Jobs in Fast Track Special Court: ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టులో వివిధ ఉద్యోగాలు..

నాగర్‌కర్నూల్‌ క్రైం: జిల్లాలోని ఫాస్ట్‌ట్రాక్‌ స్పెషల్‌ కోర్టులో కాంట్రాక్టు పద్ధతిన రెండేళ్ల పాటు పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జడ్జి రాజేష్‌బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌–3, ఆఫీస్‌ సబార్డినేట్‌, డ్రైవర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీలోగా స్పీడ్‌ పోస్టు, ఆర్డీనరీ పోస్టు ద్వారా ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి, నాగర్‌కర్నూల్‌ చిరునా మాకు దరఖాస్తులు పంపాలని సూచించారు.

మానసిక ఒత్తిడికి గురికావొద్దు
నాగర్‌కర్నూల్‌ క్రైం: పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దని జిల్లా ఎన్‌సీడీ ప్రొగ్రాం అధికారి డా.కృష్ణమోహన్‌ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు మానసిక ఒత్తిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దన్నారు. ప్రణాళికాబద్ధంగా చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ అనసూయ, డా.వైష్ణవి, విజయ్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంచాలి
కందనూలు: విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంచేలా విద్యాబోధన ఉండాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జిల్లాలోని జీవశాస్త్రం, భౌతిక రసాయన శాస్త్రం ఉపాధ్యాయులకు ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సైన్స్‌ అకాడమీ సహకారంతో భౌతిక రసాయన, జీవశాస్త్ర ప్రయోగాల ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన చేయడంపై ఉపాధ్యాయులకు ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణతో ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యం పెరుగుతుందని.. తద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. తరగతి గదిలో ప్రయోగాలు చేయడం వల్ల విద్యార్థుల్లో ఆచరణాత్మక నైపుణ్యం పెంపొందుతుందన్నారు. పాఠశాలలకు అందించిన సైన్స్‌ పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కాగా ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న జీవశాస్త్ర, భౌతిక రసాయన శాస్త్రల ప్రయోగ కృత్యాలపై ఉపాధ్యాయులు వర్క్‌షాప్‌ నిర్వహించారు. జిల్లా సైన్స్‌ అధికారి కృష్ణారెడ్డి, ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ నాగరాజు, సైన్స్‌ అకాడమీ మాస్టర్‌ ట్రైనర్స్‌ ఎస్‌.రేవతి, సత్యానందం, శోభారాణి పాల్గొన్నారు.

#Tags