రేపు జాబ్‌ మేళా

వికారాబాద్‌ అర్బన్‌: జిల్లా ఎంప్లాయిమెంట్‌ కార్యాలయం ఐటీఐ కళాశాల శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పన జిల్లా అధికారి షేక్‌ అబ్దుల్‌ సుభాన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Job fair tomorrow

ప్రీమియర్‌ హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌, హోమ్‌ నర్సింగ్‌లో ఉద్యోగాల భర్తీకోసం మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌, పారా మెడికల్‌, 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్‌ పాస్‌, ఫెయిల్‌ అయిన అభ్యర్థులు కూడా అర్హులని తెలిపారు. ఎంపికై న వారికి ఉచిత భోజన వసతులు కల్పిస్తారని తెలిపారు. వివరాలకు 9676047444 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

నాటిన చోటే నాటి!

పెద్దేముల్‌లో అభాసుపాలవుతున్నహరితహారం

పెద్దేముల్‌: హరిత మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ అధికారులు ఏటా వేల సంఖ్యలో మొక్కలు నాటుతున్నా వీటి సంరక్షణ మూణ్నాళ్ల ముచ్చటగానే మారుతోంది. 2009 నుంచి ఏటా వర్షాకాలంలో బ్లాక్‌ ప్లాంటేషన్‌ , హరిత మహోత్సవం పేరుతో మండల పరిధిలోని నాగులపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఏటా వేలాది మొక్కలు నాటుతున్నారు. కానీ ఇవన్నీ లెక్కలకే పరిమితమవుతున్నాయి. కనీసం పది శాతం మొక్కలు కూడా బతకడం లేదని నాగులపల్లి, తట్టెపల్లి, అడ్కిచెర్ల, ఆత్కూర్‌, ఇందూరు, పాషాపూర్‌ తదితర గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఈ నెల 19న హరిత మహోత్సవం పేరుతో ప్రభుత్వం నాగులపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చేతుల మీదుగా హరితమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. ఈసారి కూడా ఇక్కడే సుమారు 11 వేల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. సుమారు పదేళ్లుగా ఇక్కడ మొక్కలు నాటడం తప్ప.. కనీసం పదిశాతం కూడా బతకలేదు. అయినప్పటికీ హరితహారం నిర్వహణకు ఏటా ఈ ప్రాంతాన్నే ఎంచుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓసారి రోడ్డుకు ఇటువైపు.. మరో ఏడాది అటు వైపు మొక్కలు నాటడం తప్ప చెట్లుగా ఎదిగింది లేదు. కనీసం ఈ ఏడాది నాటే మొక్కలైనా బతికేలా చూడా లని ప్రజలు కోరుతున్నారు. నాగులపల్లి ఫారెస్ట్‌లో ఈఏడాది మొక్కలు నాటుతామని తాండూరు ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ శ్యామ్‌సుందర్‌రావు, సెక్షన్‌ అధికారి మమత తెలిపారు. మొక్కలన్నీ బతికేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.

సివిల్‌ సర్వీసెస్‌కు

ఉచిత శిక్షణ

ఇబ్రహీంపట్నం రూరల్‌: తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్‌, మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌ 2024 ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ప్రవీణ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల తండ్రి వార్షికాదాయం రూ.2 లక్షలలోపు ఉన్న వారు అర్హులన్నారు. ఎంపిక విధానంలో రిజర్వేషన్‌ నియమం అమలవుతుందన్నారు. స్క్రీనింగ్‌ టెస్ట్‌ వచ్చేనెల 23న నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 040– 23236112 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఆధార్‌ సేవలను

వినియోగించుకోండి

తపాలశాఖ సబ్‌ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ జుబేర్‌

షాద్‌నగర్‌రూరల్‌: తపాలశాఖ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్‌ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని తపాలశాఖ సబ్‌ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ జుబేర్‌ అన్నారు. పట్టణంలోని తపాలశాఖ కార్యాలయంలో కొనసాగుతున్న ఆధార్‌ సేవలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధార్‌ కార్డులను అప్‌డేట్‌ చేసుకునేవారు తపాలశాఖ కార్యాలయంలో కొనసాగుతున్న ఆధార్‌ కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. ప్రతిరోజు 50 నుంచి 60 మంది ఆధార్‌ సేవలను వినయోగించుకొని అప్‌డేట్‌ చేసుకుంటున్నారని అన్నారు. తపాలశాఖ కార్యాలయంలో 1000 మందికి పైగా ఆధార్‌ సేవలను వినియోగించుకున్నారని వివరించారు.

 

నాగులపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో నాటిన మొక్కలు

#Tags