AP 10th Class Supplementary Exam Dates: టెన్త్ ఫలితాల్లో ఫెయిలైన వారికి మరో ఛాన్స్.. సప్లిమెంటరీ పరీక్షల తేదీలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉదయం 11 గంటలకు విజయవాడలో విడుదల చేశారు. ఈ ఏడాది రికార్డుస్ధాయిలో కేవలం 22 రోజుల్లోనే టెన్త్ ఫలితాలను రిలీజ్ చేశారు. మార్చి నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.
ఆ స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు..
ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6.23 లక్షలు కాగా, గత ఏడాది ఫెయిల్ అయిన విద్యార్థులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఫలితాల్లో ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 86.69%గా ఉంది. 69.26శాతం మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్‌లోనే పాసయ్యారు. 2300 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, 17 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాకపోవడం గమనార్హం.
After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే..
అయితే పదో తరగతిలో తప్పిన విద్యార్థులు కుంగిపోవాల్సిన అవసరం లేదని, వాళ్లకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో మరో అవకాశం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రేపటి నుంచే ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లికేషన్లు స్వీకరిస్తామని, విద్యార్థులు స్కూల్ నుంచి మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నాలుగు రోజుల్లో షార్ట్ మోమోలు విడుదల చేస్తామన్నారు.