Text Books: పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్‌!.. పుస్తకాలు ఈసారి ఇలా..

ఆటోనగర్‌ (విజయవాడ తూర్పు): పాఠశాల పునఃప్రారంభం నాటికి ప్రతి విద్యార్థి చేతిలో పాఠ్యపుస్తకం ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టెక్ట్స్‌బుక్స్‌ డైరెక్టర్‌ కె. రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పట్టణం నుంచి ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ, ఆటోనగర్‌లోని పాఠ్యపుస్తకాల గోదాముకు ఏప్రిల్ 15న‌ 1.20 లక్షల పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గోదాముల వద్ద రవీంద్రనాథ్‌ ప్రత్యేక పూజలు చేశారు.

ఆయన మాట్లాడుతూ 2024–25కు సంబంధించి 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు పాఠ్యపుస్తకాలు వచ్చాయని తెలిపారు. ఐదేళ్ల నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు అన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం సకాలంలో పాఠ్యపుస్తకాలు ఇస్తోందని చెప్పారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల్లోని పాఠశాలలు అన్నింటికీ సకాలంలో పాఠ్యపుస్తకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. పుస్తకాల పంపిణీ విషయంలో ఎక్కడా లోపం లేకుండా ప్రతి విద్యార్థికి అందేలా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

ఎన్టీఆర్‌ జిల్లాకు 13,94,918, కృష్ణాజిల్లాకు 13,04,663 పాఠ్యపుస్తకాలు అవసరమని వివరించారు. ఏప్రిల్ 15న‌ 1.20లక్షల పుస్తకాలు వచ్చాయని, మిగిలిన 25,79,581 పాఠ్యపుస్తకాలు మే నాటికి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఆటోనగర్‌ పాఠ్యపుస్తకాల గోదాము మేనేజరు ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. 

#Tags