AP SI Job Selected Candidates: ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించారు.. ఎస్‌ఐ ఫ‌లితాల్లో విజ‌యం సాధించారు.. వారు వీరే..

ఎస్‌ఐ ఫ‌లితాల్లో విజ‌యం సాధించి వీరంతా క‌ల‌ను నెర‌వేర్చుకున్నారు.

త‌ల్లిదండ్రుల రెక్క‌ల క‌ష్టం మీద చ‌దుకున్న‌వారు కొంద‌రైతే.. వివిధ ప‌నులు చేస్తూ విద్యాబ్యాసం పూర్తి చేసిన వారు మ‌రికొంద‌రు.. పోలీస్ శాఖ‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టు కోసం వేల మందితో పోటీ ప‌డి విజేత‌లుగా నిలిచారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మిస్తే విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించారు. యువ‌త‌కు స్పూర్థిదాయ‌కంగా నిలిచారు.

పట్టుదలతో చదివి.. విజయం సాధించి.. 
పట్టుదలతో చదివి ఎస్‌ఐ ఫలితాల్లో కైప గ్రామానికి చెందిన కోగిల చెన్నయ్య విజయం సాధించాడు. కోగిల మోహన్‌దాసు, జయమ్మ దంపతుల కుమారుడైన చెన్నయ్య బనగానపల్లెలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2014లో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాడు. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో టెలికం అసిస్టెంట్‌ ఉద్యోగం చేస్తూనే ఎస్‌ఐ పరీక్షలకు సిద్ధమయ్యాడు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించాడు. తన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ.. తనను చదివించారని, పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేస్తానని కోగిల చెన్నయ్య తెలిపారు.

రైతు బిడ్డ ప్రతిభ..
చాగలమర్రి మండలంలోని తోడేండ్లపల్లె గ్రామానికి చెందిన వీర ప్రతాప్‌ ఎస్‌ఐ రాత పరీక్షలో ప్రతిభ చూపాడు. ఏపీఎస్పీ విభాగంలో 31వ ర్యాంకు సాధించి ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. రైతు కుటుంబానికి చెందిన ఓబులేసు, వెంకట లక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడైన మైదుకూరు వీర ప్రతాప్‌ ఎంటెక్‌ పూర్తి చేశాడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగాన్ని వదిలేసి.. ఇంటి వద్ద ఉండి ఎస్‌ఐ ఉద్యోగానికి సన్నద్ధమయ్యాడు. వ్యవసాయంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ, పోటీ పరీక్షలకు హాజరై ఎపీఎస్‌పీ ఎస్‌ఐగా మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగాన్ని సాధించాడు. వీర ప్రతాప్‌కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

SI Candidates Selection List: ఎస్‌ఐ అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల.. టాపర్లు వీరే..

అంగన్‌వాడీ ఆయా కుమారుడు ఎస్‌ఐ.. 
ఆస్పరి మండల పరిధిలోని కలపరి గ్రామానికి చెందిన జి. శివమ్మ, వీరభద్రి దంపతుల కుమారుడు జి. సురేష్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై య్యాడు. తల్లి శివమ్మ కలపరిలో అంగన్‌వాడీ ఆయాగా పనిచేస్తున్నారు. సురేష్‌.. డీగ్రీ, పీజీ కర్నూలులో పూర్తి చేసి ఈ ఏడాది తెలంగాణ కానిస్టేబుల్‌గా ఎంపికై య్యాడు. ఎస్‌ఐ కావాలనే లక్ష్యంతో ఆపోస్టుకు వెళ్లలేకపోయాడు. ఇదే ఏడాదే తండ్రి వీరభద్రి అనారోగ్యంతో మృతి చెందాడు. ఎలాంటి కోచింగ్‌ లేకుండా కర్నూలులో రూమ్‌లో ఉంటూ చదువుకొని మొదటి ప్రయత్నంలోనే ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. తమ్ముడు ఈరన్న బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. తమకు ఎలాంటి పొలాలు లేవని, తల్లి శివమ్మ అంగన్‌వాడీ అయాగా పని చేస్తూ చదివించారని సురేష్‌ తెలిపారు. అమ్మ కష్టంతో చదివి ఎస్‌ఐగా ఎంపికై నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఒడిదుడుకులు అధిగమించి.. 
ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన నబిల్లా కరిష్మా అనే యువతి కష్టపడి చదివి ఎస్‌ఐ కొలువు సాధించారు. ఎస్‌ఎంటీ కాలనీకి చెందిన ఎన్‌.రఫీక్‌, ఎన్‌ జరినా దంపతుల నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె నబిల్లా కరిష్మా నవోదయలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. తరువాత పట్టణంలోని ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితితో అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఒడిదుడుకులను అధిగమించి ఎస్‌ఐగా ఎంపికయ్యారు. ఈ యువతిని బంధువులు, కాలనీవాసులు అభినందించారు.

