Good News For Anganwadis: అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్ భారీగా నిధులు...
కొత్తగూడెంటౌన్: పది నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాల అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో కిరాయిలు చెల్లించాలంటూ టీచర్లపై ఓనర్లు ఒత్తిడి తెస్తుండగా.. ‘పెండింగ్‌లో అద్దె బిల్లులు’అనే శీర్షికతో ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైంది.
ఈమేరకు స్పందించిన అధికారులు సోమవారం అంగన్‌వాడీ కేంద్రాల అద్దెలను విడుదల చేస్తూ.. వారి ఖాతాల్లో జమచేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన అద్దె బకాయిలు ప్రభుత్వం విడుదల చేసింది.
జిల్లాలోని 758 అంగన్‌వాడీ అద్దె భవనాలకు పది నెలల అద్దె బకాయిలకు గాను ఆరు నెలలకు సంబంధించి రూ.84,91,420లను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లా ఐసీడీఎస్ పరిధిలో మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలు మొత్తం 2,060 ఉండగా.. ఇందులో 782 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, మరో 493 కేంద్రాలు ఉచిత భవనాలు ఉన్నాయి.
కానీ ఇందుటో 758 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అయితే గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఆరు నెలల బిల్లులు ఆయా ఖాతాల్లో జమ చేయగా.. మరో నాలుగు నెలల అద్దె చెల్లించాల్సి ఉందని అంగన్‌వాడీ టీచర్లు పేర్కొంటున్నారు.
ఈ విషయమె జిల్లా సంక్షేమశాఖ అధికారి వేల్పుల విజేత వివరణ కోరగా.. జిల్లాలో 758 అద్దె భవనాలకు గాను 10 నెలలు అద్దె బకాయి ఉందన్నారు. ఇందులో ఆరు నెలలకు రూ.84.91 లక్షలు విడుదలయ్యాయని చెప్పారు.
విడుదలైన బకాయి వివరాలిలా..
సెప్టెంబర్ రూ.14,12,850
అక్టోబర్ రూ.14,14,850
నవంబర్ రూ.14,14,850
డిసెంబర్ రూ.14,16,850
జనవరి రూ.14,17,010
ఫిబ్రవరి రూ.14,17,010
మొత్తం రూ.84,91,420