Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ‘స్పాట్’కు సర్వం సిద్ధం.
పార్వతీపురం టౌన్: పదో తరగతి జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్‌కు పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు జరగనున్న మూల్యాంకన విధులకు జిల్లా వ్యాప్తంగా 550 మంది సిబ్బందిని నియమించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాలను ఎనిమిది రోజుల వ్యవధిలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మూల్యాంకనం చేయాల్సి ఉంది. సబ్జెక్టుల వారీగా అవసరమైన ఉపాధ్యాయులను చీఫ్ ఎగ్జామినర్, ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లుగా నియమిస్తూ వారికి ఆర్డర్ కాపీలను పంపిన విద్యా శాఖాధికారులు వారిని విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆయా పాఠశాలల హెచ్‌ఎంలకు ఆదేశా లు జారీ చేశారు.
వివిధ జిల్లాల నుంచి వచ్చిన 80,123 స్క్రిప్ట్‌లకుగాను, ప్రతి ఉపాధ్యాయుడు రోజుకు 40 చొప్పున పేపర్లను మూల్యాంకనం చేయాల్సి ఉంది. మూల్యాంకన విధుల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులే ఉంటారు. స్పాట్ వాల్యూయేషన్ విధులకు నియమితులైన ఉపాధ్యాయులు సోమవారం ఉదయం 9 గంటల కు పార్వతీపురం పట్టణం డీవీఎం పాఠశాల, బాలిక ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో రిపోర్టు చేయాల ని జిల్లా విద్యాశాఖాధికారిణి పగడాలమ్మ ఆదేశించారు.
జిల్లాలో తొలిసారి..
పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భావం తరువాత టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి. స్పాట్ వాల్యూయేషన్ కోసం అన్ని వసతులు కలిగిన పాఠశాలను ఎంపిక చేయడంతో ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా చర్య లు తీసుకున్నారు. విధులకు హాజరు కానున్న ఉపాధ్యాయులకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో ఉండేలా చర్యలు చేపట్టారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భావం తరువాత తొలి సారి నిర్వహిస్తున్న టెన్త్ స్పాట్ వాల్యూయేషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేశాం. రెండు పాఠశాలలను స్పాట్ వాల్యూయేషన్‌కు ఎంపిక చేశాం. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 80,123 స్క్రిప్ట్‌లకు ప్రతి ఉపాధ్యాయుడు రోజు కు 40 చొప్పున పేపర్లను మూల్యాంనం చేసేలా ఆదేశాలు జారీ చేశాాం. స్పాట్ వాల్యూయేషన్‌కు హాజరు కానున్న ఉపాధ్యాయులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం.
– పగడాలమ్మ, జిల్లా విద్యా శాఖాధికారిణి, పార్వతీపురం మన్యం
Also Read ; ఏపీ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..?