Dipali Goenka Success Story: 18 ఏళ్లకే పెళ్లి.. నేడు రూ.18566 కోట్ల కంపెనీకి బాస్.. ఎవరీ దీపాలి?
ఒక స్త్రీ సంపాదించగలిగినప్పుడు.. ఆమె అధికారం పొందుతుందని, తన బిడ్డలను పాఠశాలకు వెళ్లేలా చేస్తుందని గట్టిగా నమ్మే మహిళలలో ఒకరు వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'దీపాలీ గోయెంకా'. 18 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్న ఈమె అతి తక్కువ కాలంలోనే ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరుగా నిలిచారు.
వ్యాపారవేత్త బాలక్రిషన్ గోయెంకాను 18 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్న దీపాలీ గోయెంకా.. వివాహం తరువాత 1987లో ముంబైకి వెళ్లారు. తనకంటూ ఓ గుర్తిపు తెచ్చుకోవాలనే కోరికతో భర్త చేసే టెక్ట్స్‌టైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. అతి తక్కువ కాలంలోనే తన కొత్త ఆలోచనలతో తనను తాను నిరూపించుకోగలిగింది.
సైకాలజీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన దీపాలీకి టెక్ట్స్‌టైల్ రంగంలో ఏ మాత్రం అనుభవం లేదు. ఈమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ప్రెసిడెంట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ వంటివి కూడా పూర్తి చేసింది. పెళ్ళైన తరువాత ఈ టెక్ట్స్‌టైల్ రంగంలోకి అడుగుపెట్టింది.
పరిచయమే లేని ఓ రంగంలో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే.. ఆ రంగంలో ఆరితేరిన దీపాలీ 2016లో ఫోర్బ్స్ ఆమెను ఆసియాలో 16వ అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తించింది. దీపాలీ వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా అనేక దాతృత్వ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటుంది. నేడు ఆమె కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ. 18,566 కోట్లు కావడం గమనార్హం.
దీపాలీ ‘వెల్‌స్పన్’లోకి అడుగు పెట్టినప్పుడు కేవలం ఏడు శాతం మంది మహిళలే పనిచేస్తుండేవారు. కానీ ఆ సంఖ్య దినదినాభివృద్ధి చెందింది. నేడు ఆ సంస్థలో ఏకంగా 30 శాతం కంటే ఎక్కువ మహిళలు పనిచేస్తున్నట్లు సమాచారం. ఆమె ఎదగడమే కాకుండా చుట్టూ ఉన్న మహిళలు కూడా ఎదగాలనే సంకల్పంతో మహిళలను దీపాలీ ప్రోత్సహిస్తోంది.