సమగ్రమైన మార్పులను ఈ తీర్మానం సూచించింది. ఈ తీర్మానం ద్వారా ప్రభుత్వ రంగ పాత్రను పునర్ నిర్వచించడం జరిగింది. క్రితం కాలంలో ప్రభుత్వ రంగానికి రిజర్‌‌వ చేసిన ముఖ్య పరిశ్రమల్లో ప్రైవేట్ రంగాన్ని అనుమతించారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ మూలాలను 1991 పారిశ్రామిక తీర్మానం కలిగి ఉంది. ఈ తీర్మానం ద్వారా ఎం.ఆర్.టి.పి.  చట్టాన్ని రద్దు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని అమలు చేశారు. విదేశీపెట్టుబడి, విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న ఆంక్షలను తొలగించారు.
#Tags