AP SI Job Selected Candidate Success Story : ఎస్ఐ ఫ‌లితాల్లో.. రాయలసీమ జోన్‌లో ఫ‌స్ట్ ర్యాంక్ కొట్టానిలా.. నా స‌క్సెస్ సీక్రెట్ ఇదే..

విజయ ‘కీర్తన’
మిడుతూరు స్టేషన్‌లో సివిల్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగకీర్తన ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యారు. వెలుగోడు మండలం గుంతకందాల గ్రామానికి చెందిన మేడమ్‌ వెంకటేశ్వర్లు, సరోజా దంపతులకు ఒక కూతురు, కుమారుడు సంతానం. డిగ్రీ వరకు చదువుకున్న వెంకటేశ్వర్లు తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయానని మధన పడేవాడు. ఈ క్రమంలో పిల్లలను బాగా చదివించాడు. కూతురు నాగ కీర్తన 2019లో సివిల్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యారు.

‘ఖాకీ’ స్వప్నం సాకారం..
ఖాకీ దుస్తులు ధరించాలనే స్వప్నాన్ని ఉలిందకొండ గ్రామానికి చెందిన గొల్ల మహేష్‌ నెరవేర్చుకున్నాడు. తల్లిదండ్రలు జి. చిన్న మద్దయ్య, లక్ష్మీదేవి వ్యవసాయ పనులు చేస్తూ కుమారుడిని బీటెక్‌ వరకు చదివించారు. మొదట 2016లో కానిస్టేబుల్‌ పరీక్ష, 2018లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షలు రాసి ఉద్యోగం సాధంచలేకపో యాడు. అనుకున్న లక్ష్యం సాధించాలనే పట్టుదలతో హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకున్నాడు. పట్టుదలతో చదివి 2023లో నిర్వహించిన ఎస్‌ఐ పరీక్షలో విజయం సాధించాడు. అన్న చిన్నయ్య, తమ్ముడు రాజు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌గా ఉద్యోగం చేస్తున్నారని, వారితో పాటు తల్లిదండ్రుల సహకారంతో తన కలను నెరవేర్చుకున్నట్లు మహేష్‌ తెలిపారు.

మాధవరం యువకుడి ప్రతిభ..
వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు ఎస్‌ఐగా ఎంపికై ప్రతిభ కనబరిచాడు. వెలుగోడు మండ‌లం మాధవరం గ్రామానికి చెందిన రైతు బిడ్డ మద్దెల సతీష్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన మద్దెల సంజీవకుమార్‌ వ్యవసాయం చేస్తూ తన కుమారుడిని ఇంజనీరింగ్‌ చదివించాడు. ఎస్‌ఐగా కొలువు సాధించాలనే లక్ష్యంతో సతీష్‌ కష్టపడి చదివి సాధించాడు. సతీష్‌ను స్థానికులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.

AP High Court : ఏపీ ఆ ఎస్‌ఐ అభ్యర్థులపై హైకోర్టు ఆగ్రహం.. ఈ అఫిడవిట్‌ను ఉపసంహరించుకోవాల్సిందే..

#Tags