AP Inter Supplementary Exam 2024:ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీకి సర్వం సిద్ధం

ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీకి సర్వం సిద్ధం
AP Inter Supplementary Exam 2024:ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీకి సర్వం సిద్ధం

చిత్తూరు  : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలను జిల్లావ్యాప్తంగా 31 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం 7,442 మంది, ద్వితీయ సంవత్సరం 2,577 మంది, మొత్తం 10,019 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే పరీక్షలకు నిర్వహణకు సిబ్బందిని నియమించారు. డీవీఈఓ, హైపవర్‌ కమిటీ, సిట్టింగ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చి, వీటి ద్వారా ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా స్ట్రీమింగ్‌ చేశారు. పరీక్షలు తప్పినవారికి, మరిన్ని మార్కులు పొందేందుకు బెటర్‌మెంట్‌ కట్టిన విద్యార్థులకు కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.

ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు

జిల్లా వ్యాప్తంగా జూన్‌న్‌ 1వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం (రెండు సెషన్లుగా) నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు వారికి కేటాయించిన కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. పరీక్ష కేంద్రాలు ఇవీ..

జిల్లాలో మొత్తం 31 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో 30 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ఒక ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాల ఉన్నాయి. 24 కేంద్రాలలో ద్వితీయ సంవత్సరం పరీక్షలు, మిగిలిన 7 కేంద్రాలలో మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read : AP Inter 1st Year Study Material

నేడు సమన్వయ సమావేశం

సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై ఈ నెల 22వ తేదీన కలెక్టరేట్‌లో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఇంటర్‌ బోర్డు అధికారులతో పాటు వైద్యఆరోగ్య శాఖ, ఆర్టీసీ, పోలీసు, పోస్టల్‌, రెవెన్యూ, మున్సిపల్‌, విద్య, పంచాయతీ శాఖల అధికారులు పాల్గొననున్నారు. విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై చర్చించనున్నారు.

పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లా వ్యాప్తంగా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాం. సప్లిమెంటరీ పరీక్షలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపల్స్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారు. అసిస్టెంట్‌ చీఫ్‌గా సీనియర్‌ లెక్చరర్‌ ఉంటారు. 350 మంది ఇన్విజిలేటర్‌లను పరీక్షల నిర్వహణకు నియమిస్తున్నాం.

#Tags